ETV Bharat / technology

గ్రహణం సమీపిస్తోంది- 'బ్లడ్ మూన్'గా మారనున్న చందమామ- ఎప్పుడు, ఎలా చూడాలంటే?

చంద్రగ్రహణం సమీపిస్తోంది. తెల్లని జాబిల్లి 'బ్లడ్ మూన్'​గా మారనుంది. ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఆ అద్భుత దృశ్యాన్ని ఎప్పుడు, ఎలా చూడాలో ఈ కథనంలో తెలుసుకోండి!

బ్లడ్ మూన్ ప్రాతినిధ్య చిత్రం
బ్లడ్ మూన్ ప్రాతినిధ్య చిత్రం (ఫొటో క్రెడిట్: IANS)
author img

By ETV Bharat Tech Team

Published : August 26, 2026 at 12:16 PM IST

|

Updated : August 27, 2026 at 2:19 PM IST

5 Min Read
Choose ETV Bharat

Hyderabad: అంతరిక్షంలో ఆగస్టు 27 అర్ధరాత్రి ఒక అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. ఈ అద్భుత దృశ్యం మరేదో కాదు.. 'పాక్షిక చంద్రగ్రహణం'. ఆగస్టు 27-28 మధ్యరాత్రి వేళ సంభవించబోయే ఈ గ్రహణం ఖగోళ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. ఆ సమయంలో భూమి నీడ చందమామను దాదాపు పూర్తిగా కమ్మేయనుంది. దీనిలో విశేషం ఏంటంటే.. కొన్ని గంటల పాటు ఆకాశంలో కన్పించనున్న ఈ వింతను 'బ్లడ్​ మూన్'​గా చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు (బ్లడ్ కలర్) రంగులో కన్పిస్తాడు.

96 శాతం భాగంపై భూమి నీడ: ఈ గ్రహణం సమయంలో చంద్రుని ఉపరితలంపై దాదాపు 96 శాతం భాగం భూమి దట్టమైన నీడలోకి వెళ్లనుంది. కేవలం 4 శాతం భాగం మాత్రమే సూర్యకాంతితో మెరుస్తుంది. దీనివల్ల చందమామ పూర్తిగా నల్లగా మారిపోకుండా, రాగి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారి 'బ్లడ్ మూన్'గా దర్శనమివ్వనుంది. కొన్ని గంటల పాటు సాగే ఈ అరుదైన దృశ్యం ఆకాశంలో కనువిందు చేయనుంది.

ఆగస్టు 27-28 మధ్యరాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం
ఆగస్టు 27-28 మధ్యరాత్రి సంభవించనున్న చంద్రగ్రహణం (ఫొటో క్రెడిట్: NASA)

బ్లడ్ కలర్​లో ఎందుకు?: సాధారణంగా చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడ (ఉంబ్రా) లోకి వస్తాడు. దీనివల్ల సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడిపై పడదు. సూర్యకాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన బ్లూ లైట్ భూమి వాతావరణంలోనే చెల్లాచెదురై ఆగిపోతుంది. కానీ, ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండే ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రం భూమి దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో భూమి వాతావరణం ఆ సూర్యకాంతిని వడకట్టి, లోపలి వైపునకు వంచుతుంది. అలా వంగి ప్రయాణించిన ఎరుపు రంగు కిరణాలు చంద్రుని ఉపరితలాన్ని తాకడం వల్లే చందమామ మనకు ఈ వింత రంగులో దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?: సూర్యునికి, చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వస్తారు. ఫలితంగా భూమి నీడ చంద్రునిపై పడి, చంద్రుడు మనకు కనిపించకుండా పోతాడు లేదా మసకబారుతాడు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజుల్లో మాత్రమే సంభవిస్తుంది. కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం రాదని గమనించాలి.

భూమి నీడ చంద్రునిపై పడే విధానాన్ని బట్టి చంద్రగ్రహణాలు ప్రధానంగా రెండు రకాలుగా ఏర్పడుతుంటాయి.

1. పాక్షిక చంద్రగ్రహణం: ఈసారి వచ్చేది పాక్షిక చంద్రగ్రహణమే. ఈ సమయంలో చంద్రునిలోని కొంత భాగం మాత్రమే భూమి నీడలోకి వస్తుంది. దీంతో చంద్రుడు సగం లేదా కొంత భాగం చీకటిగా మారినట్లు కనిపిస్తాడు.

2. సంపూర్ణ చంద్రగ్రహణం: అదే చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతే దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో కూడా భూమి సూర్యుడికి, చంద్రుడికి మధ్యనే ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా నల్లగా మారిపోడు. భూమి వాతావరణం గుండా ప్రయాణించే సూర్యకాంతి వంగి, కేవలం ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రునిపై పడుతుంది. అందుకే ఆ సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులోకి మారుతాడు. దీనినే 'బ్లడ్ మూన్' అని పిలుస్తారు.

సాధారణంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే 'బ్లడ్ మూన్' కనిపిస్తుంది. అయితే ఈసారి వచ్చే పాక్షిక చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలంలో దాదాపు 96.2% భాగాన్ని భూమి ప్రధాన నీడ (ఉంబ్రా) కమ్మేయనుంది. దీనివల్ల చంద్రునిలోని అత్యధిక భాగం ముదురు ఎరుపు రంగులోకి మారి, కేవలం ఒక చిన్న అంచు మాత్రం ప్రకాశవంతంగా మిగిలిపోతుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని 'దాదాపు బ్లడ్ మూన్' (Almost Blood Moon) గా అభివర్ణిస్తున్నారు.

ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?: ఆగస్టు 27-28 తేదీల్లో వచ్చే ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం ఉంది. భూమి పైనుంచి చూసే వారందరికీ ఈ గ్రహణంలోని ప్రతి దశ ఒకే సమయంలోనే జరుగుతుంది. అయితే, వారు నివసించే దేశం లేదా టైమ్ జోన్‌ను బట్టి స్థానిక సమయాల్లో మార్పులు ఉంటాయి.

గ్రహణం వివిధ దశలలో ఎక్కడ కనిపిస్తుందో తెలిపే ప్రపంచ పటం ఇది. భూమిపై ఏయే ప్రాంతాలలో ఏ దశ కనిపిస్తుందో, ఆ ప్రాంతాల సరిహద్దులను రేఖలు (contours) సూచిస్తాయి. ఉదాహరణకు, పాక్షిక దశ ప్రారంభం నారింజ రంగు రేఖ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ చిత్ర పటాన్ని 'సబ్-లూనార్ పాయింట్' (అంటే గరిష్ఠ గ్రహణ సమయంలో చంద్రుడు ఆకాశంలో అత్యంత ఎత్తులో ఉండే రేఖాంశం) అయిన 63°8' పశ్చిమ రేఖాంశాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించారు. ఈ రేఖల పరిధికి వెలుపల ఉన్న బూడిద రంగు ప్రాంతాలలో గ్రహణం కనిపించదు.
గ్రహణం వివిధ దశలలో ఎక్కడ కనిపిస్తుందో తెలిపే ప్రపంచ పటం ఇది. భూమిపై ఏయే ప్రాంతాలలో ఏ దశ కనిపిస్తుందో, ఆ ప్రాంతాల సరిహద్దులను రేఖలు (contours) సూచిస్తాయి. ఉదాహరణకు, పాక్షిక దశ ప్రారంభం నారింజ రంగు రేఖ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ చిత్ర పటాన్ని 'సబ్-లూనార్ పాయింట్' (అంటే గరిష్ఠ గ్రహణ సమయంలో చంద్రుడు ఆకాశంలో అత్యంత ఎత్తులో ఉండే రేఖాంశం) అయిన 63°8' పశ్చిమ రేఖాంశాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించారు. ఈ రేఖల పరిధికి వెలుపల ఉన్న బూడిద రంగు ప్రాంతాలలో గ్రహణం కనిపించదు. (ఫొటో క్రెడిట్: NASA)

అమెరికాలోని పశ్చిమ తీర నగరాలైన లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా), పోర్ట్‌ల్యాండ్ (ఒరెగాన్) నుంచి చూసే వారికి, సూర్యాస్తమయం తర్వాత కొన్ని గంటలకు ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. న్యూయార్క్, జాక్సన్‌విల్లే వంటి తూర్పు తీర నగరాల ప్రజలకు అర్ధరాత్రి సమయంలో చంద్రగ్రహణం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు.

భారతదేశంలో ఈ గ్రహణం ఎందుకు కనిపించదు?: యూకే, ఐరోపా, ఆఫ్రికా ప్రాంతాలలో ఈ గ్రహణం తెల్లవారుజామున సంభవిస్తుంది. అక్కడ సూర్యోదయానికి కొద్దిసేపటి ముందు, చంద్రుడు పశ్చిమ దిశగా కిందికి వాలిపోతున్న సమయంలో ఇది జరుగుతుంది. గ్రహణం ఏర్పడే సమయంలో భూమిపై ఎక్కడైతే పగలు ఉంటుందో, అక్కడ నివసించే ప్రజలకు చంద్రుడు కనిపించడు. ఆ సమయంలో మనకు పగలు కావడం వల్ల భారత్​తో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి అనేక దేశాల ప్రజలకు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం దక్కదు. ఈ గ్రహణం నేరుగా ఆకాశంలో కనిపించకపోయినప్పటికీ, ఆన్‌లైన్ సాంకేతికత ద్వారా మన ఇంట్లో కూర్చునే దీనిని స్పష్టంగా వీక్షించవచ్చు.

లైవ్ స్ట్రీమింగ్ (Live Streaming) ద్వారా:

నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్ (NASA YouTube Channel): అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' ఈ గ్రహణాన్ని ప్రత్యేక కెమెరాల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ఆగస్టు 28 ఉదయం నుంచి నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదా 'NASA+' యాప్‌లో దీనిని ఉచితంగా చూడవచ్చు.

టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ (Timeanddate.com): ఖగోళ ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారం చేసే ఈ ప్రముఖ వెబ్‌సైట్, గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి దశను హై-డెఫినిషన్ (HD) లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందిస్తుంది.

వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ (The Virtual Telescope Project): అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం రోబోటిక్ టెలిస్కోప్‌ల ద్వారా ఈ గ్రహణాన్ని ప్రపంచవ్యాప్త వీక్షకుల కోసం లైవ్ ప్రసారం చేస్తుంది.

సోషల్ మీడియా & వెబ్ పోర్టల్స్: గ్రహణం గరిష్ఠ స్థాయికి చేరుకునే సమయానికి (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28 ఉదయం 09:43 గంటలకు) అమెరికా, ఐరోపా దేశాల ప్రజలు తీసే అద్భుతమైన ఫొటోలు, వీడియోలు ఎక్స్ (గతంలో ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్‌ట్యాగ్ #LunarEclipse లేదా #BloodMoon ద్వారా తక్షణమే అందుబాటులోకి వస్తాయి.

భారత ప్రామాణిక సమయం (IST) ప్రకారం గ్రహణ సమయాలు (ఆగస్టు 28న):

  • గ్రహణం ప్రారంభం: ఉదయం 06:53 గంటలకు
  • పాక్షిక చంద్రగ్రహణం మొదలు: ఉదయం 08:03 గంటలకు
  • గ్రహణం గరిష్ఠ స్థాయి (ఉచ్ఛదశ): ఉదయం 09:43 గంటలకు
  • పాక్షిక చంద్రగ్రహణం ముగింపు: ఉదయం 11:21 గంటలకు
  • గ్రహణ ప్రక్రియ పూర్తిగా ముగిసే సమయం: మధ్యాహ్నం 12:31 గంటలకు
Last Updated : August 27, 2026 at 2:19 PM IST