మారుతి సుజుకి మాస్టర్ ప్లాన్: వచ్చే ఐదేళ్లలో 7 సరికొత్త SUVల లాంఛ్!
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రాబోయే ఐదేళ్లలో ఏకంగా 7 సరికొత్త SUVలను లాంఛ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Published : August 10, 2026 at 1:39 PM IST
Hyderabad: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' రాబోయే ఐదేళ్లలో 7 సరికొత్త ఎస్‌యూవీ (SUV)లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, భవిష్యత్తు వృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కంపెనీ విడుదల చేసిన 'యాన్యువల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ 2025-26' (Annual Integrated Report 2025-26) లో మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) ఈ విషయాలను వెల్లడించారు. తమ కంపెనీ మధ్యకాలిక వృద్ధి అవకాశాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని, అందుకే ఉత్పత్తి సామర్థ్యాన్ని (Capacity Expansion) పెంచే ప్రణాళికలను మరింత వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు.
"మార్కెట్ మధ్యకాలిక దృక్పథంపై మాకున్న విశ్వాసానికి అనుగుణంగా, మా ఉత్పాదక సామర్థ్య విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేశాం. ఆర్థిక సంవత్సరం 2026-27లో అదనంగా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని జోడించాం. కస్టమర్ల అంచనాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మా SUV పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి రాబోయే 5 ఏళ్లలో 7 కొత్త SUVలను పరిచయం చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది." - హిసాషి టకేయుచి, మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో
రాబోయే ఐదేళ్లలో భారతదేశ ప్యాసింజర్ కార్ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుందని మారుతి సుజుకి అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ తన ఉత్పాదక సామర్థ్య విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసింది. అంతేకాకుండా, రానున్న రోజుల్లో 'స్మాల్ కార్' (చిన్న కార్ల) విభాగంలో కూడా మళ్లీ బలమైన పునరుద్ధరణ (పుంజుకునే) అవకాశాలు ఉన్నాయని కంపెనీ భావిస్తోంది.
మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ మాట్లాడుతూ.. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయ కార్ల పరిశ్రమ దాదాపు 6.1 మిలియన్ల నుంచి 6.3 మిలియన్ల (61 లక్షల నుంచి 63 లక్షల) యూనిట్లకు వృద్ధి చెందుతుందని కంపెనీ ప్రస్తుతం అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
"రాబోయే ఐదేళ్లలో కార్ల మార్కెట్ వృద్ధి ఎలా ఉండబోతుందనే దానిపై సాధ్యమైనంత కచ్చితమైన అంచనాను రూపొందించే పనిలో ఉన్నాం. ప్రస్తుతం, 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి కార్ల పరిశ్రమ 6.1 నుంచి 6.3 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని, అలాగే చిన్న కార్ల మార్కెట్ వాటా గత ఐదేళ్ల వృద్ధి రేటు కంటే గణనీయంగా వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం." - ఆర్.సి. భార్గవ, మారుతి సుజుకి ఛైర్మన్
కంపెనీ తదుపరి దశ వృద్ధికి (Next Phase of Growth) తోడ్పడే కీలకమైన అంశాలను కూడా మారుతి సుజుకి వెల్లడించింది. చిన్న కార్ల విభాగం మళ్లీ పుంజుకోవడం, SUV పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం, మల్టీ-పవర్‌ట్రెయిన్ వ్యూహం (పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్, ఈవీ వంటి విభిన్న ఇంజిన్ ఆప్షన్లు), ఉత్పాదక సామర్థ్య విస్తరణ, ఎగుమతులను (Exports) పెంచడం వంటి అంశాలు తమను మరింత ముందుకు నడిపిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

