కనెక్టివిటీ అప్‌గ్రేడ్‌లతో 'ఆంపియర్ మాగ్నస్ G మ్యాక్స్' లాంఛ్- ధర ఎంతంటే?
ఆంపియర్ NxG.io సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌తో అప్‌డేటెడ్ "మాగ్నస్ G మ్యాక్స్" ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Published : August 13, 2026 at 5:25 PM IST
Hyderabad: ఆంపియర్ సంస్థ సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసిన తన "ఆంపియర్ మాగ్నస్ G మ్యాక్స్" ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను సరికొత్త NxG.io సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. దీని ధరను కంపెనీ రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా స్కూటర్లో 30కి పైగా స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
కొత్త ఆంపియర్ మాగ్నస్ G మ్యాక్స్ ఫీచర్లు: ఇందులో క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను అందించారు.
- క్రూజ్ కంట్రోల్ (Cruise Control): ఇది మీరు హైవేలపై ప్రయాణించేటప్పుడు ఉపయోగపడుతుంది. మీరు యాక్సిలరేటర్ (రేస్) తిప్పకుండానే, స్కూటర్ ఒకే స్థిరమైన వేగంతో (ఉదాహరణకు 40 కిమీ వేగంతో) వెళ్లేలా చేస్తుంది.
- హిల్ హోల్డ్ అసిస్ట్ (Hill Hold Assist): ఇది కొండలు లేదా ఎత్తైన రోడ్లపై (ఫ్లైఓవర్లపై) ఉపయోగపడుతుంది. ట్రాఫిక్‌లో స్కూటర్ ఆపినప్పుడు, అది వెనక్కి జారిపోకుండా బ్రేక్ వేసి పట్టి ఉంచుతుంది.
వీటితో పాటు ఈ స్కూటర్లో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందించే 5-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంది. ఫోన్ యాప్ ద్వారా స్కూటర్‌ను గుర్తించే లేదా 'పింగ్' చేసే ఫీచర్‌నూ జోడించారు. దీనివల్ల పార్కింగ్ తర్వాత వాహనాన్ని కనుగొనడం సులభం అవుతుంది.
అలాగే యాంపియర్ కనెక్ట్ యాప్ ద్వారా మీరు లైవ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, థెఫ్ట్ అండ్ టోయింగ్ అలర్ట్స్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్ఫర్మేషన్, ఓటిఏ (OTA) అప్‌డేట్స్ వంటి అన్ని కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా వాడుకోవచ్చు.

పవర్‌ట్రెయిన్: ఈ స్కూటర్ యాంత్రిక భాగాలలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త 'మాగ్నస్ G మ్యాక్స్'లో ప్రస్తుతం ఉన్న 3kWh LFP బ్యాటరీని, 2.4kW గరిష్ఠ శక్తిని (peak power) అందించగల హబ్-మౌంటెడ్ మోటార్‌నే యథాతథంగా కొనసాగించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల IDC పరిధిని (range) అందిస్తుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది.

బ్యాటరీ వారంటీ: ఈ స్కూటర్ బ్యాటరీపై కంపెనీ 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. అలాగే ఈ బ్యాటరీ లైఫ్ దాదాపు 2,00,000 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
కలర్ ఆప్షన్లు: ఈ స్కూటర్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో వస్తోంది. ఇప్పటికే ఉన్న మాన్‌సూన్ బ్లూ (Monsoon Blue), మచ్చా గ్రీన్ (Matcha Green) రంగులతో పాటు, ఇప్పుడు కొత్తగా సిన్నమన్ కాపర్ (Cinnamon Copper) రంగు కూడా ఈ శ్రేణిలో చేర్చారు.

