ETV Bharat / technology

పెరగనున్న బెంజ్ కార్ల ధరలు- కొనే ఆలోచన ఉండే ఇప్పుడే త్వరపడండి!

జనవరి నుంచి మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలకు రెక్కలు- ఎంతంటే?

Mercedes-Maybach S-Class
Mercedes-Maybach S-Class (Photo Credit- Mercedes-Benz India)
author img

By ETV Bharat Tech Team

Published : December 13, 2025 at 4:11 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉండటం గమనించదగ్గ విషయం. యూరో-INR మారకం రేటు స్థిరంగా 100 రూపాయల మార్కు కంటే ఎక్కువగా ఉన్నందున ఈ ధరల పెంపు తప్పట్లేదని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

మెర్సిడెస్-బెంజ్ ధరల పెంపు: ధరల పెరుగుదల గురించి మెర్సిడెస్-బెంజ్ ఇండియా MD, CEO సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ, ఈ ఏడాది యూరో-INR ఎక్స్ఛేంజ్ రేటు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం బలహీనంగా ఉందని, ఈ దీర్ఘకాలిక అస్థిరత తమ కార్యకలాపాలలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు.

Mercedes-Benz GLA
Mercedes-Benz GLA (Photo Credit- Mercedes-Benz India)

"దిగుమతి చేసుకున్న భాగాల నుంచి స్థానిక ఉత్పత్తి కోసం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (CBUలు) వరకు, ప్రతిదీ ప్రభావితమవుతుంది. ఇంకా పెరుగుతున్న ఇన్‌పుట్ అండ్ లాజిస్టిక్స్ ఖర్చులు, ద్రవ్యోల్బణంతో కలిపి మా మొత్తం కార్యాచరణ ఖర్చులను గణనీయంగా పెంచాయి" అని జోడించారు.

ఈ ధరల పెంపు మోడల్‌ను బట్టి మారుతూ ఉంటుంది. కానీ పూర్తిగా నిర్మించిన యూనిట్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దిగుమతి చేసుకున్న విడిభాగాలతో స్థానికంగా అసెంబుల్ చేసిన కార్ల ధరలు కూడా పెరుగనున్నాయి. కంపెనీ మహారాష్ట్రలోని పుణేలో ఉన్న తన ప్లాంట్‌లో మెర్సిడెస్-బెంజ్ "A-క్లాస్ లిమోసిన్", "GLA", "C-క్లాస్", "GLC", "E-క్లాస్ LWB", "GLE", "S-క్లాస్", "GLS", "మేబ్యాక్ S 580", "EQS 580 సెడాన్", "EQS SUV 450" మోడళ్లను అసెంబుల్ చేస్తోంది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా పోర్ట్‌ఫోలియోలోని మిగిలిన "మేబ్యాక్", "AMG పెర్ఫార్మెన్స్" ఎలక్ట్రిక్ వాహన నమూనాలు మాత్రం దిగుమతి చేసుకున్నవి.

Mercedes-AMG S63 E Performance
Mercedes-AMG S63 E Performance (Photo Credit- Mercedes-Benz India)

ధరల పెరుగుదలపై మరింత వ్యాఖ్యానిస్తూ రెపో రేటును నిరంతరం తగ్గించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అయ్యర్ ప్రశంసించారు. "ఇది మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MBFS) తన వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి, ధరల పెరుగుదల ప్రభావాలను గణనీయంగా తగ్గించడానికి వీలు కల్పిస్తుంది" అని పేర్కొన్నారు. ఇంకా దేశంలోని కంపెనీ అమ్మకాలలో MBFS దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉందని, మెర్సిడెస్-బెంజ్ కార్ల కొనుగోలుదారులలో 80 శాతం మంది ఫైనాన్సింగ్‌ను ఉపయోగిస్తున్నారని కంపెనీ తెలిపింది.