మార్కెట్‌ను షేక్ చేస్తున్న 'MG విండ్స్ EV'- రెండేళ్లు తిరగకముందే 75 వేల కార్ల విక్రయం!
ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్లోకి వచ్చిన రెండేళ్లలోనే ఏకంగా 75,000 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాల మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. ఈ కారుకు ఇంత డిమాండ్ ఎందుకు?

Published : July 7, 2026 at 3:51 PM IST
Hyderabad: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోడల్ ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) మార్కెట్లోకి ప్రవేశించిన కేవలం రెండేళ్లలోపే 75,000 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాల మైలురాయిని విజయవంతంగా అధిగమించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
గతేడాది నవంబర్‌లో ఈ పాపులర్ ఈవీ 50,000 యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. ఆ అచీవ్‌మెంట్ సాధించిన కేవలం 7 నెలల వ్యవధిలోనే మరో 25,000 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఈ అద్భుతమైన అమ్మకాల వేగంతో భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలలో ఎంజీ విండ్సర్ ఈవీ ఒకటిగా అగ్రస్థానంలో నిలిచింది.
తక్కువ అప్‌ఫ్రంట్ కాస్ట్ (Upfront Cost) అందించే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) వంటి వినూత్న ఫైనాన్సింగ్ ప్లాన్స్ ఈ స్థాయి సక్సెస్‌కు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
CY2026 ప్రథమార్ధంలోనే 19,000 యూనిట్ల విక్రయాలు: క్యాలెండర్ ఇయర్ 2026 మొదటి అర్ధభాగంలోనే (CY2026 H1) ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) ఏకంగా 19,000 యూనిట్లకు పైగా అమ్ముడవడం విశేషం.
కాగా, ఈ విండ్సర్ ఈవీ మోడల్‌ను అక్టోబర్ 2024లో భారత మార్కెట్లోకి అధికారికంగా లాంఛ్ చేశారు. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా మే 2025 నుంచి ఇందులో మరింత పెద్ద బ్యాటరీ (Bigger Battery Option) ఎంపికను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ మైలురాయిని అందుకున్న సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. "ఎంజీ విండ్సర్ ఒక అద్భుతమైన కారు. అత్యుత్తమ వాల్యూను (Value) అందించడమే కాకుండా, భారతీయ కార్ కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. అటు మెట్రో నగరాలతో పాటు, ఇటు కొత్తగా ఎదుగుతున్న మార్కెట్లలోని (Emerging Markets) కస్టమర్ల ఆదరణతో.. భారతదేశంలో ఈవీల (EV) వినియోగాన్ని వేగవంతం చేయడంలో, ప్రజల ప్రయాణ శైలిని మార్చడంలో ఎంజీ విండ్సర్ ఈవీ కీలక పాత్ర పోషించింది" అని అన్నారు.
ఎంజీ విండ్సర్ EV బ్యాటరీ ఎంపికలు, రేంజ్: ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం మూడు వేరియంట్లలో, రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందిస్తుంది. దీని ఎంట్రీ-లెవెల్ వేరియంట్ 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జింగ్‌పై 331 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. అయితే, మరింత ఎక్కువ పరిధిని కోరుకునే కొనుగోలుదారులు 'ప్రో' (Pro) వేరియంట్లను ఎంచుకోవచ్చు. ఈ వేరియంట్లు గరిష్ఠంగా 449 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తాయి. అంతేకాకుండా, వీటిలో అదనపు ఫీచర్లు (టాప్-ఎండ్ మోడల్‌లో పవర్డ్ టెయిల్‌గేట్, ADAS టెక్నాలజీ వంటివి) కూడా ఉంటాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ ధరల వివరాలు: భారత మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.70 లక్షలుగా ఉంది. కాగా, పూర్తి కొనుగోలు (Outright Purchase) పద్ధతిలో దీని టాప్ వేరియంట్ ధర రూ. 19.00 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
కొనుగోలుదారులు 'Battery-as-a-Service' (BaaS) విధానంలో కూడా ఈ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రారంభ ధర రూ. 9.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గుతుంది. అయితే ఆ తర్వాత బ్యాటరీ వినియోగానికి గాను ప్రతి కిలోమీటర్‌కు రూ. 3.99 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విధానంలో బిగ్ బ్యాటరీ (Pro వేరియంట్లు) ఆప్షన్ ఎంచుకుంటే ఈ అద్దె ప్రతి కిలోమీటర్‌కు రూ. 4.50గా ఉంటుంది.

