యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్- టిమ్ కుక్ స్థానంలో బాధ్యతలు స్వీకరణ!
యాపిల్ కొత్త బాస్ ‘జాన్ టెర్నస్- 4.6 ట్రిలియన్ల యాపిల్ సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తారో?

Published : September 1, 2026 at 5:53 PM IST
Apple New CEO :ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. టిమ్ కుక్ 15 ఏళ్ల సుదీర్ఘ సారథ్యంలో ఐఫోన్‌కు వచ్చిన విపరీతమైన ప్రజాదరణ కారణంగా యాపిల్ కంపెనీ విలువ ఏకంగా 4.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ కీలక సమయంలో ఆ దిగ్గజ కంపెనీ సారథ్య బాధ్యతలు జాన్ టెర్నస్ చేపట్టడం విశేషం.
2007లో స్టీవ్ జాబ్స్ మొదటి ఐఫోన్‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత టెక్ పరిశ్రమలో కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు అతిపెద్ద విప్లవాన్ని తీసుకువచ్చింది. అయితే దాదాపు రెండేళ్ల క్రితం ఏఐ ఫీచర్లు తీసుకువస్తామని యాపిల్ వాగ్దానం చేసింది. కానీ ఆ ఫీచర్లు సకాలంలో తీసుకురాలేక ఇబ్బంది పడిన యాపిల్, ప్రారంభంలో ఏఐ రేసులో వెనుకబడింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తీసుకురావడంలో కాస్త పురోగతి సాధించింది. ఇందులో భాగంగా తన ప్రత్యర్థులతో పోటీ పడేందుకు వీలుగా, యూజర్ల ప్రైవసీకి, రోజువారి వినియోగానికి ప్రధాన్యత ఇస్తూ 'సిరి' అసిస్టెంట్‌ను అప్‌గ్రేడ్ చేసింది.
టెర్నస్ ముందు ఎన్నో సవాళ్లు!
యాపిల్ కొత్త సీఈఓ అయిన జాన్ టెర్నస్ వాస్తవానికి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవారు. కానీ ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపు కూడా చూడాల్సి ఉంటుంది. ఇందులో అనేక సరికొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏఐ పోటీలో యాపిల్‌ను ముందంజలో ఉంచడంతోపాటు, సప్లై చైన్ సమస్యలను పరిష్కరించాలి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులతో సంబంధాలను జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సఖ్యంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే యాపిల్ సీఈఓగా పనిచేసేందుకు, కీలక వ్యక్తులతో సంబంధాలను పెంపొందించుకునే సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం.
ఆసియా దేశాల్లో యాపిల్‌కు భారీ స్థాయిలో మాన్యుఫ్యాక్చురింగ్ సప్లై చైన్ నెట్వర్క్ ఉంది. అందుకే టిమ్ కుక్ ట్రంప్‌తో ఉన్న సంబంధాలను జాగ్రత్తగా వాడుకున్నారు. ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ వాణిజ్య యుద్ధం (టారిఫ్ వార్) చేసినప్పటికీ, తమ యాపిల్ కంపెనీని గట్టెక్కించడంలో టిమ్ కుక్ సఫలీకృతమయ్యారు. ఇప్పుడు టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలోకి మారారు. కనుక జాన్ టెర్నస్‌కు సీఈఓ పగ్గాలు అప్పగించినప్పటికీ, ట్రంప్‌తో కంపెనీకి ఉన్న మంచి సంబంధాలను అలానే కొనసాగేలా ఆయనను గైడ్ చేసే అవకాశం ఉంది.
జాన్ టెర్నస్ ప్రొఫైల్
జాన్ టెర్నస్ 2001లో యాపిల్ కంపెనీలో చేరారు. అక్కడ ఆయన హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు టిమ్ కుక్ సారథ్యంలోనే టర్నెస్ యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ విజన్ ప్రో లాంటి ప్రతిష్ఠాత్మక ఉత్పత్తుల తయారీలో తనదైన పాత్రను పోషించారు. అలాగే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివద్ధిలోనూ ఆయన హస్తం ఉంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయంలో వచ్చే వారం జరగనున్న సరికొత్త ఐఫోన్ లాంఛ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వ్యవహరించనున్నారు. అంటే సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించనున్నారని తెలుస్తోంది.
ప్రేమ అలానే ఉంటుంది!
మరోవైపు సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న టిమ్ కుక్ యాపిల్ కంపెనీపై తన ప్రేమను వెలిబుచ్చారు. "రేపటి నుంచి నా పదవి మారుతుంది కానీ ఈ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచిన వారందరికీ నా ధన్యవాదాలు. దీని తర్వాత నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అని ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. వాస్తవానికి టిమ్ కుక్ యాపిల్‌ను వదలడం లేదు. ఆయన యాపిల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో తన సహకారం అందించనున్నారు.
అమెరికా కీలక విభాగాలపై చైనా హాకర్ల పంజా: రంగంలోకి దిగి చెక్ పెట్టిన FBI, జస్టిస్ డిపార్ట్‌మెంట్!
'తొలి డార్క్ స్కై' విలేజ్‌గా ఉధమల్- 'స్టార్స్' చూసేందుకు డెస్టినేషన్- 22ఏళ్ల యువకుడి ఆలోచనకు ఫలితం!

