MWC 2026: మోటరోలా మొట్టమొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లాంఛ్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
మోటరోలా MWC 2026లో తన మొట్టమొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ "రేజర్ ఫోల్డ్"తో పాటు "ఎడ్జ్ 70 ఫ్యూజన్" స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది.

Published : March 3, 2026 at 11:01 AM IST
Hyderabad: స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026(MWC 2026)లో మోటరోలా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు "మోటరోలా రేజర్ ఫోల్డ్", "మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్". వీటిలో "ఫ్యూజన్" మోడల్ మోటరోలా మునుపటి "మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్"కు అప్‌గ్రేడ్ వెర్షన్. అయితే అంతా "మోటరోలా రేజర్ ఫోల్డ్"పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇది కంపెనీ మొట్టమొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్. ఇది నేరుగా ప్రీమియం సెగ్మెంట్‌నే లక్ష్యంగా చేసుకుంది.
కంపెనీ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, "మోటరోలా రేజర్ ఫోల్డ్" అతిపెద్ద హైలైట్ దాని పెద్ద 8.1-అంగుళాల లోపలి డిస్ప్లే. ఇది 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని ఔటర్ డిస్ప్లే 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది తెరిచినప్పుడు 4.7mm మాత్రమే సన్నగా ఉంటుంది. మూసివేసినప్పుడు 10mm మందంగా కన్పిస్తుంది.
Endless possibilities. Effortless transitions.
— motorola (@Moto) March 2, 2026
Unfold a new era of razr.
Unfold motorola razr fold.
Unfold iconic.#MakeItIconic #MotorolaRazrFold@Snapdragon
Learn more: https://t.co/AJ7C2W4Qv0 pic.twitter.com/vvfGAkV2vf
మోటరోలా రేజర్ ఫోల్డ్ హైలైట్స్: దీని పనితీరు విషయానికి వస్తే, ఇది లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌గా పరిగణిస్తున్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. కంపెనీ దీనిలో RAM బూస్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. ఇది 16GB వరకు వర్చువల్ RAMని అనుమతిస్తుంది. మోటరోలా ఈ ఫోన్‌కు ఏడు సంవత్సరాల Android, భద్రతా అప్డేట్లను అందిస్తామని హామీ ఇస్తోంది.
దీని కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 50MP సోనీ LYTIA ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. కవర్ స్క్రీన్‌పై 32MP సెల్ఫీ కెమెరా, లోపల 20MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే పెద్ద 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
యూరప్‌లో దీని ధర EUR 1,999. అంటే దాదాపు రూ. 2.14 లక్షలు (సుమారు $2.14 మిలియన్లు). ఇది పాంటోన్ బ్లాక్‌నెడ్ బ్లూ, పాంటోన్ లిల్లీ వైట్ రంగులలో లభిస్తుంది. మోటరోలా ప్రత్యేక FIFA వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ఫుట్‌బాల్ నేపథ్య డిజైన్, 24K బంగారు పూతతో కూడిన యాక్సెంట్స్, విలక్షణమైన '26' బ్రాండింగ్ ఉంటుంది.
మరోవైపు, "మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్" మిడ్-ప్రీమియం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు, కానీ ఇది లాటిన్ అమెరికా, EMEA, ఆసియా పసిఫిక్‌లోని ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉంది.

