గూగుల్ 'పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్' డిజైన్ రివీల్- ఓసారి చూసేయండి!
గూగుల్ ఆగస్టు 12న తన "పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్" స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయింది. దీనిలో భాగంగా కంపెనీ ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది.

Published : August 5, 2026 at 1:55 PM IST
Hyderabad: వచ్చే వారం గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోనూ విడుదల కానున్న గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ (Pixel 11 Pro Fold) డిజైన్‌ను గూగుల్ అధికారికంగా రివీల్ చేసింది. టెక్ దిగ్గజం నిర్వహించనున్న 'మేడ్ బై గూగుల్' (Made By Google) ఈవెంట్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో మోడళ్లతో పాటు ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను కూడా ఆవిష్కరించనున్నారు.
గూగుల్ పిక్సెల్ 11 ఫోల్డ్: గూగుల్ విడుదల చేసిన అధికారిక టీజర్, ఈ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్‌ను ధృవీకరించింది. ఇది ఇంతకుముందు లీక్ అయిన రెండర్‌లలో కనిపించిన డిజైన్‌నే పోలి ఉంది. పిక్సెల్ సిరీస్‌లో పరిచయమున్న చతురస్రాకార (Square-shaped) రియర్ కెమెరా మాడ్యూల్‌నే ఇందులోనూ కొనసాగించారు. అయితే, గత మోడల్‌తో పోలిస్తే కెమెరా లెన్స్‌లు ఉండే రెండు పిల్-షేప్డ్ వైజర్‌ల పరిమాణం ఈసారి కాస్త పెద్దదిగా కనిపిస్తోంది.
పిక్సెల్ గ్లో లైట్ కనిపించట్లేదు: సాధారణ మోడళ్లయిన 'పిక్సెల్ 11', 'పిక్సెల్ 11 ప్రో'లలో ఆశించే 'పిక్సెల్ గ్లో లైట్' (Pixel Glow light) ఫీచర్, ఈ ఫోల్డబుల్ మోడల్‌లో లేనట్లు తెలుస్తోంది. దీనిని బట్టి, గూగుల్ కొన్ని డిజైన్ మార్పులను తన నాన్-ఫోల్డింగ్ డివైజ్‌ల కోసం ప్రత్యేకంగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ వెనుక ప్యానెల్ మధ్యలో గూగుల్ బ్రాండింగ్ లోగో ఉంది. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ అమర్చగా, పైభాగంలో స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ కటౌట్ ఇచ్చారు.
ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ సరికొత్త 'గ్రీన్' (Green finish) రంగులో రానున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ ఫోన్ ముందు, వెనుక ప్యానెల్‌లు ఫ్లాట్ డిజైన్‌తో ఒకేలా కనిపిస్తున్నాయి. హార్డ్‌వేర్ రంగంలో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, ఈ డివైజ్‌ను పలు రకాల అధునాతన 'జెమిని ఏఐ' (Gemini AI) టూల్స్‌తో అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
లాంఛ్ తేదీ & లభ్యత: గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ (Google Pixel 11 Pro Fold) భారత మార్కెట్‌తో పాటు ఇతర ప్రపంచ దేశాలలో 2026 ఆగస్టు 12న అధికారికంగా విడుదల కానుంది. పిక్సెల్ 11 సిరీస్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ (Pre-order) కూడా అదే రోజు నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. దీనివల్ల వినియోగదారులు తమకు నచ్చిన మోడల్‌ను ముందే రిజర్వ్ చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 11 ఫోల్డ్ అంచనా ఫీచర్లు: వివిధ నివేదికల ప్రకారం, ఈ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ లోపలి భాగంలో 8-అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ (OLED) ప్రధాన స్క్రీన్, అలాగే బయట భాగంలో 6.4-ఇంచుల ఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లో గూగుల్ సరికొత్త 'టెన్సార్ జీ6' (Tensor G6) చిప్‌సెట్, 'టైటాన్ ఎమ్3' (Titan M3) సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌ను అందించొచ్చు. ఇది గరిష్ఠంగా 16GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించవచ్చని అంచనా.
కెమెరా వివరాలు: కెమెరా విషయానికొస్తే, ఈ పరికరం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్‌తో పాటు 10.5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10.8MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. అలాగే, ఇందులో సెల్ఫీల కోసం కవర్ డిస్‌ప్లేపై ఒకటి, లోపలి ఫోల్డబుల్ స్క్రీన్‌పై ఒకటి చొప్పున రెండు 10 మెగాపిక్సెల్ కెమెరాలను అందించనున్నట్లు సమాచారం.

