ఆగస్టు 12న అంతరిక్షంలో మహా అద్భుతం- ఒకేరోజు 4 అరుదైన ఖగోళ వింతలు!
ఆగస్టు 12న ఆకాశంలో నభూతో నభవిష్యతి అనదగ్గ మహా అద్భుతం జరగబోతోంది! ఒకే రోజు నాలుగు అరుదైన ఖగోళ వింతలు ఒకదాని వెంట ఒకటిగా అంతరిక్ష ప్రియులను కనువిందు చేయనున్నాయి.

Published : August 11, 2026 at 4:44 PM IST
|Updated : August 12, 2026 at 10:08 AM IST
Hyderabad: ఖగోళ శాస్త్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2026, ఆగస్టు 12న ఆకాశంలో ఒక అద్భుత దృశ్యకావ్యం ఆవిష్కృతం కానుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే నాలుగు ఖగోళ సంఘటనలు సంభవించనున్నాయి. ఒకవైపు గ్రహాల పరేడ్, మరోవైపు సంపూర్ణ సూర్యగ్రహణం, ఇంకోవైపు అమావాస్య చీకట్లు.. వీటికి తోడు కటిక చీకట్లను చీల్చుకుని, నిప్పులు కక్కుతూ నింగి నుంచి దూసుకొచ్చే ఉల్కాపాతం! ఇలాంటి ఒక అరుదైన ఖగోళ సంయోగం ప్రపంచవ్యాప్తంగా ఆకాశంలో మునుపెన్నడూ చోటుచేసుకోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా ఈ నాలుగు వింతలు ఏడాది పొడవునా వేర్వేరు నెలల్లో విడివిడిగా జరుగుతుంటాయి. కానీ, ప్రకృతి లయలో ఇవన్నీ ఒకే రోజున, ఒకే వరుసలో రావడం అత్యంత అసాధారణమైన విషయమని ఖగోళ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
On Aug. 12, you have the chance to experience a total solar eclipse from anywhere in the world.
— NASA (@NASA) August 5, 2026
Starting at 1:15pm ET (1715 UTC), we'll stream live as the Moon passes in front of the Sun, bringing the views and the science straight to you.
Get safe viewing tips in this video. pic.twitter.com/AMkUR50Fo7
1. మొదటి అద్భుతం: ఆకాశంలో ఆరు గ్రహాల పరేడ్!
ఆగస్టు 12 తెల్లవారుజామున, సూర్యుడు ఇంకా ఉదయించకముందే ఆకాశంలో తూర్పు నుంచి పడమర వరకు ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది. మన సౌర కుటుంబంలోని ఆరు గ్రహాలు—బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్—ఒకే వరుసలో కొలువుదీరనున్నాయి. ఈ ప్లానెట్ పరేడ్‌లో అంగారకుడు, శని గ్రహాలను మనం నేరుగా కంటితోనే చూడవచ్చు. కానీ, చాలా దూరంలో ఉండే యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను చూడాలంటే మాత్రం బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ అవసరమవుతుంది.
అసలు ప్లానెట్ పరేడ్ అంటే ఏంటి?: ఆస్ట్రానమర్స్ వితౌట్ బోర్డర్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ఆండ్రూ ఫాజెకాస్ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఖగోళ శాస్త్రంలో "ప్లానెట్ పరేడ్" అనేది అధికారిక పదం కాదని.. గ్రహాలన్నీ ఆకాశంలో దాదాపు ఒకే సరళరేఖలో, ఏకకాలంలో కనిపించే అరుదైన స్థితిని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పేరు పెట్టారని ఆయన వివరించారు.
2. రెండో ఘట్టం: సంపూర్ణ సూర్యగ్రహణం
అదే రోజున కాసేపటి తర్వాత చంద్రుడు.. భూమికి, సూర్యునికి మధ్యలో రావడం వల్ల ఆకాశంలో "సంపూర్ణ సూర్యగ్రహణం" సంభవించనుంది. ఈ అద్భుత దృశ్యం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల వారికి సంపూర్ణంగా కనిపించనుంది. అయితే ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఖండాల్లోని మిలియన్ల ప్రజలకు ఇది పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది.
ఇక భారత్ విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. భారత ప్రామాణిక కాలమానం (IST) ప్రకారం.. ఈ ఘట్టం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:45 గంటల నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల మధ్య సంభవిస్తుంది. అప్పటికే దేశవ్యాప్తంగా సూర్యుడు క్షితిజ సమాంతర రేఖకు (horizon) చాలా దిగువకు వెళ్లిపోయి ఉంటాడు కాబట్టి, భారతీయ ఆకాశం నుంచి దీనిని వీక్షించే అవకాశం ఉండదు.
అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?: భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఆ సమయంలో సూర్యుడు కనిపించకపోవడం వల్ల భూమిపై సూర్య కాంతి తగ్గిపోతుంది. ఇది అమావాస్య రోజుల్లోనే జరుగుతుంది. కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవని గుర్తుంచుకోవాలి.
సంపూర్ణ సూర్యగ్రహణం అంటే?: సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే అరుదైన ఖగోళ దృశ్యం. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా కనుమరుగవుతాడు. ఈ సందర్భాల్లో సూర్యకాంతి భూమిపై పడకపోవడంతో పగలు కూడా చీకటిగా మారుతుంది.
పాక్షిక సూర్యగ్రహణం అంటే?: ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో చంద్రుడు సూర్యుని కాంతిని పాక్షికంగా అడ్డుకుని సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కనిపించేలా చేస్తాడు. ఈ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో కన్పిస్తాడు. దీనినే 'పాక్షిక సూర్యగ్రహణం'గా పిలుస్తారు.
3. మూడో ఘట్టం: అమావాస్య (న్యూ మూన్): పైన మనం చెప్పుకున్న విధంగా సూర్యగ్రహణం అనేది చంద్రుడు పూర్తి 'అమావాస్య' (New Moon) స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సమయంలో సూర్యకాంతి చంద్రుని వెనుక భాగంపై మాత్రమే పడుతుంది. భూమి వైపు ఉండే చంద్రుని భాగం మాత్రం దట్టమైన చీకటితో నిండిపోతుంది. ఫలితంగా ఆ సమయంలో పగటి పూటే ఆకాశంలో అమావాస్య నాటి నిశీధి రాతిరి ఆవిష్కృతం అవుతుంది. వెన్నెల వెలుతురు లేని ఈ స్వచ్ఛమైన నల్లటి ఆకాశం.. నక్షత్రాలను, అంతరిక్షాన్ని వీక్షించే వారికి (Stargazing) ఒక మరపురాని, అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
4. నాలుగో ఘట్టం: పర్సీడ్ ఉల్కాపాతం
అమావాస్య నాటి ఈ దట్టమైన చీకట్లే ఆకాశంలో మరో అద్భుతానికి రంగుల వేదిక కానున్నాయి. ఏడాది పొడవునా వచ్చే ఉల్కాపాతాలన్నింటిలోకి అత్యంత ఆకర్షణీయమైన "పర్సీడ్ ఉల్కాపాతం" సరిగ్గా ఇదే సమయంలో గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. ఈసారి వెన్నెల వెలుతురు అస్సలు అడ్డురాకపోవడం వల్ల.. ఆకాశం నుంచి రాలే ఉల్కలు స్పష్టంగా కనిపించనున్నాయి. అంతరిక్ష ప్రియులు గంటకు దాదాపు 100 ఉల్కల (షూటింగ్ స్టార్స్) వరకు రాలడాన్ని కళ్లారా వీక్షించవచ్చు. ఈ సమయంలో మిరుమిట్లు గొలిపే అగ్నిగోళాలు (Fireballs) వంటి పెద్ద ఉల్కలతో పాటు, మెరుపు తీగల్లాంటి చిన్న ఉల్కలు కూడా ఆకాశంలో అద్భుత కాంతి విన్యాసాలు చేయనున్నాయి.
మళ్లీ 19 ఏళ్ల తర్వాతే..!
BBC 'స్కై ఎట్ నైట్' మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఈ ఉల్కాపాతాన్ని వీక్షించడానికి ఆగస్టు 12, 13, 14 తేదీలలో సూర్యోదయానికి ముందు సమయం అత్యంత అనుకూలమైనది. పర్సీడ్ ఉల్కాపాతం పీక్ స్టేజ్‌కి చేరడం, అదే రోజున అమావాస్య కావడం అనే ఈ అరుదైన ఖగోళ సంయోగం మళ్లీ సుమారు 19 ఏళ్ల తర్వాత, అంటే 2045లోనే సాధ్యమవుతుంది. ఇదే ఈ అద్భుత సంఘటనను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది.

