చంద్రయాన్-4 మిషన్ లాంఛ్‌కు జోరుగా ఏర్పాట్లు- ల్యాండింగ్ సైట్ ఎంపిక చేసిన ఇస్రో
చంద్రయాన్-4 మిషన్ కోసం చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సురక్షితమైన ల్యాండింగ్ స్థలాన్ని ఇస్రో ఖరారు చేసింది.

Published : February 10, 2026 at 11:01 AM IST
Bengaluru: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన తదుపరి ప్రధాన మూన్ మిషన్ సన్నాహాలను ముమ్మరం చేసింది. చంద్రయాన్-4 ప్రయోగానికి ఇంకా దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ, ఈ మిషన్‌కు సంబంధించిన కీలక ఏర్పాట్లు చాలావరకు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా చంద్రుని దక్షిణ ధ్రువంపై సేఫ్ ల్యాండింగ్ సైట్‌ను కూడా ఇస్రో ఎంపిక చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చంద్రయాన్-4 మిషన్‌ను ఆమోదించింది. ఇది భారతదేశం మొట్టమొదటి ల్యూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ కానుంది. అంటే ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడి నుంచి మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తొలిసారిగా తీసుకురానున్నారు. జాబిల్లిపై దిగడమే కాకుండా, అక్కడి నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడమనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలో చంద్రయాన్-4ను ఇప్పటివరకు ఉన్న అత్యంత క్లిష్టతరమైన మూన్ మిషన్‌గా పరిగణిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చంద్రయాన్-4 మిషన్‌ను 2028లో ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ ఇప్పటికే స్పష్టం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న మోన్స్ ముటన్ ప్రాంతంపై మిషన్ శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం నిర్వహించారు. ఈ ప్రాంతంలో నాలుగు సంభావ్య ల్యాండింగ్ ప్రదేశాలను గుర్తించారు. వాటికి MM-1, MM-3, MM-4, MM-5 అని పేరు పెట్టారు.
సేఫెస్ట్ సైట్‌గా "MM-4": ఈ ప్రదేశాలన్నింటినీ ఆర్బిటర్‌లోని ఇస్రో హై-రిజల్యూషన్ కెమెరాను ఉపయోగించి అధ్యయనం చేశారు. వివిధ కోణాల నుంచి తీసిన చిత్రాలు, డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు అక్కడి నేల వాలు, ఎత్తు, ప్రమాద సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ అధ్యయనంలో MM-4 సైట్ అత్యంత సురక్షితమైన, ఆశాజనక ప్రదేశంగా తేలింది. ఇస్రో అధికారులు అందించిన ప్రకారం, MM-4 చుట్టూ ఒక కిలోమీటరు వ్యాసార్థంలో ఉన్న ప్రాంతంలో ప్రమాదకర ప్రదేశాల సంఖ్య అత్యల్పంగా ఉంది.
ఇక్కడ నేల సగటు వాలు దాదాపు 5 డిగ్రీలు. ఇది ల్యాండింగ్‌కు చాలా సురక్షితమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రదేశం సగటు ఎత్తు 5,334 మీటర్లు, ఇక్కడ 24 మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు అనేక గ్రిడ్‌లు ఉన్నట్లు గుర్తించారు. MM-5తో పోల్చితే ల్యాండింగ్ విషయంలో ఇక్కడ సేఫ్ గ్రిడ్లను ఎక్కువగా గుర్తించడంతో అంతిమంగా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. అంటే ఇక్కడ ల్యాండర్ దిగేటప్పుడు పడిపోయే, దొర్లే అవకాశాలు చాలా తక్కువ.
చంద్రయాన్-4 మిషన్ ఐదు మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. అవి: ప్రొపల్షన్ మాడ్యూల్, డిసెండర్ మాడ్యూల్, అసెండర్ మాడ్యూల్, ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్, రీ-ఎంట్రీ మాడ్యూల్. డిసెండర్, అసెండర్ మాడ్యూల్స్ సంయుక్తంగా చంద్రుని ఉపరితలంపై మృదువైన ల్యాండింగ్‌ను నిర్వహిస్తాయి. అనంతరం నమూనాలను సేకరించి సురక్షితంగా భూమికి తిరిగి వస్తాయి. చంద్రయాన్-4 మిషన్ విజయవంతమైతే, చంద్రుని దక్షిణ ధ్రువం నుంచి మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తీసుకువచ్చిన అతికొద్ది దేశాల సరసన, అలాగే ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా భారతదేశం నిలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం 2028లో జరగనుంది. ఇది చంద్రునిపై మానవ అన్వేషణకు, అధునాతన సాంకేతికత అభివృద్ధికి కీలక మార్గం చూపుతుంది.

