ETV Bharat / technology

TRAI కీలక నిర్ణయం: యుటిలిటీ, కొరియర్ సేవల కోసం '1601' నంబర్ సిరీస్ ప్రారంభం

నకిలీ కాల్స్‌కు చెక్ పెడుతూ కరెంట్, గ్యాస్, కొరియర్ కంపెనీల సేవల కోసం ట్రాయ్ (TRAI) కొత్తగా '1601' సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది.

Representative image
Representative image (IANS Photo)
author img

By ETV Bharat Tech Team

Published : August 11, 2026 at 7:25 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: యుటిలిటీ, కొరియర్, లాజిస్టిక్స్ సేవల కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్తగా '1601' సిరీస్ ఫోన్ నంబర్లను ప్రారంభించింది. వినియోగదారులు నకిలీ కాల్స్ బారిన పడకుండా, అసలైన కంపెనీల నుంచి వచ్చే సేవా, లావాదేవీల (Service and Transactional) కాల్‌లను సులభంగా గుర్తించేందుకు వీలుగా ట్రాయ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం: ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్లను ఉపయోగించి, తాము ఫలానా ప్రముఖ కంపెనీ ప్రతినిధులమంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ విధమైన మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, వాయిస్ ఆధారిత కమ్యూనికేషన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడానికి ట్రాయ్ ఈ సరికొత్త సిరీస్‌ను తీసుకువచ్చింది.

మొదటి దశలో వీరికే నంబర్లు కేటాయింపు:

తొలి దశలో భాగంగా ప్రజా అవసరాలకు సంబంధించిన కింది రంగాల సంస్థలకు ఈ 1601 సిరీస్ నంబర్లను కేటాయించనున్నారు:

  • విద్యుత్ పంపిణీ సంస్థలు
  • నీటి సరఫరా విభాగాలు
  • సిటీ గ్యాస్ కంపెనీలు
  • LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు
  • కొరియర్ కంపెనీలు
  • పార్సెల్ డెలివరీ సర్వీసులు
  • సరుకు రవాణా చేసే లాజిస్టిక్స్ సంస్థలు

ఆర్థిక రంగంతో కలవకుండా ప్రత్యేక ఏర్పాట్లు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI), ప్రభుత్వ సంస్థల సమాచారం చాలా సున్నితమైనది. అందువల్ల, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కాల్స్, సాధారణ సేవా రంగాల కాల్స్ ఒకదానితో ఒకటి కలవకుండా ఉండేందుకు, కేవలం నాన్-BFSI (ఆర్థికేతర), ప్రభుత్వేతర సేవా రంగాల కోసమే ఈ 1601 సిరీస్‌ను ప్రత్యేకంగా కేటాయించినట్లు ట్రాయ్ స్పష్టం చేసింది.

1601 నంబర్ల కేటాయింపు & నిబంధనలు:

  • నేరుగా కంపెనీలకే: ఈ 1601 నంబర్లను మధ్యవర్తులు లేదా అగ్రిగేటర్లకు కాకుండా, కేవలం అర్హత కలిగిన కంపెనీలకు మాత్రమే నేరుగా కేటాయిస్తారు.
  • టెలికాం సంస్థల తనిఖీ: నంబర్లను కేటాయించే ముందు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (Jio, Airtel మొదలైనవి) ఆయా కంపెనీల వివరాలను పూర్తిగా పరిశీలిస్తాయి.
  • 90 రోజుల గడువు: మొదటి దశలో ఉన్న కంపెనీల ఆన్‌బోర్డింగ్, మైగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ట్రాయ్ (TRAI) 90 రోజుల సమయాన్ని నిర్ణయించింది.

ప్రమోషనల్ కాల్స్‌పై నిషేధం:

  • కచ్చితమైన అండర్‌టేకింగ్: ఈ నంబర్లను పొందే కంపెనీలు తాము కేవలం 'సేవా & లావాదేవీల' (Service and Transactional) కోసమే వీటిని వాడుతామని హామీ పత్రం (Undertaking) ఇవ్వాల్సి ఉంటుంది.
  • ప్రకటనల కాల్స్ కూడదు: ఈ 1601 సిరీస్ నంబర్లను ఏ కంపెనీ లేదా సంస్థ కూడా ఎలాంటి ప్రచార/ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించడానికి వీల్లేదు.

1600 సిరీస్ తర్వాతే 1601 సిరీస్: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం, ప్రభుత్వ సంస్థల సేవా కాల్స్ కోసం ఇప్పటికే 1600 సిరీస్ కేటాయించారు. ఆ తర్వాతే ఇప్పుడు ఇతర సేవా రంగాల కోసం ఈ 1601 సిరీస్​ను తీసుకువచ్చారు.