ETV Bharat / technology

ఈ-రిక్షాలకు 'రిమోట్' షాక్: రెండు యాప్‌లపై కేంద్రం ఉక్కుపాదం

ఈ-రిక్షాలను రిమోట్ ద్వారా నిలిపివేసేందుకు వినియోగిస్తున్న రెండు యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి తక్షణమే తొలగించాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Viral videos show people utilising smartphone apps to remotely turn off e-rickshaws
Viral videos show people utilising smartphone apps to remotely turn off e-rickshaws (Representational Picture, Credit: ANI)
author img

By ETV Bharat Tech Team

Published : July 3, 2026 at 3:39 PM IST

4 Min Read
Choose ETV Bharat

New Delhi: రహదారులపై వెళ్తున్న ఈ-రిక్షాలను రిమోట్ పద్ధతిలో నిలిపివేస్తూ దుర్వినియోగానికి గురవుతున్న రెండు అప్లికేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఆ రెండు యాప్‌లను తక్షణమే తొలగించాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాన్ని వెల్లడించిన మెయిటీ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్, "నిన్న మా దృష్టికి వచ్చిన రెండు యాప్‌లను యాప్ స్టోర్ల నుంచి తొలగించాం. యాప్ స్టోర్​లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదకరమైన యాప్‌లు అందుబాటులోకి రాకుండా చూసేందుకు వారితో చర్చిస్తాం" అని తెలిపారు.

అసలేం జరిగిందంటే?: రహదారిపై వెళ్తున్న ఈ-రిక్షాల బ్యాటరీలను కొందరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి, వాటిని రిమోట్‌గా నిలిపివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనివల్ల వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయి డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ రవాణా శాఖ దర్యాప్తు ప్రారంభించగా, కేంద్రం స్పందించి ఈ యాప్‌లను తొలగించేలా చర్యలు చేపట్టింది.

నిజానికి ఇవి బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) యాప్‌లు. వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి బ్యాటరీ పారామీటర్లను పర్యవేక్షించేందుకు టెక్నీషియన్ల కోసం వీటిని రూపొందించారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొందరు యువకులు ఈ యాప్‌లను దుర్వినియోగం చేస్తూ.. బ్లూటూత్ ద్వారా సమీపంలోని ఈ-రిక్షాల బ్యాటరీలకు కనెక్ట్ అవుతున్నారు. కేవలం సరదా (ప్రాంక్) కోసం వాటి విద్యుత్ సరఫరాను రిమోట్‌గా నిలిపివేస్తున్నారు. అయితే దీనివల్ల వాహనాలు మార్గమధ్యలోనే ఆగిపోయి డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భద్రతా లోపాలే కారణం: పాస్‌వర్డ్ లేదా అథెంటికేషన్ (ధృవీకరణ) వంటి ప్రాథమిక భద్రతా ఫీచర్లు లేని కొన్ని తక్కువ ధర కలిగిన బ్లూటూత్ లిథియం బ్యాటరీ ప్యాక్‌లపైనే ఈ ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల దాదాపు 10 నుంచి 15 మీటర్ల బ్లూటూత్ పరిధిలో ఉన్న ఎవరైనా సరే.. ఈ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) కి సులభంగా కనెక్ట్ అయి, వాహనాన్ని నిలిపివేయగలుగుతున్నారు. అయితే, ఫ్యాక్టరీ సెక్యూరిటీ ఉన్నవి లేదా కంపెనీల సొంత బ్యాటరీ వ్యవస్థలపై (Proprietary systems) ఈ హ్యాకింగ్ ప్రభావం ఏమాత్రం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

డ్రైవర్లపై తీవ్ర ప్రభావం: మరోవైపు, దిల్లీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే ఈ-రిక్షా డ్రైవర్లకు ఈ ఆటంకాలు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. వాహనాలు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల ప్రయాణికులు మార్గమధ్యలోనే నిలిచిపోతుండగా.. డ్రైవర్లు తమ రోజువారీ ఆదాయాన్ని కోల్పోతున్నారు. గంటల తరబడి సమయం వృథా అవ్వడమే కాకుండా, అనవసరంగా టోయింగ్ (Towing) లేదా రిపేర్ల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమాన్ సిద్ధిఖీ 'ఏఎన్ఐ' (ANI) వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇటీవల రోడ్డుపై నిలిచిపోయిన ఒక ఈ-రిక్షా డ్రైవర్‌కు తాను స్వయంగా సహాయం చేసిన ఉదంతాన్ని వివరించారు.

"రోడ్డుపై ఒక డ్రైవర్ తన ఈ-రిక్షాను మరో రిక్షాకు కట్టి లాక్కెళ్తుండటం నేను చూశాను. ఈ సమస్య వెనుక కచ్చితంగా ఆ యాప్ దుర్వినియోగమే ఉండి ఉంటుందని నాకు అనుమానం వచ్చింది. వెంటనే నా వాహనాన్ని ఆ రిక్షా వెనుకగా తీసుకువెళ్లి, నా ఫోన్‌లోని యాప్‌ను ఆ ఈ-రిక్షాకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాను. అది కనెక్ట్ అవ్వగానే, నేను ఆ డ్రైవర్‌ను కాసేపు ఆగమని చెప్పి.. ఇప్పుడు నీ రిక్షా మళ్లీ స్టార్ట్ అవుతుందని అతనికి ధైర్యం చెప్పాను." - అమాన్ సిద్ధిఖీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

అమాన్ సిద్ధిఖీ తెలిపిన వివరాల ప్రకారం, ఆ డ్రైవర్ ఈ-రిక్షాను అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ఉదయం నుంచే వాహనం ఆగిపోవడంతో మార్గమధ్యలోనే చిక్కుకుపోయిన అతడు, ఆ రోజు సంపాదించాల్సిన సుమారు రూ.400 నుంచి రూ.500 వరకు తన ఒక రోజు మొత్తం ఆదాయాన్ని కోల్పోయాడు.

"అతడు నా ముందు ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుని.. తన ఒక రోజు మొత్తం సంపాదనను కోల్పోయానని చెప్పాడు. పైగా ఆ రిక్షాను అతడు అద్దెకు తీసుకున్నాడు. అది విని నేను కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాను. రోజంతా అతడి రిక్షా ఒకే చోట నిలిచిపోయింది. కేవలం సరదా కోసం కొందరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు ఎంతమాత్రం సమర్థించదగినవి కావు, ఇది ముమ్మాటికీ తప్పే..." అని సిద్ధిఖీ ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని..

బ్లూటూత్‌లోని ఈ భద్రతా లోపం గురించి డ్రైవర్లకు చాలావరకు అవగాహన ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో, యాప్ ద్వారా కేవలం నిలిచిపోయిన వాహనాలను "రిపేర్" చేయించడం కోసం వారు స్థానికులకు లేదా మెకానిక్‌లకు డబ్బులు చెల్లించినట్లు కూడా సమాచారం ఉంది. ఈ దుర్వినియోగం వల్ల వాహనం డిజిటల్ డ్యాష్‌బోర్డ్ డేటా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి (క్లియర్ అయి), బ్యాటరీ సెట్టింగ్స్‌ను మళ్లీ పునరుద్ధరించే వరకు వాహనం స్టార్ట్ కాకుండా పోతోంది.

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు: ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీలోని రద్దీ రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా.. ఈ-రిక్షాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్న బ్యాటరీ వ్యవస్థల భద్రతపై కూడా ఈ భద్రతా లోపం తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.