ETV Bharat / technology

చాట్​జీపీటీలో "హెల్త్" సెగ్మెంట్- ఇప్పుడు AIతో మీ ఆరోగ్య సంరక్షణ మరింత స్మార్ట్!

ఓపెన్​ఏఐ ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సమాధానమిచ్చే "చాట్​జీపీటీ హెల్త్" ట్యాబ్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు మెడికల్ రికార్డులను అప్‌లోడ్ చేయడానికి, "Apple Health", "MyFitnessPal" వంటి వెల్‌నెస్ యాప్‌లను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

OpenAI launches ChatGPT Health to connect medical records, wellness apps
OpenAI launches ChatGPT Health to connect medical records, wellness apps (Photo Credit- OpenAI)
author img

By ETV Bharat Tech Team

Published : January 8, 2026 at 1:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: టెక్ దిగ్గజం ఓపెన్​ఏఐ "చాట్​జీపీటీ హెల్త్" అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక AI ఫీచర్ వినియోగదారులు తమ మెడికల్ రికార్డులు, వెల్‌నెస్ యాప్‌లను చాట్​జీపీటీలో సురక్షితంగా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని సహాయంతో వినియోగదారులు తమ ఆరోగ్యం గురించి మరింత సమాచారంతో కూడిన, నమ్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని కంపెనీ చెబుతోంది.

ఈ "చాట్‌జీపీటీ హెల్త్" మోడ్ చాట్‌జీపీటీని వ్యక్తిగత సూపర్‌-అసిస్టెంట్‌గా మార్చడంలో కీలకమైన అడుగు అని కంపెనీ అప్లికేషన్స్ సీఈవో ఫిడ్జీ సిమో పేర్కొన్నారు. ఇది వివిధ రంగాల వినియోగదారులకు మెరుగైన సమాచారం, సరైన సాధనాలను అందించడం ద్వారా వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ క్రమంలో తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ, ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రోగులకు గానీ, వైద్యులకు గానీ సమర్థవంతంగా పనిచేయడం లేదని, అందుకే ఇప్పుడు వీరిద్దరూ AI సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని సిమో పేర్కొన్నారు.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌ను ఉటంకిస్తూ, 2023-2024 మధ్య కాలంలో వైద్యుల AI వాడకం దాదాపు రెట్టింపు అయిందని ఓపెన్​ఏఐ నివేదించింది. దాదాపు 68% మంది వైద్యులు తమ రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో AI సహాయపడుతుందని విశ్వసిస్తున్నారని పేర్కొంది. ఓపెన్​ఏఐ నిర్వహించిన ఒక సర్వేలో, USలోని ప్రతి ఐదుగురు పెద్దవారిలో ముగ్గురు ఇటీవలి నెలల్లో ఆరోగ్యం లేదా హెల్త్​కేర్ సంబంధిత అవసరాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగించారని, వారిలో 75% మంది ఇది చాలా సహాయకరంగా ఉందని భావించారని వెల్లడైంది.

కంపెనీ ప్రకారం, ప్రతి వారం లక్షలాది మంది ఇప్పటికే చాట్​జీపీటీ ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అవసరంతో పాటు వినియోగదారుల గోప్యత, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన కంపెనీ ఈ "చాట్​జీపీటీ హెల్త్"ను అభివృద్ధి చేసింది. తద్వారా ఆరోగ్య సంబంధిత సంభాషణల కోసం చాట్‌జీపీటీలో ఒక ప్రత్యేక విభాగం కేటాయించింది. ఇక్కడ ఫైల్​లు, చాట్​లు, కనెక్టెడ్ యాప్​లో ఇతర చాట్​ల నుంచి పూర్తిగా సెపరేట్​గా ఉంటాయి. దీంతోపాటు ఈ డేటాను తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబోమని కూడా ఓపెన్‌ఏఐ స్పష్టంగా పేర్కొంది.

దీంతో వినియోగదారులు ప్రైవసీ విషయంలో ఏమాత్రం సంకోచించకుండా ఈ ఫీచర్ సహాయంతో చాట్​జీపీటీలో తమ వైద్య రికార్డులు, వెల్‌నెస్ యాప్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా చాట్​జీపీటీ నుంచి మరింత వ్యక్తిగతీకరించిన, సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు. అయితే ఈ "చాట్​జీపీటీ హెల్త్" రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, అలాగే వైద్యుడి సలహాను భర్తీ చేయదని కంపెనీ స్పష్టం చేసింది.

వినియోగదారులకు వారి సొంత ఆరోగ్య డేటాపై నియంత్రణను అందించడానికి ఓపెన్​ఏఐ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ b.wellతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కోసం వెయిట్‌లిస్ట్ ఉంది. మెడికల్ రికార్డులను కనెక్ట్ చేసే సామర్థ్యం యునైటెడ్ స్టేట్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. భవిష్యత్తులో దీనిని క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తారు.