భారత మార్కెట్లోకి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు- సింగిల్ ఛార్జ్‌పై 501km రేంజ్!
మసెరటి ఇండియా మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV లాంఛ్- ధర ఎంతో తెలుసా?

Published : November 13, 2025 at 2:57 PM IST
Hyderabad: భారతదేశంలోని లగ్జరీ కార్ మార్కెట్‌లో మసెరటి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కంపెనీ తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV "గ్రెకేల్ ఫోల్గోర్"ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు దాని ICE వెర్షన్లలోని ట్రోఫియో వేరియంట్ కంటే కొంచెం సరసమైన ధరలో ఎంట్రీ ఇచ్చింది. 550 హార్స్‌పవర్ పవర్, 501km రేంజ్‌తో ఈ కారు పర్యావరణ అనుకూలమైన, స్పోర్టీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లతో పాటు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం రండి.
గ్రెకేల్ ఫోల్గోర్ ధర: కంపెనీ దీని ధరను రూ. 1.89 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ పూర్తి ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో దాని ICE కౌంటర్పార్ట్లతో పాటు అందుబాటులో ఉంటుంది. గ్రెకేల్ శ్రేణి స్టాండర్డ్ వేరియంట్ రూ. 1.31 కోట్లు, "మోడెనా" రూ. 1.40 కోట్లు, టాప్-ఎండ్ "ట్రోఫియో" రూ. 1.96 కోట్ల ధరతో ప్రారంభమవుతుంది.

అంటే కంపెనీ "ఫోల్గోర్" ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ICE వెర్షన్లలోని టాప్-ఎండ్ "ట్రోఫియో" కంటే కొంచెం చౌకగా తీసుకొచ్చింది. ఇది ఎలక్ట్రిక్ కార్ ఔత్సాహికులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది. ఈ లాంఛ్ పర్యావరణ అనుకూల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు మద్దతు ఇస్తుంది, భారతదేశంలో ఎలక్ట్రిక్ లగ్జరీ విభాగంలో మసెరటి బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.
105 kWh బ్యాటరీ ప్యాక్: గ్రీకేల్ ఫోల్గోర్ 105 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ప్రతి యాక్సిల్‌పై ఒక ఎలక్ట్రిక్ మోటారుకు అనుసంధానమై వస్తుంది. ఇది కారుకు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను అందిస్తుంది. ఈ మోటార్లు కలిసి 550 hp శక్తి, 820 న్యూటన్-మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ అద్భుతమైన శక్తితో SUV కేవలం 4.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

దీని టాప్ స్పీడ్ గంటకు 220 కిలోమీటర్లు. కానీ ఈ వాహనం బరువు 2,480 కిలోగ్రాములు. అయినప్పటికీ దీని పనితీరు ఆకట్టుకుంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 501 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది లాంగ్ డ్రైవింగ్‌కు సౌకర్యంగా ఉంటుంది. దీని ఛార్జింగ్ ఎంపికలలో 22 kW AC, 150 kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. ఇది బిజీ జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది.

ఇంటీరియర్: పవర్‌ట్రెయిన్ పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ ఇంటీరియర్ ICE వెర్షన్ లాగానే రిచ్‌గా ఉంటుంది. ఇది 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ కోసం దిగువన 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌పై పెద్ద ప్యాడిల్ షిఫ్టర్లు, వాల్యూమ్ కంట్రోల్ బటన్‌లతో సహా వివిధ నియంత్రణలు కూడా ఉన్నాయి. ఈ సెటప్ డ్రైవర్‌కు పూర్తి నియంత్రణను అందిస్తుంది.

దీని కస్టమైజేషన్ ఎంపికల విస్తృత జాబితాలో వివిధ ఎక్స్టీరియర్ కలర్ కిట్‌లు, రియర్ ప్రైవసీ గ్లాస్, పనోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో 21 స్పీకర్లతో కూడిన 1,285W సోనస్ ఫాబర్ ఆడియో సిస్టమ్, హీటెడ్ లెదర్ స్టీరింగ్ వీల్, ముందు-వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అప్హోల్స్టరీ కోసం 16 రంగు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ప్రదర్శన పరంగా గ్రీకేల్ ఫోల్గోర్ మసెరటి సిగ్నేచర్ స్టైల్‌కి అద్భుతమైన పోలికను కలిగి ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ లో-ప్రొఫైల్ కాన్కేవ్ గ్రిల్, D-పిల్లర్‌పై ట్రైడెంట్ లోగో ద్వారా విభిన్నంగా ఉంటుంది. ఇది కొద్దిగా రీడిజైన్ చేసిన బంపర్లు, కాంస్య బ్రేక్ కాలిపర్లు & ఫెండర్‌లు, టెయిల్‌గేట్‌పై మసెరటి, ఫోల్గోర్ చిహ్నాలను కలిగి ఉంటుంది. దీనికి కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌లతో పాటు 24 ఎక్స్టీరియర్ కలర్ అండ్ వీల్ కస్టమైజేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

