ట్రూకాలర్ వర్సెస్ TRAI: కాలర్ ఐడీ నియంత్రణపై ముదిరిన వివాదం!
TRAI నిబంధనలపై ట్రూకాలర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 140, 1600 నంబర్ల మినహాయింపు వల్లే దేశంలో స్పామ్ కాల్స్ పెరిగి, బ్యాంకింగ్ నంబర్లను సైతం జనం ఇగ్నోర్ చేస్తున్నారని ఆరోపించింది.

Published : July 9, 2026 at 5:10 PM IST
Hyderabad: భారతదేశంలో స్పామ్ కాల్స్, కాలర్ ఐడీ యాప్‌ల నియంత్రణకు సంబంధించి సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ స్పామ్ డిటెక్షన్ ప్లాట్‌ఫారమ్ 'ట్రూకాలర్', టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మధ్య విభేదాలు తలెత్తాయి.
వివిధ నివేదికల ప్రకారం, కాలర్ ఐడీ యాప్‌లను తమ రెగ్యులేటరీ పరిధిలోకి తీసుకురావాలని TRAI భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను ట్రూకాలర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై స్పందించిన ట్రూకాలర్ సీఈవో రిషిత్ ఝున్‌ఝున్‌వాలా, TRAI చర్యలను తప్పుబట్టారు.
ట్రాయ్ (TRAI) ఆదేశాల నేపథ్యం:
గతేడాది టెలికాం నియంత్రణ సంస్థ TRAI కాలర్ ఐడీ ప్లాట్‌ఫారమ్‌లకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. 140, 1600 సిరీస్‌లతో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్పామ్ (Spam)గా మార్క్ చేయడం వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
ఈ రెండు ప్రత్యేక నంబర్ ప్రిఫిక్స్‌లను అధీకృత కమర్షియల్, బ్యాంకింగ్ కమ్యూనికేషన్ల కోసం TRAI స్వయంగా కేటాయించింది.
ఇందులో 140 సిరీస్ నంబర్లను కేవలం టెలిమార్కెటింగ్ కాల్స్ కోసం రిజర్వ్ చేయగా, 1600 సిరీస్ నంబర్లను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన సర్వీస్ కాల్స్ కోసం కేటాయించారు.
అయితే కాలర్ ఐడీ యాప్స్‌లో ఈ నంబర్లకు కూడా స్పామ్ లేబుల్ పడటం వల్ల వినియోగదారులు బ్యాంకులు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే అసలైన (జెన్యూన్) కాల్స్‌ను కూడా ఇగ్నోర్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TRAI పేర్కొంది.
ట్రూకాలర్ స్పందన: TRAI జారీ చేసిన ఆదేశాలను తాము పాటించినప్పటికీ, దీనివల్ల స్పామ్ డిటెక్షన్ వ్యవస్థ బలహీనపడిందని ట్రూకాలర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నంబర్ సిరీస్‌లను ఆసరాగా చేసుకుని స్కామర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ అంశంపై ట్రూకాలర్ సీఈవో రిషిత్ ఝున్‌ఝున్‌వాలా తన 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు. వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ప్రకారం 140, 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగాయని తెలిపారు. అయితే TRAI నిబంధనల కారణంగా వీటికి స్పామ్ లేబుల్ వేయలేకపోతున్నామని వివరించారు.
Wondering why spam calls have increased SIGNIFICANTLY in India recently? Well, it's actually going to get worse, here’s why:
— Rishit Jhunjhunwala (@rishj) July 8, 2026
In late 2025, TRAI enforced businesses to call consumers using 140 (for telemarketing calls) and 1600 (for BFSI companies to make service/transaction… pic.twitter.com/Gy5ykiBxrL
దీని ఫలితంగా, ఈ నంబర్ల నుంచి వచ్చే అసలైన (Genuine) కాల్స్‌ను కూడా వినియోగదారులు స్పామ్ అనుకుని ఎత్తడం మానేశారు. అందుకే, ఈ రెండు సిరీస్‌ల నుంచి రోజుకు 51 మిలియన్లకు పైగా అంటే సుమారు 5.1 కోట్ల కాల్స్ సమాధానం లేకుండా (అన్‌ఆన్సర్డ్) మిగిలిపోతున్నాయని వెల్లడించారు.
ట్రూకాలర్ సీఈవో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత ఎనిమిది నెలల్లో ట్రూకాలర్ వినియోగదారులు 140 సిరీస్ నుంచి వచ్చిన 81 శాతం కాల్స్‌ను, అలాగే 1600 సిరీస్ నుంచి వచ్చిన 79 శాతం కాల్స్‌ను పూర్తిగా విస్మరించారు.
అక్టోబర్ 2025 నుంచి చూసుకుంటే, 1600 సిరీస్ కాల్స్‌ను బ్లాక్ చేయడంలో ఏకంగా 208 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈ కాలంలో వినియోగదారులు రెండు సిరీస్‌లకు చెందిన దాదాపు 7.4 కోట్ల కాల్స్‌ను మాన్యువల్‌గా (స్వయంగా) బ్లాక్ చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 140 సిరీస్‌కు చెందిన 4 లక్షల కాల్స్, 1600 సిరీస్‌కు చెందిన 1.25 లక్షల కాల్స్ బ్లాక్ అవుతున్నాయి.
'ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్' బ్యాడ్జ్ లాంఛ్: ఈ ధోరణిని దృష్టిలో ఉంచుకుని ట్రూకాలర్ తన యూజర్ల కోసం 'ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్' బ్యాడ్జ్ అనే కొత్త ఫీచర్‌ను లాంఛ్ చేసింది. దీని ద్వారా స్పామ్ కాల్స్‌కు, నిజమైన బిజినెస్ కాల్స్‌కు మధ్య యూజర్లు తేడా గుర్తించగలుగుతారని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు.
1600 సిరీస్‌లోని ఏదైనా నంబర్‌ను ఇప్పటికే చాలా మంది బ్లాక్ చేసి ఉంటే, ఆ విషయాన్ని కాల్ అందుకునే ముందే యూజర్లకు కనిపిస్తుందని చెప్పారు. తద్వారా కాల్ స్వీకరించడానికి ముందే అది స్పామ్ కాల్ కావచ్చని వినియోగదారులకు అర్థమవుతుందని వివరించారు.
అంతేకానీ ప్రభుత్వమే (TRAI) నేరుగా స్పామ్ లేబుల్ పెట్టవద్దని ఆదేశించినందున ట్రూకాలర్ ఆ కాల్‌పై నేరుగా స్పామ్ ట్యాగ్ వేయబోదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ 'ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్' బ్యాడ్జ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్తులో 1600, 140 సిరీస్ నంబర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా స్క్రీన్‌పై చూపించకుండా TRAI తమపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉందని ట్రూకాలర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

