అమెరికా కీలక విభాగాలపై చైనా హాకర్ల పంజా: రంగంలోకి దిగి చెక్ పెట్టిన FBI, జస్టిస్ డిపార్ట్‌మెంట్!
అమెరికా కీలక విభాగాలపై చైనా హాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ, జస్టిస్ డిపార్ట్‌మెంట్ వారి కీలక ప్లాట్‌ఫారమ్‌లను జప్తు చేసి ఆ ముప్పుకు ముగింపు పలికాయి.

Published : August 27, 2026 at 8:56 PM IST
Hyderabad: అమెరికా రక్షణ, ఆర్థిక, వైజ్ఞానిక రంగాలే లక్ష్యంగా చైనా ప్రభుత్వ మద్దతుతో సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను అమెరికా భద్రతా సంస్థలు విజయవంతంగా భగ్నం చేశాయి. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), జస్టిస్ డిపార్ట్‌మెంట్ (DOJ) సంయుక్తంగా ఒక రహస్య సాంకేతిక ఆపరేషన్‌ను చేపట్టి, హాకర్లు ఉపయోగిస్తున్న ప్రధాన ఇంటర్నెట్ డొమైన్‌లను స్వాధీనం చేసుకున్నాయి.
కోర్టు పత్రాల ఆధారంగా వెల్లడైన ఈ సంచలన సైబర్ దాడి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
చైనా కంపెనీ వెనుక ఉండి నడిపిన 'QTFY' గ్రూప్
అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. చైనాలో ఉన్న 'నాంజింగ్ షిన్‌జియువెయి నెట్‌వర్క్ టెక్నాలజీ కంపెనీ' (Nanjing Xinjiuwei Network Technology Co.) ఈ హ్యాకింగ్ నెట్‌వర్క్‌ను నడిపించడానికి 'QTFY' అనే హాకర్ల గ్రూప్‌ను నియమించుకుంది. ఈ గ్రూప్ కేవలం డబ్బులు తీసుకుని హ్యాకింగ్ సేవలను (Hacking-as-a-Service) అందిస్తుంది. వీరి ప్రధాన ఖాతాదారులలో చైనాకు చెందిన సివిలియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన 'మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ' (MSS), చైనా సైన్యం 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' (PLA) కూడా ఉన్నాయి.
🚨Justice Department and @FBI Seize Platforms Operated and Used by China State-Sponsored Hackers to Target U.S. Critical Infrastructure
— U.S. Department of Justice (@TheJusticeDept) August 26, 2026
“State-sponsored malicious hackers preying on America’s critical infrastructure will be stopped and prosecuted. We are here to ensure security…
అమెరికా కీలక విభాగాలు, ప్రైవేట్ రంగమే టార్గెట్
చైనా హాకర్లు 'QScan', 'QTRouter' అనే రెండు ప్రమాదకరమైన హ్యాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఈ దాడులకు పాల్పడ్డారు. వీరి వ్యూహాత్మక దాడుల పరిధి చాలా పెద్దదిగా ఉంది:
- ప్రభుత్వ విభాగాలు: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA), సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెనేట్, దేశ రక్షణకు కీలకమైన ఎనర్జీ డిపార్ట్‌మెంట్, జస్టిస్ డిపార్ట్‌మెంట్, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ - NIH) విభాగాల్లోకి సైతం వీరు విజయవంతంగా చొరబడ్డారు.
- ప్రైవేట్ రంగం: వీటితో పాటు ప్రైవేట్ రంగంలోని పెద్ద ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, టెలికాం కంపెనీలు, విద్యుత్ సరఫరా గ్రిడ్‌లు, ఆర్థిక సంస్థలు, అమెరికా రక్షణ రంగానికి ఆయుధాలు సరఫరా చేసే డిఫెన్స్ కాంట్రాక్టర్లను కూడా ఈ అటాకర్లు టార్గెట్ చేశారు.
చైనా మాల్వేర్‌ను ఇన్‌యాక్టివ్ చేసిన అమెరికా
ఈ ఆపరేషన్ విజయంపై అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే (Todd Blanche) అధికారిక ప్రకటన విడుదల చేశారు. చైనా ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడానికి తాము చేపడుతున్న వరుస సాంకేతిక ఆపరేషన్లలో (Technical Operations) భాగంగానే ఈ తాజా చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
"అమెరికాకు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్న చైనా ప్రాయోజిత హాకర్లను మేము కచ్చితంగా అడ్డుకుంటాం, చట్టపరంగా శిక్షిస్తాం. మా దేశ ప్రజల, వ్యవస్థల రక్షణే మాకు ముఖ్యం. అందుకోసం ఎంతటి కఠినమైన చర్యలకైనా మేము వెనుకాడం."
- టాడ్ బ్లాంచే, అమెరికా అటార్నీ జనరల్
ప్రస్తుతం అమెరికా స్వాధీనం చేసుకున్న డొమైన్ల ద్వారా చైనా హాకర్ల ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిగా నిరుపయోగంగా మారాయని (Inoperable), అమెరికా సైబర్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
హ్యాకింగ్ ముఠా పనితీరు?:
కోర్టు పత్రాల ఆధారంగా, చైనా హ్యాకర్ల గ్రూప్ అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతులతో ఈ దాడులకు పాల్పడినట్లు వెల్లడైంది:
- ఆటోమేటిక్ ఇన్‌ఫెక్షన్: 'QScan' అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్న వేలాది డివైజ్‌లను స్క్యాన్ చేసి, వాటిని ఆటోమేటిక్‌గా మాల్వేర్‌తో ఇన్‌ఫెక్ట్ (సంక్రమితం) చేసేవారు.
- రహస్య నెట్‌వర్క్ నిర్మాణం: అలా ఇన్‌ఫెక్ట్ చేసిన డివైజ్‌లన్నింటినీ 'QTRouter' అనే ఒక భారీ నెట్‌వర్క్‌లోకి చేర్చేవారు. ఈ ప్రక్రియ కోసం కమర్షియల్ ప్రాక్సీ సర్వీసెస్, అద్దెకు తీసుకున్న వర్చువల్ ప్రైవేట్ సర్వర్లను (VPS) కూడా వారు వినియోగించారు.
- మూలాల గుర్తింపును మళ్లించడం: ఈ వ్యూహాత్మక పద్ధతి ద్వారా హ్యాకర్లు తమ సైబర్ దాడుల వెనుక ఉన్న చైనా మూలాలను పూర్తిగా దాచగలిగారు. ఫలితంగా, దాడులకు సంబంధించిన కీలక కమ్యూనికేషన్ అంతా చైనా వెలుపల ఉన్న కంప్యూటర్ల నుంచి, లేదా కొన్నిసార్లు వారు లక్ష్యంగా చేసుకున్న (టార్గెట్) నెట్‌వర్క్ పరిసరాల నుంచే వస్తున్నట్లు భ్రమ కల్పించారు.
- కమ్యూనికేషన్ వ్యవస్థ స్థంభన: అయితే, ఈ రెండు మాల్వేర్ ప్లాట్‌ఫారమ్‌లలో అంతర్గతంగా (ఇన్‌బిల్ట్) ఉన్న కమ్యూనికేషన్, అథెంటికేషన్ (ధృవీకరణ) డొమైన్‌లను అమెరికా ఏజెన్సీలు స్వాధీనం చేసుకోవడంతో 'QScan', 'QTRouter' నెట్‌వర్క్‌లు రెండూ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.
ఈ ఆపరేషన్ ద్వారా అమెరికాకు చెందిన పలు కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చైనా మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ బోట్‌నెట్, హ్యాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను విజయవంతంగా అడ్డుకున్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, వివిధ సంస్థలు తమ నెట్‌వర్క్‌లలో పొంచి ఉన్న 'QTFY' హ్యాకింగ్ కార్యకలాపాలను ముందే గుర్తించేందుకు వీలుగా, అవసరమైన కీలక సూచికలతో (ఇండికేటర్స్) కూడిన సంయుక్త సైబర్‌సెక్యూరిటీ అడ్వైజరీని FBI, జాతీయ భద్రతా సంస్థ (NSA) విడుదల చేశాయి.

