ETV Bharat / technology

భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారు: 'వాగన్R'ను ఆవిష్కరించిన మారుతి

మారుతి సుజుకి భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారు "వాగన్R ఫ్లెక్స్-ఫ్యూయల్‌"ను ఆవిష్కరించింది.

Maruti Suzuki WagonR Flex Fuel unveiled
Maruti Suzuki WagonR Flex Fuel unveiled (Image Credit: X/@HardeepSPuri)
author img

By ETV Bharat Tech Team

Published : June 4, 2026 at 3:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

New Delhi: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి గురువారం వాగన్R ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ఆవిష్కరించింది. ఇది భారత్‌లో మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కార్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ, పర్యావరణహిత ఇంధనాల వైపు భారత్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే మారుతి దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారును పరిచయం చేసింది.

ఈ సరికొత్త మోడల్ E20 నుంచి E85 వరకు గల ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది E100 ఇంధనంతో కూడా నడవగలదు. ఈ తరహాలో రూపొందించిన దేశీయ మొదటి మాస్-మార్కెట్ ప్యాసింజర్ వాహనం ఇదే. సంప్రదాయ పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, రవాణా రంగంలో జీవ ఇంధనాల (బయో ఫ్యూయల్స్) వాడకాన్ని విస్తృతం చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ మోడల్​ను తీసుకొచ్చినట్లు మారుతి సుజుకి వెల్లడించింది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే?: ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ (FFV) అంటే పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటి మిశ్రమంతో నడిచే వాహనాలు. పెట్రోల్​లో కలిపిన ఇథనాల్ శాతాన్ని బట్టి E20, E85, E100... ఇలా ఇంధన గ్రేడ్‌లుగా పిలుస్తారు. అయితే ఇక్కడ E100 విషయానికి వస్తే, ఈ ఇంధనం పేరును బట్టి ఇది స్వచ్ఛమైన ఇథనాల్ అనిపించినప్పటికీ, వాస్తవానికి ఇందులో 93 నుంచి 93.5 శాతం ఇథనాల్, సుమారు 5 శాతం పెట్రోల్, అలాగే 1.5 నుంచి 2 శాతం వరకు కో-సాల్వెంట్స్, ఇతర సంకలితాలు (Additives) ఉంటాయి.

ఇందులో కొత్తగా ఏముంది?: కొత్త వాగన్R ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను గతంలో పలుమార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించారు. దీన్ని మొదటిసారి 2022లో, ఆ తర్వాత 2024లో భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. అయితే, గతంలో చూపించిన అన్ని వెర్షన్లు ప్రోటోటైప్‌లు కాగా, నేడు ఆవిష్కరించింది మాత్రం ప్రొడక్షన్-స్పెక్ మోడల్. నివేదికల ప్రకారం, ఈ వాహనం కేవలం ఫ్లీట్ ఆపరేటర్లకు, ఓలా, ఉబర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మారుతి వాగన్R ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్: దీనిలో మారుతికి చెందిన K12N 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ల ఇంజిన్‌నే వాడారు. ఇది కంపెనీ ఇప్పటికే వివిధ మోడల్స్‌లో వినియోగిస్తున్న ప్రూవెన్ ఇంజిన్. అయితే E85 ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో నడిచేందుకు వీలుగా ఇంజిన్‌లో కీలక మార్పులు చేశారు.

కంపెనీ తెలిపిన ప్రకారం, ఈ ఇంజిన్ E20 నుంచి E85 వరకు ఏ ఇథనాల్ బ్లెండ్‌తోనైనా సజావుగా పనిచేయగలదు. అయితే, "వాగన్R ఫ్లెక్స్ ఫ్యూయల్" పవర్ అవుట్‌పుట్ లేదా ఫ్యూయల్ ఎఫిషియెన్సీ వంటి స్పెసిఫికేషన్లపై మారుతి సుజుకి ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందించలేదు.