ETV Bharat / technology

శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ ఖరారు: ఫోల్డబుల్ ఫోన్లపై భారీ అంచనాలు!

శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో కొత్త గెలాక్సీ Z Fold8 Wide, Z Flip8 SE ఫోల్డబుల్ ఫోన్లతో పాటు మరిన్ని డివైజ్‌లు లాంచ్ కానున్నాయి.

Samsung Galaxy Unpacked 2026 Date Announced
Samsung Galaxy Unpacked 2026 Date Announced (Photo Credit- Samsung Newsroom)
author img

By ETV Bharat Tech Team

Published : July 8, 2026 at 10:30 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ తన మోస్ట్ అవేటెడ్ 'Galaxy Unpacked' ఈవెంట్ తేదీని బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం జులై 22, 2026న యూకే (UK)లోని లండన్ నగరంలో జరగనుంది. ఈ ఈవెంట్‌లో సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్, తన తదుపరి తరం ఫోల్డబుల్ పరికరాలతో పాటు 'Galaxy Z Fold8 Wide' ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

రాబోయే హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ గురించి శాంసంగ్ ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ, ఈసారి సరికొత్త డిజైన్‌తో కూడిన డివైజ్‌లను, మరింత మెరుగైన AI ఆధారిత, పర్సనలైజ్డ్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లను తీసుకురాబోతున్నట్లు హింట్ ఇచ్చింది.

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026: ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

ఎప్పటిలాగే, ఈ రాబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ను Samsung.com, Samsung Newsroom, Samsung అధికారిక YouTube ఛానల్‌లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం IST సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇతర దేశాల టైమింగ్స్: BST మధ్యాహ్నం 2 గంటలకు, EDT ఉదయం 9 గంటలకు, CEST మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈవెంట్‌ను లైవ్‌లో చూడడంతో పాటు, కొత్త డివైజ్‌ల అప్‌డేట్స్, టీజర్లు, ట్రైలర్లు, ముందస్తు బుకింగ్ ప్రీ-ఆర్డర్ ఆఫర్ల వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు samsung.com/unpacked వెబ్‌సైట్‌లో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఈ ముందస్తు రిజర్వేషన్ (Pre-reservation) ధర రూ. 999గా ఉంది. ఈ టికెట్ ద్వారా రూ. 50,000 విలువైన వోచర్‌ను గెలుచుకునే అవకాశం లభించడమే కాకుండా, రిజిస్టర్ చేసుకున్న ప్రతి వినియోగదారునికి రూ. 2,799 విలువైన వోచర్ కచ్చితంగా లభిస్తుంది. దీనితో పాటు పాత పరికరం (ఓల్డ్ డివైజ్) పై అత్యధిక ఎక్స్ఛేంజ్ వాల్యూ (Exchange value) లభిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.

ఈ ఈవెంట్​లో ఏం ఆశించవచ్చు?:

సాధారణంగా శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ లైనప్‌లో రెండు డివైజ్‌లు ఉంటాయి. ఒకటి బుక్-స్టైల్ Z Fold, మరొకటి ఫ్లిప్-స్టైల్ Z Flip. అయితే, ఈసారి శాంసంగ్ ఏకంగా మూడు ఫోల్డబుల్ పరికరాలను విడుదల చేయబోతోందని అంచనా. వీటిలో రెగ్యులర్ Z Fold8 మోడల్ మరింత వెడల్పాటి స్క్రీన్, కొత్త ఫ్రేమ్‌తో 'Galaxy Z Fold8 Wide' పేరుతో రాబోతోంది. ఈ 'వైడ్' ఫోల్డబుల్ గురించి ఇప్పటికే అనేక లీక్స్ వెలువడ్డాయి. అంతేకాక ఈవెంట్ టీజర్ ట్యాగ్‌లైన్ "A New Shape Unfolds" కూడా ఈసారి ఫోల్డబుల్ డిజైన్‌లో భారీ మార్పులు రాబోతున్నాయని స్పష్టం చేస్తోంది.

ఇక 'Galaxy Z Flip8' మోడల్ ఎప్పటిలాగే సుపరిచితమైన డిజైన్ (Form factor) తోనే వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ లైనప్‌లో మూడో డివైజ్ మాత్రం సరసమైన ధరలో లభించే కొత్త ఫ్లిప్-స్టైల్ ఫోన్ కావచ్చు. దీనిని 'Galaxy Z Flip8 FE' పేరుతో తీసుకురావచ్చు.

ఈ మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లతో పాటు, శాంసంగ్ ఈ ఈవెంట్‌లో గెలాక్సీ వాచ్9 (Galaxy Watch9) సిరీస్‌ను కూడా ఆవిష్కరించవచ్చు. అంతేకాక, ఈ కొత్త లైనప్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పలు AI ఫీచర్లను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

తదుపరి తరం గెలాక్సీ డివైజ్‌లు వినియోగదారులకు మరింత "పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ అనుభవాన్ని" అందించడానికి సరికొత్త "ఇంటెలిజెంట్ సామర్థ్యాలను" కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. దీంతో AI యుగంలో ఈ డివైజ్‌లు ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతాయని శాంసంగ్ ధీమా వ్యక్తం చేస్తోంది.