ETV Bharat / technology

మెటా 'మ్యూజ్ వండర్'- ఫ్రాంటియర్ AI ప్రపంచంలోకి మరో సూపర్ మోడల్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఆధిపత్యం దిశగా మెటా సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. ఓపెన్​ఏఐ, ఆంత్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థల మోడళ్లకు పోటీగా 'మ్యూజ్ వండర్' పేరిట ఫ్రాంటియర్ AI సిరీస్‌ను ఆవిష్కరించింది.

Muse Wonder and Muse Wonder Full are Meta's first-ever frontier AI models
Muse Wonder and Muse Wonder Full are Meta's first-ever frontier AI models (ఫొటో క్రెడిట్: ETV Bharat via Meta)
author img

By ETV Bharat Tech Team

Published : October 13, 2026 at 4:17 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది ప్రముఖ టెక్ దిగ్గజం మెటా. సంస్థకు చెందిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ "మ్యూజ్ వండర్", "మ్యూజ్ వండర్ ఫుల్" అనే రెండు సరికొత్త "ఫ్రాంటియర్" మోడళ్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటివరకు తాము తయారు చేసిన వాటిలో ఇవే అత్యంత శక్తివంతమైన మోడళ్లు అని కంపెనీ చెబుతోంది.

కేవలం చాటింగ్ కాదు.. క్లిష్టమైన పనులకూ కేరాఫ్ అడ్రస్!: ఇవి కేవలం చాటింగ్‌లకే పరిమితం కాకుండా, నిజ జీవితంలో సంక్లిష్టమైన పనులను చక్కబెట్టే ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను విశ్లేషించడం, ఇంటి లీజు పత్రాలను చదివి వివరించడం, లేదా ఒక యాప్‌ను రూపొందించడం వంటి క్లిష్టమైన పనులను కూడా ఇవి చేయగలవని మెటా తెలిపింది.

వారాలు, నెలల తరబడి సాగే సుదీర్ఘమైన పనులను కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా పూర్తి చేయడం కోసం మెటా ఇందులో రెండు వినూత్న ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవి:

  1. యాక్టివ్ మెమరీ (Active Memory): ఇది యూజర్ల ప్రాధాన్యతలను, ముఖ్యమైన వివరాలను గుర్తుంచుకుంటుంది. పాత సంభాషణలలోని డేటాను విశ్లేషించి, కొత్తగా చేసే పనులకు అనుగుణంగా వాడుకుంటుంది. ఇది కేవలం కొద్దిరోజులకే పరిమితం కాకుండా నెలల తరబడి యూజర్ డేటాను స్టోర్ చేసుకోగలదు.
  2. యాక్టివ్ ఫోకస్ (Active Focus): ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో సాంకేతిక లోపాలు వచ్చినా లేదా తప్పులు జరిగినా ఇది ఆగిపోదు. ప్రత్యామ్నాయ మార్గాలను (Alternative approaches) వెతికి పనిని పూర్తి చేస్తుంది. అవసరమైతే యూజర్ల సలహాలను అడుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు క్రాస్ చెక్ చేస్తుంది.

గతంలో లాంఛ్ చేసిన 'మ్యూజ్ స్పార్క్' (Muse Spark) ఆధారంగా ఈ 'మ్యూజ్ వండర్' సిరీస్‌ను అభివృద్ధి చేశారు. దీని కోసం మెటా తన ఏఐ టీమ్‌ను పూర్తిగా పునర్నిర్మించి 14 నెలల పాటు శ్రమించింది. ఈ సరికొత్త మోడళ్లతో తాము ఏఐ టెక్నాలజీలో 'ఫ్రాంటియర్ లెవల్'కు చేరినట్లు సంస్థ స్పష్టం చేసింది.

లభ్యతా వివరాలు:

  • మ్యూజ్ వండర్: డెవలపర్ల కోసం మెటా మోడల్ ఏపీఐ, మ్యూజ్ కోడ్‌లలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
  • మ్యూజ్ వండర్ ఫుల్: ప్రస్తుతానికి కేవలం మ్యూజ్ కోడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేశారు.

త్వరలోనే ఈ రెండు మోడళ్లను మ్యూజ్ యాప్‌లోకి కూడా తీసుకురానున్నారు. అయితే, ప్రారంభంలో కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే వీటికి యాక్సెస్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇంతకీ ఫ్రాంటియర్ ఏఐ అంటే?: ఫ్రాంటియర్ ఏఐ (Frontier AI) అంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతనమైన, అత్యంత శక్తివంతమైన నెక్స్ట్-జనరేషన్ టెక్నాలజీ. ఇది సాధారణ చాట్‌బాట్‌లలా కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాకుండా, మనుషుల లాగా ఆలోచించి కోడింగ్ చేయడం, లీగల్ పత్రాలను విశ్లేషించడం వంటి అత్యంత సంక్లిష్టమైన పనులను స్వయంగా పూర్తి చేయగలదు. టెక్నాలజీ ప్రపంచంలో సరిహద్దులను దాటి సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న ఓపెన్​ఏఐ (OpenAI)కి చెందిన జీపీటీ-4 (GPT-4), గూగుల్ జెమిని (Gemini), మెటా కొత్తగా తీసుకొచ్చిన 'మ్యూజ్ వండర్' వంటి టాప్ ఏఐ మోడళ్లు అన్నీ ఈ ఫ్రాంటియర్ ఏఐ కేటగిరీ కిందకే వస్తాయి.