ETV Bharat / technology

మహాశివరాత్రి తర్వాత ఆకాశంలో అద్భుతం- 'జ్వాలా వలయం'తో రవి దర్శనం- ఎక్కడ, ఎలా చూడాలంటే?

ఇవాళే కంకణాకార సూర్యగ్రహణం- ది బెస్ట్ వ్యూ ఎక్కడ కన్పిస్తుందంటే?

Solar Eclipse
Solar Eclipse (Photo Credit- JAXA/NASA)
author img

By ETV Bharat Tech Team

Published : February 11, 2026 at 12:11 PM IST

|

Updated : February 17, 2026 at 9:21 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: నేడు (ఫిబ్రవరి 17) గగనతలంలో అరుదైన, సుందర దృశ్యమొకటి ఆవిష్కృతం కానుంది. అది 'రింగ్ ఆఫ్ ఫైర్' అనే కంకణాకార సూర్యగ్రహణం. వలయాకారంలో రవి దర్శనాన్ని అందించే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకమైన ఖగోళ విశిష్టతను సంతరించుకుంది.

సాధారణంగా సూర్యుడు, భూమి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. అప్పుడు సూర్యుడు కనిపించకపోవడం వల్ల భూమిపై సూర్య కాంతి తగ్గిపోతుంది. అయితే ఈసారి అది భూమికి చాలా దూరాన ఉంటుందని నాసా చెబుతోంది. ఈ కారణంగా చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయలేడు కానీ మండుతున్న సూర్యుడి అగ్ని గోళం కేంద్ర భాగం కనిపించకుండా చంద్రుని చిన్న చీకటి వృత్తం కమ్మేసిన దృశ్యాలు మనకు కన్పిస్తాయి.

ఇది మధ్యలో చీకటిగా, చుట్టూ మండుతున్నట్లుగా కనువిందైన అగ్ని వలయ దృశ్యాలను సృష్టిస్తుంది. ఈ వలయాన్ని "రింగ్ ఆఫ్ ఫైర్" లేదా "జ్వాలా వలయం"గా పిలుస్తారు. ఈ గ్రహణాన్ని అయితే పెనుంబ్రల్ సూర్యగ్రహణంగా చెబుతారు. ఇటువంటి ఖగోళ సంఘటనలు చాలా అరుదుగా సంభవిస్తాయని, ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు!

పెనుంబ్రల్ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?: పెనుంబ్రల్ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. సంపూర్ణ గ్రహణంలో, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. ఆ సమయంలో మన భూమిపై నుంచి సూర్యుడు పూర్తిగా కనిపించకుండా కనుమరుగవుతాడు. ఈ సందర్భాల్లో సూర్యకాంతి భూమిపై పడకపోవడంతో పగలు కూడా చీకటిగా అనిపిస్తుంది.

ఇక పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు దూరంగా ఉంటాడు, కాబట్టి సూర్యుని అంచులు బహిర్గతమవుతాయి. Space.com ప్రకారం, ఈసారి చంద్రుడు సూర్యుని కేంద్రంలో 96 శాతం కవర్ చేస్తాడు. ఈ "రింగ్ ఆఫ్ ఫైర్" దృశ్యం గరిష్ఠంగా 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. ఫోర్బ్స్ ప్రకారం, ఈ గ్రహణం ఫిబ్రవరి 17న 07:01 UTC అంటే భారత కాలమానం ప్రకారం అదేరోజు సాయంత్రం (ఇవాళ) 5:42 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ గ్రహణం ఎక్కడ, ఎలా కనిపిస్తుంది?: మొత్తం గ్రహణం ప్రధానంగా అంటార్కిటికా నుంచి "జ్వాలా వలయం" రూపంలో కనిపిస్తుంది. కాంకోర్డియా, మిర్నీ పరిశోధనా కేంద్రాల నుంచి ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే దేశాలతో పాటు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీలోని కొన్ని ప్రాంతాల నుంచి పాక్షికంగా కనిపిస్తుంది. అయితే గ్రహణ మార్గం దక్షిణార్ధగోళంలో ఉన్నందున భారతదేశంలో ఇది కనిపించదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నవారైనా ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించగలరు.

సురక్షిత వీక్షణ కోసం జాగ్రత్తలు: సూర్యగ్రహణాన్ని వీక్షించేటప్పుడు కళ్లను రక్షించుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి. దీని కోసం, ISO 12312-2 సర్టిఫైడ్ "ఎక్లిప్స్ గ్లాసెస్​"ను ఉపయోగించాలి లేదా పిన్‌హోల్ ప్రొజెక్టర్, టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ల ద్వారా పరోక్ష పరిశీలన చేయాలి.

పిల్లలకు ఈ గ్రహణాన్ని చూపించాలనుకుంటే వారికి ప్రత్యేక సూచనలు ఇవ్వాలి. పరికరాలను విశ్వసనీయ వనరుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ ఖగోళ సంఘటన విశ్వం రహస్యాలను, ప్రకృతి శక్తిని మనకు గుర్తు చేస్తుంది. ఈ గ్రహణ వీక్షణ ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు అపూర్వమైనది, అదే సామాన్యుల విషయానికి వస్తే ఇది ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అనువైన మహత్తర సమయంగా భావించవచ్చు!

Last Updated : February 17, 2026 at 9:21 AM IST