4K రికార్డింగ్, ADAS ఫీచర్లతో బోట్ హైవ్ డాష్‌క్యామ్ సిరీస్- రూ. 2,499లకే!
బోట్ భారత మార్కెట్ కోసం తన కొత్త హైవ్ డాష్‌క్యామ్ సిరీస్‌ను ప్రారంభించింది. దీని ధర రూ. 2,499 నుంచి ప్రారభమవుతుంది.

Published : February 9, 2026 at 2:52 PM IST
Hyderabad: వేరబుల్ టెక్నాలజీ కంపెనీ బోట్ 4K రికార్డింగ్, ADAS ఫీచర్లతో భారత మార్కెట్లో తన కొత్త "హైవ్ డాష్‌క్యామ్" సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ ధర రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఆడియో, వేరబుల్ డివైజ్‌లను దాటి కారులో భద్రతా పరికరాల రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడాన్ని సూచిస్తోంది.
ప్రైవేట్ కార్ల యజమానులు, రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహన డ్రైవర్లనే లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ హైవ్ డాష్‌క్యామ్ సిరీస్‌లో మూడు మోడళ్లను తీసుకొచ్చింది. వీటిలో F1 మోడల్ ధరను రూ. 9,990, M1 మోడల్ ధరను రూ. 4,499, ఎంట్రీ లెవల్ E1 మోడల్ ధరను రూ. 2,499గా నిర్ణయించింది.
బోట్ హైవ్ డాష్‌క్యామ్ ఫీచర్లు: ఈ మూడు డాష్‌క్యామ్‌లు సోనీ స్టార్‌విస్ సెన్సార్‌లతో వస్తాయి. వీటిని తక్కువ-కాంతి, అధిక-గ్లేర్ డ్రైవింగ్ పరిస్థితులలో స్పష్టతను మెరుగుపరచడం కోసం రూపొందించారు. ఫ్లాగ్‌షిప్ హైవ్ డాష్‌క్యామ్ F1 4K ఫ్రంట్ కెమెరా, 1080p వెనుక కెమెరాతో డ్యూయల్-ఛానల్ రికార్డింగ్‌ను అందిస్తుంది. ఇది లేన్ డిపార్చర్ అండ్ ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ కోసం వాయిస్ అలర్ట్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), అంతర్నిర్మిత GPS, వాయిస్ కంట్రోల్, Wi-Fi యాప్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది.
బోట్ హైవ్ డాష్‌క్యామ్ M1 మోడల్ 140-డిగ్రీల వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ఇది 2K QHD రికార్డింగ్, GPS-ఆధారిత రూట్ అండ్ స్పీడ్ ట్రాకింగ్, ప్రమాదాలను గుర్తించడానికి G-సెన్సార్, 512GB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్‌ను అందిస్తుంది.
ఇక ఎంట్రీ-లెవల్ బోట్ హైవ్ డాష్‌క్యామ్ E1 మోడల్ విషయానికి వస్తే, ఇది 1,296p రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో లూప్ రికార్డింగ్ అండ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ రికార్డింగ్‌ను అందిస్తుంది.
బోట్ హైవ్ డాష్‌క్యామ్ లభ్యత: లభ్యత విషయానికి వస్తే, బోట్ హైవ్ డాష్‌క్యామ్ F1, M1, E1 మోడళ్లను బోట్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

