ETV Bharat / technology

మార్కెట్లో 'లావా బోల్డ్ N4 లైట్' లాంఛ్- రూ. 7999కే పొందొచ్చు!

రూ. 7999 ఆఫర్ ధరతో భారత మార్కెట్లో 'లావా బోల్డ్ N4 లైట్' స్మార్ట్​ఫోన్ లాంఛ్ అయింది. ఆండ్రాయిడ్ 16 గో ఆపరేటింగ్ సిస్టమ్​పై పనిచేసే ఈ హ్యాండ్​సెట్​ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

లావా బోల్డ్ N4 లైట్
లావా బోల్డ్ N4 లైట్ (ఫొటో క్రెడిట్: Amazon/Lava)
author img

By ETV Bharat Tech Team

Published : August 27, 2026 at 4:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: లావా భారత మార్కెట్లో సరికొత్తగా 'బోల్డ్ N4 లైట్' స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫోన్ 6.56-అంగుళాల డిస్‌ప్లే, యునిసోక్ 9863A చిప్‌సెట్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 'ఆండ్రాయిడ్ 16 గో'పై పనిచేస్తుంది. ఇది వర్చువల్ ర్యామ్ (virtual RAM) సపోర్ట్‌తో కూడిన 3GB ర్యామ్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా ఈ ఫోన్ రూ. 8,100 లోపు ధరలోనే తీసుకొచ్చింది. దీని అమ్మకాలు వచ్చే నెలలో అమెజాన్ (Amazon)లో ప్రారంభం కానున్నాయి.

భారతదేశంలో లావా బోల్డ్ N4 లైట్ ధర & లభ్యత:

కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం ఒకే ఒక 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్​లో తీసుకొచ్చింది. దీని ధరను రూ. 8,099గా నిర్ణయించింది. అయితే ప్రత్యేక లాంఛ్ ఆఫర్ కింద దీనిని రూ. 7,999కే పొందవచ్చని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

కలర్ ఆప్షన్లు: ఇది మార్కెట్లో 'ఎంపైర్ గోల్డ్' (Empire Gold), 'ఘోస్ట్ సిల్వర్' (Ghost Silver) రంగులలో లభిస్తుంది.

సేల్ వివరాలు: ఇది సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు (IST) అమెజాన్‌లో అమ్మకానికి రానుంది.

ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి లావా నుంచి 'Free Service at Home' సదుపాయం లభిస్తుంది. దీని కింద దేశంలో ఎక్కడ ఉన్నా, వినియోగదారుల ఇంటికే వెళ్లి ఆఫ్టర్-సేల్స్ సేవలను కంపెనీ అందిస్తుంది.

లావా బోల్డ్ N4 లైట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: లావా బోల్డ్ N4 లైట్ 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

ప్రాసెసర్: ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిసోక్ 9863A చిప్‌సెట్ ఉంది. ఇది 3GB RAMతో వస్తుంది, 3GB వరకు అదనపు వర్చువల్ RAMకు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, దీనిని 64GB వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా సెటప్: ఫొటోగ్రఫీ కోసం, లావా బోల్డ్ N4 లైట్‌లో 8-మెగాపిక్సెల్ AI సింగిల్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆడియో ప్లేబ్యాక్ కోసం ఒకే స్పీకర్ ఉన్నాయి. ఈ ఫోన్ మన్నిక కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్​తో వస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఇది ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్‌తో వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో బ్లోట్‌వేర్ ఉండదని, రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని లావా చెబుతోంది.

బ్లోట్‌వేర్ (Bloatware) అంటే?: కొత్త ఫోన్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో కంపెనీలు ముందే ఇన్‌స్టాల్ చేసే అనవసర యాప్స్ లేదా సాఫ్ట్‌వేర్లను బ్లోట్‌వేర్ అంటారు. ఈ ఫోన్‌లో బ్లోట్‌వేర్ లేదని కంపెనీ చెబుతుండటంతో, ఇది క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుందని స్పష్టమవుతోంది.