ETV Bharat / technology

'బుక్ ఎ రైడ్ హోమ్/ రీఆర్డర్ మై లాస్ట్ మీల్': జెమిని 'ఏజెంటిక్' యుగం- ఒక్కమాటతో "గెలాక్సీ 26" యూజర్ల పనులన్నీ పూర్తి!

గూగుల్ జెమిని అప్‌డేట్‌తో "గెలాక్సీ 26" సిరీస్ కోసం మల్టీ-స్టెప్ టాస్క్ ఆటోమేషన్‌ను తీసుకొస్తోంది. దీంతో యూజర్లు ఒక్కమాట చెప్తే పనులన్నీ చిటికెలో పూర్తయిపోతాయ్!

Gemini AI Brings Multi-Step Automation To Samsung Galaxy S26 Series
Gemini AI Brings Multi-Step Automation To Samsung Galaxy S26 Series (Photo Credit- Google)
author img

By ETV Bharat Tech Team

Published : February 26, 2026 at 5:38 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: శాంసంగ్ తన వార్షిక కార్యక్రమంలో "గెలాక్సీ S26" సిరీస్​ను ప్రారంభించింది. తాజాగా ఈ లైనప్​ కోసం గూగుల్ కొత్త జెమిని AI ఫీచర్‌లను ప్రకటించింది. వీటి సహాయంతో వినియోగదారులు రైడ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్‌ చేయడం, కిరాణా సామాగ్రి లిస్ట్​ను ప్రిపేర్ చేయడం వంటి అనేక పనులను జెమినితో చెప్పి చేయించుకోవచ్చు.

వినియోగదారులు తమ స్మార్ట్​ఫోన్ సైడ్ బటన్‌ను లాంగ్​-ప్రెస్ చేయడం లేదా యాప్‌ను ఓపెన్ చేయడం ద్వారా జెమినిని సంప్రదించవచ్చు. అనంతరం మనకు ఏం కావాలో చెప్తే జెమిని ఆటోమేటిక్​గా పనిని పూర్తి చేసి పెడుతుంది. జెమిని బ్యాక్​గ్రౌండ్​లో ఉంటూనే టాస్క్‌ను పూర్తి చేస్తుంది, అంటే అదే సమయంలో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాక వచ్చిన నోటిఫికేషన్‌ల ద్వారా జెమిని పురోగతిని ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు, కావాలనుకుంటే ఆ టాస్క్​లో పాల్గొనవచ్చు లేదా మధ్యలో ఆపేయవచ్చు.

"'Book a ride home (ఇంటికి వెళ్లేందుకు రైడ్ బుక్​ చెయ్)' నుంచి 'Reorder my last meal (నేను చివరిసారి బుక్ చేసిన భోజనాన్నే మళ్లీ ఆర్డర్ చెయ్' వరకు జెమిని ఇప్పుడు మీ కోసం దానిని నిర్వహించడంలో సహాయపడుతుంది" అని ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ యూజర్ ఎక్స్​పీరియన్సెస్ VP మిండీ బ్రూక్స్ అన్నారు.

జెమిని యాప్‌లోని ఈ కొత్త ఫీచర్​ను గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా, పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL వంటి ఎంపిక చేసిన పరికరాల కోసం తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉంది. ఈ టెస్టింగ్ స్టేజ్​లో ఇది US, కొరియాలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభంలో ఈ ఫీచర్​ ఫుడ్, గ్రోసరీ, రైడ్​షేర్ వర్గాలలోని ఎంపిక చేసిన యాప్‌లలో పనిచేస్తుంది.

ఈ కొత్త ఫీచర్​ను యూజర్ భద్రత, గోప్యతను దృష్టిలో పెట్టుకునే రూపొందించినట్లు గూగుల్ చెబుతోంది. ఇది పూర్తిగా వినియోగదారుల నియంత్రణలోనే పనిచేస్తుంది. ఆటోమేషన్లు కమాండ్‌తో ప్రారంభమై టాస్క్ పూర్తయిన వెంటనే ఆగిపోతాయి. స్మార్ట్‌ఫోన్‌లోని సురక్షితమైన, వర్చువల్ విండోలో యాప్‌ను అమలు చేయడం ద్వారా టాస్క్‌ను ఆటోమేట్ చేస్తుంది కాబట్టి, జెమిని పరిమిత యాప్‌లను మాత్రమే యాక్సెస్ చేయగలదు, మీ డివైజ్​లో మిగతావాటిని యాక్సెస్ చేయలేదు అని కంపెనీ హామీ ఇస్తోంది.