జూన్ రేసులో TVS దూకుడు: వెనకబడ్డ హీరో, హోండా!
జూన్ 2026లో TVS మోటార్ 5.65 లక్షల వాహనాల విక్రయాలతో భారీ వృద్ధిని నమోదు చేసింది. తద్వారా హీరో, హోండాలను వెనక్కి నెట్టి ద్విచక్ర వాహన అమ్మకాల్లో అగ్రగామిగా అవతరించింది.

Published : July 6, 2026 at 11:05 AM IST
Hyderabad: జూన్ 2026 నెల మొత్తం ద్విచక్ర వాహన విక్రయాల్లో TVS మోటార్ కంపెనీ 5,65,417 యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ దిగ్గజాలైన హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI)లను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా హీరో మోటోకార్ప్ 5,41,159 మోటార్‌సైకిళ్లు అండ్ స్కూటర్లను విక్రయించగా, హోండా 5,28,281 యూనిట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఈ గణాంకాలు టీవీఎస్ (TVS) కంపెనీకి ఈ నెల ఎంత ఆశాజనకంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే టీవీఎస్ అత్యధికంగా 47 శాతం వార్షిక వృద్ధిని (YoY Growth) సాధించింది. దీనికి భిన్నంగా హోండా 23 శాతం వృద్ధిని నమోదు చేయగా, హీరో మోటోకార్ప్ విక్రయాలు గతేడాది జూన్ (5,53,963 యూనిట్లు)తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
దేశీయంగా మార్కెట్ విక్రయాల వివరాలు:
- హోండా (HMSI): భారత్‌లో 4,68,956 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగింది.
- హీరో మోటోకార్ప్: దేశీయంగా 5,02,890 యూనిట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే గతేడాది నమోదైన 5,25,136 యూనిట్ల కంటే ఇది తక్కువ.
- TVS మోటార్: జూన్ నెలలో భారత్‌లో 4,11,014 ద్విచక్ర వాహనాలను విక్రయించి, గతేడాదితో పోలిస్తే 46 శాతం వృద్ధిని సాధించింది.
విదేశీ మార్కెట్లలో కూడా టీవీఎస్ కంపెనీ తన భారీ ఆధిక్యతను నిలబెట్టుకుంది.
ఎగుమతుల వివరాలు ఇలా ఉన్నాయి:
- టీవీఎస్ మోటార్: జూన్ నెలలో గతేడాదితో పోలిస్తే 48 శాతం వృద్ధితో, ఏకంగా 1,54,403 ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది.
- హోండా (HMSI): మొత్తం 59,325 యూనిట్లను విదేశాలకు పంపింది.
- హీరో మోటోకార్ప్: విదేశీ ఎగుమతులు 38,269 యూనిట్లుగా నమోదయ్యాయి.
వాహనాల శ్రేణి వారీగా (Segment-wise) అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:
- టీవీఎస్ మోటార్: జూన్ నెలలో 2,67,096 మోటార్‌సైకిళ్లు, 2,47,950 స్కూటర్లను విక్రయించింది. ఈ రెండు విభాగాలలోనూ కంపెనీ రెండంకెల వృద్ధిని (Double-digit growth) సాధించింది.
- హీరో మోటోకార్ప్: ఈ సంస్థకు ఎప్పటిలాగే మోటార్‌సైకిళ్ల నుంచే భారీగా అమ్మకాలు వచ్చాయి. జూన్‌లో 4,78,701 మోటార్‌సైకిళ్లను డిస్పాచ్ చేయగా, స్కూటర్ల అమ్మకాలు 62,458 యూనిట్లుగా నమోదయ్యాయి.
- హోండా (HMSI): ఈ కంపెనీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల వారీగా నెలవారీ అమ్మకాల వివరాలను విడిగా వెల్లడించలేదు. అయినప్పటికీ, దేశీయ మార్కెట్ అమ్మకాలలో హోండా 'యాక్టివా' (Activa) సిరీస్ స్కూటర్లదే సింహభాగం అని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాల వివరాలు:
- టీవీఎస్ మోటార్: జూన్ నెలలో ఏకంగా 48,537 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది నమోదైన 14,400 యూనిట్ల కంటే మూడు రెట్లకు పైగా ఎక్కువ.
- హీరో మోటోకార్ప్: ఈ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం 'విడా' (Vida), జూన్ నెలలో 21,812 వాహన్ (Vahan) రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది.

