ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ఆల్రెడీ సేల్‌లో ఉందా? 'Caviar' వెబ్‌సైట్‌లో బుకింగ్స్ షురూ!
యాపిల్ అధికారిక ప్రకటనకు ముందే ఐఫోన్ 18 ప్రో, మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్, ఫీచర్లను రష్యన్ బ్రాండ్ 'కావియార్' లీక్ చేసింది. ఈ సమాచారం ఇప్పుడు టెక్ ప్రపంచంలో భారీ అలజడి సృష్టిస్తోంది.

Published : August 10, 2026 at 5:12 PM IST
Hyderabad: టెక్ దిగ్గజం యాపిల్ తమ తదుపరి ఐఫోన్ సిరీస్ లాంఛ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకముందే టెక్ ప్రపంచంలో భారీ అలజడి మొదలైంది. రష్యాకు చెందిన ప్రముఖ లగ్జరీ కస్టమైజేషన్ బ్రాండ్ 'కావియార్' (Caviar) యాపిల్ కంటే ముందే ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro)తో పాటు, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ (దీనికి ఐఫోన్ అల్ట్రా అని పేరు పెట్టనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి) మోడళ్ల డిజైన్, స్పెసిఫికేషన్లను తన వెబ్‌సైట్‌లో లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో 'ఐఫోన్ 18 ప్రో', 'ఐఫోన్ 18 ప్రో మాక్స్'తో పాటు యాపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీలను ముందే లైవ్ చేస్తోంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, యాపిల్ సంస్థ ఇప్పటివరకు ఈ ఐఫోన్ అల్ట్రా మోడల్‌ను కనీసం ప్రకటించను కూడా లేదు, కానీ కావియార్ మాత్రం ఇప్పటికే చాలా వివరాలను బయటపెట్టింది.

అంతేకాదు, యాపిల్ లాంఛ్ ఈవెంట్ వచ్చే సెప్టెంబర్ 9, 2026 న జరుగుతుందని కావియార్ గట్టిగా చెబుతోంది. యాపిల్ ఈ తేదీని ధృవీకరించనప్పటికీ, కంపెనీ పాత లాంఛ్ ప్యాటర్న్‌లను గమనిస్తే ఈ అంచనా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో ఎలాంటి మార్పులను చూడవచ్చు?: కావియార్ ప్రకారం, ఇప్పటికే ఉన్న సిల్వర్, గ్రే, లైట్ బ్లూ వంటి ఎంపికలతో పాటు, ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ కోసం కొత్త "డార్క్ చెర్రీ" రంగును పరిచయం చేయవచ్చు.
డిస్‌ప్లే పరిమాణాలలో పెద్దగా మార్పులు ఉండవు. అవి 6.3 అంగుళాలు, 6.9 అంగుళాలుగానే ఉంటాయి. కానీ డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గవచ్చు, ఎందుకంటే కొన్ని ఫేస్ ఐడి సెన్సార్లను డిస్‌ప్లే కిందనే పొందుపరచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
పనితీరు పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో TSMC 2nm ప్రాసెస్‌పై నిర్మించిన కొత్త A20 ప్రో చిప్‌ను అమర్చవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది దాని మునుపటి మోడళ్ల కంటే గణనీయంగా వేగవంతమైనదిగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే, వేరియబుల్ అపర్చర్‌తో కూడిన ప్రధాన కెమెరా అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్ కావచ్చు. దీనివల్ల గ్రూప్ ఫొటోలలో బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడిన వ్యక్తులు కూడా స్పష్టంగా కనిపిస్తారు.
అంతేకాకుండా, మునుపటి ఐఫోన్ మోడళ్లతో పోలిస్తే ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీ ఉంటుందని సర్టిఫికేషన్ డాక్యుమెంట్లు ఇప్పటికే ధృవీకరించాయి. కెమెరా కంట్రోల్ బటన్ పూర్తిగా టచ్-సెన్సిటివ్‌గా ఉండబోతోందనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. టెక్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ తొలి లుక్ ఇదే!:
కావియార్ ఈ భారీ లీక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన సర్‌ప్రైజ్ 'ఐఫోన్ అల్ట్రా'. దీనిని యాపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌గా ప్రచారం చేస్తున్నారు. కావియార్ ప్రకారం, ఇది దృఢమైన టైటానియం ఫ్రేమ్‌ను, లిక్విడ్-మెటల్ (అమోర్ఫస్ అలాయ్)తో ప్రత్యేకంగా తయారు చేసిన హింజ్ మెకానిజంను కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు 4.9 mm, ఫోల్డ్ చేసినప్పుడు దాదాపు 9 mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుందని సమాచారం.

ఈ ఐఫోన్ అల్ట్రాలో లోపలి వైపు ఉండే మెయిన్ డిస్‌ప్లే 7.8 అంగుళాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది 4:3 బుక్-స్టైల్ ఆస్పెక్ట్ రేషియోతో రానుంది. అలాగే ఫోన్ బయటి వైపు 5.3 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఈ రెండు స్క్రీన్‌లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు LTPO టెక్నాలజీ సపోర్ట్‌తో రానున్నాయి.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో యాపిల్ నెక్స్ట్ జనరేషన్ 'A20 ప్రో' చిప్‌సెట్‌తో పాటు ఏకంగా 12GB RAM ఇవ్వబోతున్నట్లు లీక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను డీప్ బ్లాక్, ప్యూర్ వైట్ కలర్ ఆప్షన్లలో లాంఛ్ చేసే అవకాశం ఉంది.

లగ్జరీ లిమిటెడ్ ఎడిషన్లు - వాటి ధరల వివరాలు:
ఈ పరికరాల ఫీచర్లను హైలైట్ చేయడంతో పాటు, కావియార్ సంస్థ ఎంపరర్, కింగ్, బ్లాక్ ప్రిన్స్, ఫారో, కాన్సుల్ అనే 5 లిమిటెడ్-ఎడిషన్ వెర్షన్‌లను పరిచయం చేసింది. ఈ మోడళ్లలో పైథాన్ లేదా మొసలి తోలు వంటి మెటీరియల్స్‌తో పాటు 24-క్యారెట్ బంగారు పూత లేదా బ్లాక్ PVD కోటింగ్‌ను ఉపయోగించనున్నారు. ఈ లగ్జరీ ఎడిషన్లలోని ప్రతి డిజైన్‌ను కేవలం 18 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్లు లీక్స్‌లో పేర్కొన్నారు.

వీటి ధరల విషయానికి వస్తే, ఐఫోన్ 18 ప్రో సిరీస్ లగ్జరీ ఎడిషన్ల ధర దాదాపు 10,060 డాలర్ల నుంచి 12,770 డాలర్ల (సుమారు రూ. 8.4 లక్షల నుంచి రూ. 10.7 లక్షల) వరకు ఉండనుంది. అలాగే ఫోల్డబుల్ ఐఫోన్ అయిన 'ఐఫోన్ అల్ట్రా' లగ్జరీ ఎడిషన్ ధర 13,840 డాలర్ల నుంచి 15,990 డాలర్ల (సుమారు రూ. 11.6 లక్షల నుంచి రూ. 13.4 లక్షల) వరకు ఉంటుందని అంచనా. అయితే, ఈ లిమిటెడ్ ఎడిషన్లలో విస్తృతమైన కస్టమైజేషన్ ఉన్నందున, వైర్‌లెస్ ఛార్జింగ్, Qi2 మ్యాగ్నెటిక్ యాక్సెసరీలు పనిచేయవని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది.
గమనిక: ఈ అప్‌కమింగ్ ఐఫోన్‌ల గురించి పైన పేర్కొన్న వివరాలన్నీ కేవలం కావియార్ కంపెనీ చేసిన వాదనలు మాత్రమే. యాపిల్ సంస్థ వీటిలో దేనినీ అధికారికంగా ధృవీకరించలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమాచారాన్ని కేవలం లీకులు లేదా అంచనాలుగా మాత్రమే భావించడం ఉత్తమం.

