స్వతంత్ర సంస్థగా CMF- ఇప్పుడు దీని అధికారిక పేరేంటో తెలుసా?
CMF ఇప్పుడు ఒక స్వతంత్ర సంస్థగా మారింది. భారతదేశం దాని ప్రపంచ ప్రధాన కార్యాలయంగా అవతరించింది.

Published : January 8, 2026 at 10:48 AM IST
Hyderabad: నథింగ్ సబ్-బ్రాండ్ అయిన CMF భారతదేశంలో కీలక అడుగు వేసింది. CMF ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో స్వతంత్ర, చట్టబద్ధంగా నమోదైన కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని నథింగ్ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ భారతదేశ అధ్యక్షుడు అకిస్ ఎవాంజెలిడిస్ బుధవారం ప్రకటించారు. భారతదేశంలో CMFకి ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొంటూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ "X"లో పోస్ట్ చేశారు.
వాస్తవానికి సెప్టెంబర్ 2025లో, నథింగ్ సంస్థ CMF స్మార్ట్‌ఫోన్ తయారీ కార్యకలాపాలన్నింటినీ భారతదేశానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23, 2025న CMF భారతదేశంలో ఒక ప్రత్యేక చట్టపరమైన సంస్థగా నమోదు చేసుకుంది. ఇప్పుడు దీని అధికారిక పేరు "CMF ఇండియా ప్రైవేట్ లిమిటెడ్".
India is increasingly positioning itself at the forefront of the global consumer tech ecosystem, driven by years of sustained progress and ambition. The work done has been remarkable.
— Akis Evangelidis (@AkisEvangelidis) January 7, 2026
CMF has an important role to play in that journey and we’re happy to share that it is now a… https://t.co/4efGMBDa85 pic.twitter.com/XphlyFHgbO
నథింగ్ ఇండియా-కేంద్రీకృత దృక్పథంలో CMF ఒక కీలక భాగం అని అకిస్ ఎవాంజెలిడిస్ పేర్కొన్నారు. భారతదేశంలో CMFను ఒక ప్రత్యేక కంపెనీగా స్థాపించడం అనేది కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం. ఇప్పుడు ఈ కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గానే కాకుండా, తన ప్రపంచవ్యాప్త ఉత్పాదక, ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
CMF ఇప్పటికే తన కార్యకలాపాలను భారతదేశానికి మార్చింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ వస్తువుల ఎండ్-టు-ఎండ్ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి కార్యకలాపాలు ఉన్నాయి. దీనర్థం ఇకపై CMFకు సంబంధించిన డివైజ్‌ల డిజైన్ నుంచి ఉత్పత్తి వరకు ప్రతిదీ భారతదేశంలోనే జరుగుతుంది.
కంపెనీ భారతదేశంలో మరో వారం రోజుల్లో తన "CMF హెడ్‌ఫోన్స్ ప్రో", "CMF వాచ్ 3 ప్రో" అనే రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. వీటి లాంఛ్‌కు ముందుగా ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇది ఈ కంపెనీ భారత మార్కెట్ పట్ల ఎంత ఆసక్తిని కనబరుస్తుందనేది సూచిస్తుంది.
గతంలో, కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్, ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ భారతదేశంలో CMF బ్రాండ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేయడానికి జాయింట్ వెంచర్‌ను ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో ఈ రెండు కంపెనీలు రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశంలో $100 మిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది 1,800 కంటే ఎక్కువ కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
నథింగ్ కంపెనీ ఇప్పటివరకు భారతదేశంలో 200 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం నుంచి CMF కూడా ప్రయోజనం పొందుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని, ఎగుమతులు 11 రెట్లు వృద్ధి చెందాయని తెలిపారు.

