ISSలో మెడికల్ ఎమెర్జెన్సీ- షెడ్యూల్ కంటే ముందుగా భూమికి వ్యోమగాములు- చరిత్రలో ఇదే తొలిసారి!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగామికి అనారోగ్యం

Published : January 9, 2026 at 10:39 AM IST
Hyderabad: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమెర్జెన్సీ తలెత్తింది. ఒక వ్యోమగామికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో షెడ్యూల్ కంటే నెల రోజుల ముందుగానే తమ మిషన్‌ను ముగించుకుని మొత్తం నలుగురు వ్యోమగాములనూ తిరిగి భూమికి తీసుకువస్తున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రం 25 ఏళ్ల చరిత్రలో ఇలాంటి తరలింపు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
వైద్య గోప్యతా కారణాలను ఉటంకిస్తూ, అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరు, మెడికల్ సమస్య లేదా దాని తీవ్రతతో సహా ఈ విషయంపై నాసా అదనపు వివరాలను అందించలేదు. అయితే వ్యోమగామి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే వ్యోమగాములు ఇంటికి తిరిగి వస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ ఒక వార్తా సమావేశంలో వెల్లడించారు. అయితే అన్‌డాక్ లేదా ల్యాండింగ్‌కు సంబంధించిన కచ్చితమైన కాలపరిమితిని ఏజెన్సీ ఇంకా ప్రకటించలేదు.
"చీఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ J.D. పోల్క్, ఏజెన్సీలోని నాయకత్వంతో చర్చించిన తర్వాత, మా వ్యోమగాముల ప్రయోజనాల దృష్ట్యా క్రూ-11 బృందాన్ని షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి తీసుకురావాలని నిర్ణయించాం. దీనిపై రాబోయే 48 గంటల్లో మరింత సమాచారం అందిస్తాం." - ఐజాక్‌మాన్, నాసా అడ్మినిస్ట్రేటర్
ఇకపోతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతున్న వారిలో నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, మైక్ ఫింకేతో పాటు జపాన్ వ్యోమగామి కిమియా యుయి, రష్యన్ కాస్మోనాట్ ఒలేగ్ ప్లాటోనోవ్ ఉన్నారు. "క్రూ-11" (Crew-11) అని పిలుస్తున్న ఈ వ్యోమగాములు ఆగస్టు ప్రారంభంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి చివరి వరకు వీరు ఈ పరిభ్రమిస్తున్న ప్రయోగశాలలోనే ఉండాల్సి ఉంది. అయితే వైద్యపరమైన సమస్యల కారణంగా జనవరి 2026లో ముందుగానే తిరిగి భూమికి వస్తున్నారు.
అయితే వ్యోమగామి పరిస్థితి స్థిరంగానే ఉందని, ఈ తరలింపును అత్యవసర పరిస్థితిగా పరిగణించడం లేదని పోల్క్ చెప్పారు. ప్రభావిత వ్యోమగామి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నాసా బుధవారమే ఈ వైద్యపరమైన సమస్యను మొదటిసారిగా బహిరంగపరిచింది. ఆ రోజు కార్డ్‌మన్, ఫింకే గురువారం నిర్వహించాల్సిన స్పేస్‌వాక్‌ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.
"అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మా వద్ద చాలా అధునాతన వైద్య పరికరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక రోగికి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించడానికి అత్యవసర విభాగంలో అవసరమయ్యే అన్ని పరికరాలు మా వద్ద లేవు." - పోల్క్, నాసా చీఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్
ఇప్పుడు "క్రూ-11" బృందం ముందస్తు నిష్క్రమణ తర్వాత, NASA అనేక వారాల పాటు అంతరిక్ష కేంద్రంలో తన వ్యోమగాములలో కేవలం ఒకే ఒకరితో పాటు US సైన్స్ ప్రయోగాలు, కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. ఆయన నవంబర్ 27, 2025న రష్యన్ సోయుజ్ MS-28 అంతరిక్ష నౌకలో ISSకు బయల్దేరిన ఫ్లైట్ ఇంజనీర్ క్రిస్ విలియమ్స్. ఆయన ప్రస్తుతం ISSలో ఎక్స్‌పెడిషన్ 74లో భాగంగా ఎనిమిది నెలల మిషన్‌లో ఉన్నారు. రష్యన్ వ్యోమగాములు సెర్గీ కుడ్-స్వెర్చ్కోవ్, సెర్గీ మికాయెవ్ ఆయనతో పాటు ఉన్నారు.
తదుపరి సిబ్బంది ఫిబ్రవరి మధ్యలో ISSకు బయల్దేరాల్సి ఉంది. అయితే "క్రూ-12" అనే ఆ మిషన్‌ను వేగవంతం చేయాలా వద్దా అనే దానిపై NASA అంచనా వేస్తుందని ఇసాక్‌మాన్ చెప్పారు. ఈ వారం అంతరిక్షంలో చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలు ఐజాక్‌మాన్‌కు మొదటి అతిపెద్ద సవాల్. ఆయన ఇటీవలే డిసెంబర్ 18న ప్రమాణ స్వీకారం చేశారు. జారెడ్ ఇసాక్‌మాన్ ప్రస్తుతం NASA (నాసా) అడ్మినిస్ట్రేటర్ (ప్రధాన అధికారి)గా పనిచేస్తున్నారు.

