ప్రశాంతంగా ఉన్న చంద్రునిపై ప్లాస్మా తుపాను!- చంద్రయాన్-3 మరో కీలక ఆవిష్కరణ
చంద్రుని దక్షిణ ధ్రువం సజీవంగా ఉందని, ఉపరితలంపై చురుకైన వాతావరణం ఉందని విక్రమ్ ల్యాండర్ ధృవీకరించింది.

Published : December 11, 2025 at 4:47 PM IST
Hyderabad: చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3 తాజాగా మరో ఘనత సాధించింది. ప్రశాంతంగా కనిపించే జాబిల్లి ఉపరితలంపై ఊహించని విధంగా చురుకుగా ఉండే ప్లాస్మాను గుర్తించింది. ఇది ఇప్పటివరకు మనం నిశ్శబ్దంగా, నిర్జీవమైన ప్రదేశంగా భావించిన చంద్రుడిపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది.
ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3, 2023 మధ్య విక్రమ్ ల్యాండర్‌లోని "RAMBHA-LP" పేలోడ్ పంపిన డేటా శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. అక్కడ ప్లాస్మా సాంద్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్ మూన్ మిషన్లకు, అక్కడ మానవ కాలనీలను ఏర్పాటు చేయాలనే కలకు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
శివశక్తి పాయింట్ వద్ద ప్లాస్మా స్ట్రోమ్!: చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో, ఆగస్టు 23, 2023న విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం విదితమే. ఆ ప్రదేశానికి అధికారికంగా "శివశక్తి పాయింట్" అని పేరు పెట్టారు. అదే ప్రదేశంలో ల్యాండర్‌లోని RAMBHA-LP పరికరం మొదటిసారిగా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా ఇన్-సిటు పరిశీలనలను నిర్వహించింది. ఈ డేటా క్యూబిక్ సెంటీమీటర్‌కు 380 నుంచి 600 వరకు ఎలక్ట్రాన్ల ఎలక్ట్రాన్ సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంఖ్య రిమోట్ సెన్సింగ్ ద్వారా గతంలో అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ల ఉష్ణోగ్రత. వాటి "కైనటిక్ ఉష్ణోగ్రత" 3,000 నుంచి 8,000 కెల్విన్ మధ్య ఉంటుందని లెక్కించారు. దీనర్థం మనం ఇప్పటి వరకూ అనుకుంటున్నట్లుగా చంద్రుని ఉపరితలంపై ఉన్న వాతావరణం ప్రశాంతంగా లేదు, బదులుగా అక్కడ అపారమైన శక్తి, కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అసలు ప్లాస్మా అంటే? ఇది ఎందుకింత ప్రత్యేకం?: భౌతికశాస్త్రంలో ఘన, ద్రవ, వాయువుల తర్వాత నాలుగవ స్థితిని "ప్లాస్మా"గా పిలుస్తారు. ఇది విద్యుత్ వాహకాలుగా పనిచేసే ఛార్జ్డ్ కణాలు, అయాన్లు, స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల మిశ్రమం. చంద్రునిపై ఉన్న ఈ ప్లాస్మా ప్రధానంగా సౌర గాలి (సూర్యుడి నుంచి వచ్చే ఛార్జ్డ్ కణాలు), ఫొటోఎలెక్ట్రిక్ ప్రభావం ద్వారా ఏర్పడుతుంది. సూర్యకాంతి చంద్రుని నేలలోని అణువులను తాకినప్పుడు అది ఎలక్ట్రాన్లను బయటకు పంపుతుంది. ఇది బలహీనమైన, కానీ చురుకైన అయానోస్పియర్‌ను సృష్టిస్తుంది.
సూర్యుడు, భూమి మధ్య ప్రత్యేకమైన సంబంధం: ఇస్రో అధ్యయనంలో వెల్లడైన మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రునిపై ఈ ప్లాస్మా వాతావరణం మారుతూ ఉంటుంది.
పగటిపూట చంద్రుడు: చంద్రుడు సూర్యుని వైపు ఉన్నప్పుడు, అక్కడి ప్లాస్మా పూర్తిగా సౌర గాలి ప్రభావంలో ఉంటుంది.
మాగ్నెటోటైల్: చంద్రుడు తిరుగుతూ మాగ్నెటోటైల్ (భూమి అయస్కాంత క్షేత్రం వెనుక భాగం) గుండా వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం మారుతుంది. అప్పుడు సూర్యుడి నుంచి కాకుండా భూమి నుంచి వచ్చే కణాలు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తాయి.
నీరు, వాయువు సూచన: ఇస్రో మూన్ అయానోస్పియర్ నమూనా ప్రకారం, ఈ ఆవేశపూరిత పొరలో ఎలక్ట్రాన్లు మాత్రమే కాకుండా కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి వంటి వాయువుల పరమాణు అయాన్లు కూడా ఉండవచ్చు. ఇది నిజమైతే చంద్రుని ఉపరితలం కింద లేదా సమీపంలో నీరు, ఇతర వనరులు ఉండే అవకాశం ఉంది.
భవిష్యత్ వ్యోమగాములకు ఈ ఆవిష్కరణ ఎందుకు కీలకం?: ఈ ఆవిష్కరణ సైన్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది భవిష్యత్ మానవ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
కమ్యూనికేషన్: ప్లాస్మా రేడియో తరంగాలతో జోక్యం చేసుకోగలదు. శాస్త్రవేత్తలు ఇప్పుడు మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేయగలుగుతారు.
భద్రత: ఛార్జ్డ్ కణాలు స్పేస్ సూట్లు, పరికరాలను దెబ్బతీస్తాయి. ఈ డేటా మెరుగైన భద్రతా కవచాల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.
వనరులు: నీటి ఆవిరి అయాన్ల ఉనికి నీటి అన్వేషణలో సహాయపడుతుంది.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసిన ఈ 'RAMBHA-LP' ఇప్పటివరకు ఏ దేశం సాధించలేని ఘనతను సాధించింది.

