30 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు- Ask.com సర్వీసులు బంద్
Google శకానికి ముందు 'Ask Jeeves'గా ప్రసిద్ధి చెందిన "Ask.com" ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ దాదాపు 30 ఏళ్ల తర్వాత నిశ్శబ్దంగా తన ప్రస్థానాన్ని ముగించుకుంది.

Published : May 5, 2026 at 12:01 PM IST
Hyderabad: ప్రశ్నల ఆధారిత శోధనలను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఇంటర్నెట్ తొలి శోధన వేదికలలో ఒకటైన Ask.com తన కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సర్వీస్ మే 1, 2026 నుంచి పనిచేయడం ఆగిపోయింది.
ఈ మూసివేతతో, యూజర్ల ప్రశ్నలకు సహజ భాషలో సమాధానాలు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ఒక ప్లాట్‌ఫామ్‌కు ముగింపు పలికినట్లయింది. ఈ మోడల్ ఆధునిక కన్వర్సేషనల్ సెర్చ్ టూల్స్‌కంటే ముందే వచ్చింది. అంటే ఆధునిక AI చాట్‌బాట్‌లు రాకముందే, ప్రశ్నలకు సహజ భాషలో జవాబులు ఇస్తూ ఒకప్పుడు సంచలనం సృష్టించిన ప్లాట్‌ఫామ్ Ask.com ఇప్పుడు శాశ్వతంగా మూతపడింది.
నిలిపివేతకు కారణం?: Ask.comను మూసివేయాలన్న నిర్ణయాన్ని దాని మాతృసంస్థ IAC తీసుకుంది. విస్తృత వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెర్చ్ బిజినెస్ నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ తెలిపింది. రెండు దశాబ్దాలకు పైగా సెర్చ్ విభాగంలో పనిచేసిన కంపెనీ, ప్రస్తుతం ఈ రంగంలో మారుతున్న పోటీ, టెక్నాలజీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సూచించింది.
"IAC తన దృష్టిని మరింత పదును పెడుతున్నందున, Ask.comతో సహా మా సెర్చ్ వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం. 25 సంవత్సరాలుగా ప్రపంచ ప్రశ్నలకు సమాధానమిచ్చిన Ask.com సేవలు మే 1, 2026 నుంచి అధికారికంగా నిలిచిపోయాయి" అని పేర్కొంటూ కంపెనీ తన హోమ్‌పేజీలోని ఒక సందేశం ద్వారా ఈ నిలిపివేతను ధృవీకరించింది.
ప్రశ్నలే దాని బలం: ప్రారంభ ఇంటర్నెట్ యుగంలో, కీవర్డ్‌ల ఆధారిత శోధనలపై ఆధారపడకుండా, పూర్తి ప్రశ్నలను టైప్ చేయమంటూ వినియోగదారులను ప్రోత్సహించడం ద్వారా Ask.com తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అంటే గూగుల్ వంటివి కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తున్న రోజుల్లో, Ask.com "మీ ప్రశ్న ఏంటి?" అని అడిగేది. పూర్తి వాక్యాల్లో ప్రశ్నలు టైప్ చేస్తే, సహజ భాషలోనే జవాబులు ఇచ్చేది. దీనివల్ల ఇది మరింత సంభాషణాత్మకంగా అనిపించేది. ఆ విధానం ఇప్పుడు ప్రశ్నలకు నేరుగా సమాధానమిచ్చే ఆధునిక AI చాట్‌బాట్‌లను పోలి ఉంటుంది. ఇంటర్నెట్‌లో కన్వర్సేషనల్ సెర్చ్‌కి అదే తొలి అడుగు.
30 ఏళ్ల ప్రస్థానం: Google రాకముందే, 1997లో గారెట్ గ్రూనర్, డేవిడ్ వార్తెన్ ఆస్క్.కమ్ (Ask.com)ను స్థాపించారు. దీనిని మొదట AskJeeves.com పేరుతో ప్రారంభించారు. ఇతర సెర్చ్ ఇంజిన్‌ల మాదిరిగా కాకుండా, వినియోగదారులు సహజ భాషలో పూర్తి ప్రశ్నలను అడిగేలా (ఉదాహరణకు: "ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది?") దీనిని రూపొందించారు. "ప్రశ్న అడగండి" అనే కొత్త కాన్సెప్ట్, యూజర్ ఫ్రెండ్లీ స్టైల్‌తో ఇది వెంటనే హిట్ అయ్యింది. ఆ తర్వాత 2006లో 'జీవ్స్' అనే పేరును తొలగించి అధికారికంగా ఆస్క్.కమ్ (Ask.com)గా మార్చారు.

