మైలేజ్ రికార్డ్లను బ్రేక్ చేసిన 'సియారా'- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
టాటా సియారా హైపెరియన్ ఇంజిన్ 29 Kmpl అద్భుతమైన మైలేజీతో "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకుంది.

Published : December 11, 2025 at 12:48 PM IST
Hyderabad: స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇటీవలే విడుదల చేసిన "సియారా" వచ్చీ రాగానే సంచలనం సృష్టించింది. అద్భుతమైన మైలేజీని అందించి "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకుంది. కేవలం 12 గంటల నిరంతర డ్రైవింగ్‌లో ఇది 29.9 Km/l మైలేజీని సాధించి గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.
NATRAX ఇండోర్ టెస్ట్: నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు NATRAX ఇండోర్‌లో పిక్సెల్ మోషన్ బృందం ఈ పరీక్షను నిర్వహించింది. మధ్యలో చిన్న చిన్న బ్రేక్ సమయాల్లో డ్రైవర్లను మార్చి మొత్తానికి అదే రోజున ఈ రికార్డును ధృవీకరించారు. టాటా మోటార్స్ తన కొత్త హైపెరియన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఈ మైలురాయిని సాధించింది. దీన్ని "సియారా" హై-స్పెక్ వేరియంట్‌లలో అందించనున్నారు.

1.5L హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్: ఈ మైలేజ్ రికార్డు వెనుక ఉన్న నిజమైన హీరో టాటా "సియారా" 1.5L హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ ఇంధన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా స్మూత్ రన్నింగ్, పవర్, శుద్ధీకరణ సంపూర్ణ సమతుల్యతను కూడా అందిస్తుంది.
దీని కీలక సాంకేతిక ప్రయోజనాల విషయానికి వస్తే, ఇది అధునాతన దహన వ్యవస్థ, టార్క్-రీచ్ పెర్ఫార్మెన్స్ బ్యాండ్, అధునాతన ADAS ఫీచర్లతో కూడిన ఎఫిషియెన్సీ-ఫస్ట్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. ఇది సుదీర్ఘ కాలం పాటు స్థిరమైన, సమర్థవంతమైన ఇంధన సరఫరాను అందిస్తుంది. ఈ ఫీచర్లు 12 గంటల నిరంతర డ్రైవింగ్ సమయంలో కూడా ఇంజిన్‌ను అలసిపోకుండా అత్యంత సమర్థవంతంగా పనిచేసేలా సహాయపడతాయి.

దీనిపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ CPO మోహన్ సావర్కర్ మాట్లాడుతూ, "సియారా వచ్చీ రాగానే జాతీయ రికార్డును సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ హైపెరియన్ ఇంజిన్‌ను పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ల సరిహద్దులను అధిగమించే విధంగా అభివృద్ధి చేశాం. ఇప్పుడు సాధించిన ఈ రికార్డు ఆ కృషికి నిదర్శనం. ఇది మార్కెట్లో సియారా ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది. ఎందుకంటే కస్టమర్లు ఇప్పుడు దీనితో కొంగొత్త స్టైల్, ఫీచర్లను మాత్రమే కాకుండా అద్భుతమైన మైలేజీని కూడా పొందుతారు" అని అన్నారు.

మైలేజ్ ప్లస్ పనితీరు: ఈ పెట్రోల్-ఇంజిన్‌తో "సియారా" ఇండోర్‌లోని NATRAX ప్రూవింగ్ ట్రాక్‌లో జరిగిన హై-స్పీడ్ టెస్ట్‌లో 222 kmph గరిష్ఠ వేగాన్ని సాధించింది. ఈ ఫీట్ దీన్ని "సియారా" చరిత్రలో మాత్రమే కాకుండా దాని విభాగంలో అత్యంత ఫాస్టెస్ట్ SUVగా నిలిపింది.

దీనర్థం ఈ కొత్త SUV మైలేజ్ పరంగానే కాకుండా పనితీరు పరంగా కూడా ఈ విభాగంలో టాటా ఉత్తమ ఎంపిక. ఇది టాటా పనితీరు, ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే వినియోగదారుల భద్రతా ప్రమాణాల దృష్ట్యా భవిష్యత్ కార్ల గరిష్ఠ వేగాన్ని గంటకు 190 కిలోమీటర్లకు పరిమితం చేయనున్నారు.
హైపెరియన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: హైపెరియన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకంగా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది టాటా "సియారా" అడ్వెంచర్+, అక్ప్లిష్డ్, అక్ప్లిష్డ్+ వేరియంట్‌లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ ధర రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

సియారా ధరల వివరాలు: టాటా మోటార్స్ దీన్ని రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారత్‌లో విడుదల చేసింది. దీనిలో స్మార్ట్+, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్+, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+ అనే వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇటీవలే వీటిలోని లో, మిడ్ రేంజ్ వేరియంట్ల ధరలను కూడా ప్రకటించింది.
వీటిలో "సియారా" ప్యూర్, ప్యూర్+ ట్రిమ్‌ల ధరలు రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సింపుల్ ఫీచర్-ప్యాక్డ్, బడ్జెట్-ఫ్రెండ్లీ SUV కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ ట్రిమ్‌లు మంచి ఎంపికగా ఉంటాయి. అలాగే మరింత అడ్వెంచర్ కోరుకునే డ్రైవర్ల కోసం రూపొందించిన అడ్వెంచర్, అడ్వెంచర్+ ట్రిమ్‌ల ధరలు కూడా వెల్లడయ్యాయి. వాటి ధర రూ. 15.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+ ట్రిమ్‌ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. పై నుంచి ప్రీమియం స్థాయిలో ఉన్న ఈ వేరియంట్లు మరింత అధునాతన ఫీచర్లు, సెఫ్టీ, టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉన్నందున చాలా మంది కస్టమర్లు వీటి ధర వివరాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాటా మోటార్స్ త్వరలోనే ఈ వేరియంట్ల ధరలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
ఇకపోతే కంపెనీ భారత మార్కెట్లో ఈ కొత్త టాటా "సియారా" బుకింగ్‌లను డిసెంబర్ 16, 2025 నుంచి స్వీకరించడం మొదలుపెట్టనుంది. అయితే డెలివరీలను జనవరి 15, 2026 నుంచి ప్రారంభించనుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.

