మొన్న జ్వాలా వలయంతో సూర్యుడు- ఇప్పుడు రక్త వర్ణంలో చంద్రుడు!- అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
నేడే సంపూర్ణ చంద్రగ్రహణం- బ్లడ్ కలర్లోకి మారనున్న చంద్రుడు- కారణం ఏంటంటే?

Published : February 27, 2026 at 5:33 PM IST
|Updated : March 3, 2026 at 11:39 AM IST
Hyderabad: కంకణాకార సూర్యగ్రహణం సంభవించిన కొన్ని రోజుల్లోనే అంతరిక్షం మరో అద్భుత దృశ్యానికి వేదికగా మారనుంది. మొన్న జ్వాలా వలయంతో రవి దర్శనాన్ని అందిస్తే, ఇప్పుడు "బ్లడ్ మూన్"ను చూపించబోతోంది. తాజా ఘటనకు కారణం నేటి (మార్చి 3,2026) సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో తెల్లని జాబిల్లి రక్త వర్ణంలోకి మారనుంది.
చంద్రుడు బ్లడ్ కలర్లో ఎందుకు?: సాధారణంగా సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి వచ్చినప్పుడు "చంద్రగ్రహణం" సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. ఆ సమయంలో చంద్రుడి కొంత భాగం మాత్రమే ఉంబ్రా (భూమి నీడ)లో ఉంటే "పాక్షిక చంద్రగ్రహణం" ఏర్పడుతుంది. అదే పూర్తిగా అంటే మొత్తం చంద్రుడు భూమి నీడ కిందకు వస్తే "సంపూర్ణ చంద్రగ్రహణం" సంభవిస్తుంది.
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి పూర్తిగా అడ్డు వస్తే "సంపూర్ణ చంద్రగ్రహణం", కొద్దిగా అడ్డు వస్తే "పాక్షిక చంద్రగ్రహణం" ఏర్పడుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే ఏర్పడుతుంది. కానీ ప్రతీ పౌర్ణమికి చంద్రగ్రహణం ఏర్పడదు.
అయితే ఈసారి సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం "బ్లడ్ మూన్"గా మారనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉంటాడు కాబట్టి సూర్యకాంతి నేరుగా చంద్రుడిని చేరుకోలేదు. సూర్యకాంతిలో తక్కువ తరంగదైర్ఘ్యాలు (WaveLength) కలిగిన నీలి కాంతి సులభంగా చెల్లాచెదురుగా పోతుంది. కానీ ఎరుపు, నారింజ కాంతి దీర్ఘ తరంగదైర్ఘ్యాల మాదిరిగా భూమి దట్టమైన వాతావరణంలోకి చొచ్చుకుపోయి చంద్రుని ఉపరితలం చేరుకుంటుంది. ఈ నారింజ, ఎరుపు రంగులు భూమిని దాటుకుని ఆపై జాబిల్లిని చేరుకోవడం వల్ల అది మనకు రక్త వర్ణంలో కనిపిస్తుంది.
మనకు తెలిసిన ఇంకొన్ని సంపూర్ణ చంద్ర గ్రహణాలలో సూపర్ మూన్, బ్లూ మూన్, హార్వెస్ట్ మూన్ ఉన్నాయి.
సూపర్ మూన్: ఈ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. ఈ సమయంలో భూమికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుడు సాధారణం కంటే 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
బ్లూ మూన్: ఇది ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 1940 నుంచి క్యాలెండర్ నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని "బ్లూ మూన్"గా పిలుస్తారు.
హార్వెస్ట్ మూన్: ఈ తరహా చంద్రుడుని శరదృతువు కాలంలో సెప్టెంబర్ 22-23 తేదీల్లో చూడొచ్చు. ఇది రైతులకు వారి పంట కోతకు అదనపు కాంతిని అందిస్తుంది. అందుకే దీన్ని "హార్వెస్ట్ మూన్" అని పిలుస్తారు.
భారతదేశంలో ఈ బ్లడ్ మూన్ ఎప్పుడు కన్పిస్తుంది?: భారత వాతావరణ శాఖ (IMD పొజిషనల్ ఆస్ట్రానమికల్ సెంటర్, కోల్‌కతా) ప్రకారం, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 12 ఫాల్గుణ, 1947 శక శకంలో సంభవిస్తుంది. ఇది భారత ప్రామాణిక సమయం (IST) మార్చి 3, 2026 మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణత సాయంత్రం 4:34 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:33 గంటలకు ముగుస్తుంది. హైదరాబాద్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం 26 నిమిషాలపాటు కన్పిస్తుంది.
మరోవైపు టైమ్ అండ్ డేట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, భారత ప్రామాణిక సమయం ప్రకారం(IST) ప్రకారం గ్రహణ సమయాలు ఇలా విధంగా ఉన్నాయి:
పెనుంబ్రల్ దశ ప్రారంభం: 4:58 PM IST
సంపూర్ణత ప్రారంభం: 4:58 PM IST
సంపూర్ణత ముగింపు: 5:32 PM IST
పెనుంబ్రల్ దశ ముగింపు: 7:53 PM IST
దీన్ని ఎప్పుడు చూడాలి?: చంద్రగ్రహణాన్ని స్పష్టంగా వీక్షించేందుకు సరైన సమయం ఏదంటే కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇది మీరు నివసించే స్థానాన్ని బట్టి మారుతుంది. పశ్చిమ ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రదేశాలలో ఈ గ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం, అండమాన్, నికోబార్ దీవులలోని కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ దశ ముగింపును చూడొచ్చు. ఇంకా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అమెరికాలోనూ ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. చంద్రగ్రహణం కచ్చితమైన సమయాన్ని తెలుసుకునేందుకు TimeAndDate.com లేదా NASA ఎక్లిప్స్ పోర్టల్‌లో ఇంటరాక్టివ్ మ్యాప్‌లు, రియల్-టైమ్ సాధనాలను ఉపయోగించవచ్చు.
ఎలా చూలాలి?: సూర్యగ్రహణం మాదిరిగా చంద్రగ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక గ్లాసెస్ అంటూ ఏం అవసరం లేదు. కానీ ఈ దృగ్విషయాన్ని మన కంటితో చూడటం కంటే బైనాక్యూలర్, టెలిస్కోప్‌ను ఉపయోగించడం సురక్షితం. ఈసారి వస్తున్న చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల ప్రజలకు కనిపించనుంది. కచ్చితమైన సమయంలో బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్‌తో పాటు ప్రాక్టికల్ టిప్స్‌ను పాటిస్తే ఈ ఖగోళ దృగ్విషయాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు.

