ETV Bharat / technology

ఐఫోన్ 20వ వార్షికోత్సవం: సరికొత్త లుక్‌లో రానున్న 'ఐఫోన్ ప్రో' మోడల్స్!

ఐఫోన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2027లో విడుదల చేయబోయే 'ఐఫోన్ ప్రో' మోడల్స్‌లో సరికొత్త గ్లాస్-సెంట్రిక్ డిజైన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ మార్పు ప్రీమియం మార్కెట్లో విప్లవాత్మక పరిణామాలకు దారితీయనుంది.

In picture - Apple iPhone 17 Pro models
In picture - Apple iPhone 17 Pro models (Image Credit: Apple)
author img

By ETV Bharat Tech Team

Published : August 11, 2026 at 8:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: యాపిల్ సంస్థ ఐఫోన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2027లో విడుదల చేయబోయే 'ఐఫోన్ ప్రో' మోడల్స్‌లో భారీ డిజైన్ మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ కథనం ప్రకారం, ఈ ఫోన్లు పూర్తిగా గ్లాస్ (గాజు) ఆధారిత డిజైన్‌తో రానున్నాయి. వచ్చే ఏడాది రాబోయే 'ఐఫోన్ ప్రో', 'ప్రో మాక్స్' మోడల్స్‌లో ఈ మార్పులు ప్రముఖంగా కనిపించనున్నాయని, వీటికి అంతర్గతంగా 'V73', 'V74' అనే కోడ్‌నేమ్‌లు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

గుర్మన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక వార్షికోత్సవ 'ప్రో' మోడల్స్ ముందు, వెనుక భాగాలలో గ్లాస్ ప్యానెల్స్ ఉంటాయి. ఇవి సైడ్స్​ నుంచి మిడిల్ ఫ్రేమ్‌లోకి వంగి (కర్వ్‌డ్) ఉంటాయి. ఇదివరకు ఐఫోన్ 6 నుంచి ఐఫోన్ 11 సిరీస్ వరకు కనిపించిన కర్వ్‌డ్ డిజైన్ శైలి మళ్లీ తిరిగి రాబోతోందని ఇది సూచిస్తోంది. ఈ రెండు గ్లాస్ ప్యానెల్స్‌ను వేరు చేస్తూ వాటి మధ్యలో ఒక మెటల్ బ్యాండ్ ఉండొచ్చని ఆయన హైలైట్ చేశారు.

యాపిల్ డిజైన్ స్టూడియో మొదట మెటల్ కంటే ఎక్కువగా గ్లాస్‌ను ఉపయోగించి, మరింత ఆకర్షణీయమైన 20వ వార్షికోత్సవ ఐఫోన్ మోడల్‌ను రూపొందించాలని భావించిందట. అయితే, తయారీలో రెండు గ్లాస్ ప్యానెల్స్‌ను ఒకదానితో ఒకటి అనుసంధానించడంలో (కనెక్ట్ చేయడంలో) ఎదురైన ఇబ్బందుల వల్ల, భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతుందనే కారణంతో ఆ ప్లాన్‌ను రద్దు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది.

ఐఫోన్ 20 ప్రో మోడళ్ల కోసం కొత్త సైజ్ డిస్‌ప్లేలు:

మరోవైపు, చైనాకు చెందిన టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' నివేదిక ప్రకారం, యాపిల్ సంస్థ తన 20వ వార్షికోత్సవ ఐఫోన్ లైనప్ కోసం రెండు కొత్త డిస్‌ప్లే సైజ్ ఆప్షన్లను పరీక్షిస్తోందని తెలుస్తోంది. ఇందులో ఒక ప్యానెల్ సుమారు 6.4 అంగుళాలు, మరొకటి 7 అంగుళాల పరిమాణంలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదటి డిస్‌ప్లేను అప్​కమింగ్ 'ఐఫోన్ 20 ప్రో'లో ఉపయోగించే అవకాశం ఉండగా, పెద్దదైన రెండో స్క్రీన్‌ను 'ఐఫోన్ 20 ప్రో మాక్స్' కోసం ప్రత్యేకించవచ్చని భావిస్తున్నారు.

అయితే, యాపిల్ సంస్థ ఈ డిజైన్ లేదా డిస్‌ప్లే వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే ఏడాది జరగనున్న విడుదల కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున, ప్రణాళికలు ఇంకా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నివేదిక నిజమైతే, 2020లో 'ఐఫోన్ 12'తో వచ్చిన ఫ్లాట్-ఎడ్జ్డ్ (చదునైన అంచులు కలిగిన) డిజైన్ మార్పు తర్వాత, ఐఫోన్ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన విజువల్ మార్పులలో ఒకటిగా నిలుస్తుంది.

యాపిల్ సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా మార్చడంలో ఐఫోన్ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో, గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి యాపిల్‌కు ఈ వార్షికోత్సవ మోడల్ లాంఛ్ అత్యంత కీలకం కానుంది.

ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్, గూగుల్ వంటి ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో, యాపిల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని, సరికొత్త డిజైన్ బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ 20వ వార్షికోత్సవ మోడల్ ఒక ఫ్లాగ్‌షిప్ మూమెంట్‌గా ఉపయోగపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.