గూగుల్ 'నానో బనానా 2'- ఇది చాలా స్మార్ట్ గురూ- దీని స్పీడ్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!
గూగుల్ తన లేటెస్ట్ AI ఇమేజ్ మోడల్ "నానో బనానా 2"ని విడుదల చేసింది. ఇది 141 దేశాలలో అందుబాటులో ఉంది, 18 భాషలకు మద్దతు ఇస్తుంది.

Published : February 27, 2026 at 3:53 PM IST
Hyderabad: టెక్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ AI ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ టూల్ "నానో బనానా 2"ను భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. దీన్ని గూగుల్ జెమిని 3.1 ఫ్లాష్ ఇమేజ్ మోడల్ ఆధారంగా రూపొందించారు. ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ టూల్ "నానో బనానా ప్రో" ఇంటెలిజెన్స్, విజువల్ క్వాలిటీతో పాటు "జెమిని ఫ్లాష్" ఫాసెస్ట్ ఎడిటింగ్ సామర్థ్యాలను మిళితం చేస్తుందని గూగుల్ పేర్కొంది. అంటే ఇది దీని ముందున్న మోడళ్లతో పోలిస్తే మరింత వేగంగా, అత్యంత కచ్చితత్వంతో చిత్రాలను సృష్టించగలదు.
నానో బనానా 2లో కొత్తగా ఏం ఉంది?: గూగుల్ గతేడాది తన జెమిని యాప్‌లో "నానో బనానా" అనే కోడ్ నేమ్‌తో కొత్త జనరేటివ్ ఇమేజ్ టూల్‌ను ప్రారంభించి సంచలనం సృష్టించింది. దీనిలో ఫొటోలను అప్లోడ్ చేసి, ప్రాంప్ట్ అందించడం ద్వారా మనకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాక ఇది మన ఫొటోలను 3D ఇమేజ్‌లుగా కూడా మార్చుకునే వెసులుబాటును కూడా కల్పిస్తుంది. దీంతో ఇది వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి లభించిన విశేష ఆదరణతో కంపెనీ కొన్ని నెలల్లోనే ప్రొఫెషనల్-స్థాయి చిత్రాలు, ఎడిటింగ్‌ను అందించే "నానో బనానా ప్రో" అనే ప్రొఫెషనల్ వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పుడు మరింత స్మార్ట్, స్పీడ్‌గా పనిచేసే "నానో బనానా 2"ను తీసుకొచ్చింది.
We’re launching Nano Banana 2, built on the latest Gemini Flash model. 🍌
— Google DeepMind (@GoogleDeepMind) February 26, 2026
It’s state-of-the-art for creating and editing images, combining Pro-level capabilities with lightning-fast speed. 🧵 pic.twitter.com/b3sHCAhrSy
ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ మోడల్ దాని ప్రీవియస్ "నానో బనానా", "నానో బనానా ప్రో" కంటే అనేక కీలక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇది విజువల్ జనరేషన్ కోసం జెమిని ఫ్లాష్ హై-స్పీడ్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తుంది. తద్వారా వేగవంతమైన ఎడిటింగ్, అవసరమైన మార్పులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పుడు సంక్లిష్టమైన అభ్యర్థనలను సైతం బాగా అర్థం చేసుకోగలదు. దీంతో మీరు ఆశించిన విధంగా కచ్చితమైన ఫలితాలను పొందొచ్చు.
నిర్దిష్ట వస్తువుల కచ్చితమైన రెండర్‌లను అందించడానికి "నానో బనానా 2" జెమిని AI మోడల్ రియల్-వరల్డ్ నాలెడ్జ్ బేస్, రియల్-టైమ్ ఇన్ఫర్మేషన్, వెబ్ సెర్చ్‌ల నుంచి చిత్రాలను ఉపయోగిస్తుందని గూగుల్ హైలైట్ చేసింది. ఈ కొత్త AI ఇమేజ్ జనరేటర్ విజువల్‌గా ఆకట్టుకునే, కచ్చితమైన ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా విజువలైజేషన్‌ను సృష్టించడానికి, గమనికలను రేఖాచిత్రాలుగా మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది.
ఇంకా ఈ లేటెస్ట్ AI ఇమేజ్ జనరేషన్ టూల్ మార్కెటింగ్ మోకప్‌లు లేదా గ్రీటింగ్ కార్డ్‌ల కోసం కచ్చితమైన, చదవగలిగే టెక్స్ట్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారులు చిత్రంలోని టెక్స్ట్‌ను కూడా అనువదించవచ్చు, స్థానికీకరించవచ్చు, దీనిని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇది 512px నుంచి 4K వరకు వివిధ యాస్పెక్ట్ రేషియో, రిజల్యూషన్‌లకు మద్దతు ఇస్తుంది. వర్టికల్ సోషల్ మీడియా పోస్ట్ నుంచి వైడ్-స్క్రీన్ బ్యాక్‌డ్రాప్ వరకు షార్ప్ విజువల్స్‌ను అందిస్తుంది.
నానో బనానా 2 లభ్యత, భాషా మద్దతు: నానో బనానా 2 భారతదేశం, US, UAE, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ప్యూర్టో రికో, జపాన్ సహా 141 దేశాలలో అందుబాటులో ఉంది. ఇది అరబిక్, బెంగాలీ, చైనీస్, డచ్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, హిబ్రూ, హిందీ, ఇండోనేషియన్, జపనీస్, కొరియన్, మలయాళం, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, థాయ్, ఉర్దూ, వియత్నామీస్ వంటి 18 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఏఐ ఇమేజ్ జనరేటింగ్ టూల్ జెమిని యాప్, గూగుల్ యాప్, AI మోడ్ ఇన్ సెర్చ్, AI స్టూడియో, జెమిని API, ఫ్లో, గూగుల్ యాడ్స్‌తో సహా గూగుల్ ఉత్పత్తులలో అందుబాటులో ఉంది.
గూగుల్ AI ప్రో, అల్ట్రా వినియోగదారులు దీన్ని ఎలా యాక్సెస్ చేయవచ్చు?: జెమిని యాప్‌లోని వినియోగదారులందరికీ ఈ "నానో బనానా 2"ను డిఫాల్ట్ AI ఇమేజ్ జనరేషన్ మోడల్‌గా అందిస్తున్నారు. గూగుల్ AI "ప్రో", "అల్ట్రా" వినియోగదారులు ఇప్పటికీ తమ ప్రత్యేక పనుల కోసం జెమిని యాప్‌లోని "నానో బనానా ప్రో"ను వినియోగించుకోవచ్చు. దీనిని యాప్‌లోని మూడు చుక్కల రీజనరేషన్ మెను ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

