ETV Bharat / technology

మార్కెట్లోకి యాపిల్ కొత్త 'మ్యాక్ మినీ', 'మ్యాక్ స్టూడియో'- ధర, లభ్యత వివరాలు ఇవే!

యాపిల్ M6, M5 అల్ట్రా చిప్‌లతో కూడిన కొత్త "మ్యాక్ స్టూడియో", "మ్యాక్ మినీ" డెస్క్‌టాప్‌లను విడుదల చేసింది.

2026 యాపిల్ మ్యాక్ మినీ
2026 యాపిల్ మ్యాక్ మినీ (ఫొటో క్రెడిట్: యాపిల్)
author img

By ETV Bharat Tech Team

Published : August 26, 2026 at 5:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త డెస్క్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యాధునిక చిప్‌సెట్లతో "మ్యాక్ మినీ" (Mac mini), "మ్యాక్ స్టూడియో" (Mac Studio)లను అధికారికంగా లాంఛ్ చేసింది. మెరుగైన వేగం, అద్భుతమైన గ్రాఫిక్స్, శక్తివంతమైన ఆన్-డివైస్ AI సామర్థ్యాలే లక్ష్యంగా వీటిని రూపొందించినట్లు ప్రకటించింది.

విద్యార్థులు, డెవలపర్ల కోసం 'మ్యాక్ మినీ': సాధారణ యూజర్లు, విద్యార్థులు, డెవలపర్లను టార్గెట్ చేస్తూ ఈ 'మ్యాక్ మినీ'ని తీసుకొచ్చింది. ఇందులో సరికొత్త M6 చిప్ ఉంది. తక్కువ ధరలో, తక్కువ స్థలంలో కాంపాక్ట్ డెస్క్‌టాప్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ పేర్కొంది.

ప్రొఫెషనల్స్ కోసం 'మ్యాక్ స్టూడియో': భారీ గ్రాఫిక్స్ పనులు నిర్వహించే ప్రొఫెషనల్స్ కోసం యాపిల్ ఈ 'మ్యాక్ స్టూడియో'ను తీసుకొచ్చింది. ఇది 'M5 మ్యాక్స్', సరికొత్త 'M5 అల్ట్రా' చిప్‌లతో పనిచేస్తుంది. 'M5 అల్ట్రా' యాపిల్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన చిప్ అని సంస్థ తెలిపింది. హై-ఎండ్ వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్, భారీ AI మోడల్స్‌ను నేరుగా రన్ చేసే నిపుణుల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

2026 యాపిల్ మ్యాక్ స్టూడియో
2026 యాపిల్ మ్యాక్ స్టూడియో (ఫొటో క్రెడిట్: యాపిల్)

2026 మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో: ధర & లభ్యత

భారతదేశంలో "M6 చిప్‌"తో వచ్చే 2026 మ్యాక్ మినీ (16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్) ధర రూ. 99,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే "M5 ప్రో" వెర్షన్ ధర రూ. 2,09,900 నుంచి మొదలవుతుంది.

2026 మ్యాక్ స్టూడియో విషయానికొస్తే, "M5 మ్యాక్స్" వెర్షన్ ధర రూ. 2,79,900 నుంచి ప్రారంభం కాగా, కొత్త "M5 అల్ట్రా" మోడల్ ధర రూ. 6,29,900 నుంచి మొదలవుతుంది.

ఈ కొత్త డివైజ్​లు యాపిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ ఆర్డర్​కు అందుబాటులో ఉన్నాయి. వీటి షిప్పింగ్ సెప్టెంబర్ 22, 2026 నుంచి ప్రారంభమవుతుందని అంచనా. వీటిలో యాపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అయిన 'macOS 27' కూడా ఉంటుంది. ఇది రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

2026 మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో: కొత్త మార్పులు?

2026 మ్యాక్ మినీలో ఉపయోగించిన 'M6' చిప్స్ యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా 2-నానోమీటర్ (2nm) టెక్నాలజీతో రూపొందించారు. దీనివల్ల ఇవి మరింత చిన్నవిగా, అత్యంత సమర్థవంతంగా (efficient) పనిచేస్తాయి. ఇందులో 12-కోర్ ప్రాసెసర్, 12-కోర్ గ్రాఫిక్స్ చిప్, సరికొత్త డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ న్యూరల్ ఇంజిన్ పాత చిప్‌లతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాసెసింగ్ వేగాన్ని రెండింతలు పెంచుతుందని యాపిల్ పేర్కొంది.

కనెక్టివిటీ పరంగా, కొత్త మ్యాక్ మినీలో Wi-Fi 7, Bluetooth 6, వేగవంతమైన ఎదర్‌నెట్ (Ethernet) ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు. అయితే, ఇందులో సరికొత్త థండర్‌బోల్ట్ 5కి బదులుగా పాత థండర్‌బోల్ట్ 4 పోర్టులనే కొనసాగించారు.

2026 మ్యాక్ స్టూడియోలో వచ్చిన ప్రధాన మార్పు 'M5 అల్ట్రా' చిప్‌సెట్. యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా, ఇందులో సరికొత్త 'క్వాడ్-డై ఆర్కిటెక్చర్' (quad-die architecture) సాంకేతికతను ఉపయోగించారు. ఇది యాపిల్ 'అల్ట్రాఫ్యూజన్' (UltraFusion) టెక్నాలజీ ద్వారా రెండు 'M5 మ్యాక్స్' (M5 Max) చిప్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది.

దీనివల్ల ఈ డెస్క్‌టాప్ గరిష్ఠంగా 36 ప్రొఫెసర్ కోర్లు, 80 గ్రాఫిక్స్ కోర్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. అలాగే దీని మెమరీ బ్యాండ్‌విడ్త్ సెకనుకు 1.2 TBకి పెరిగింది. ఇది పాత మోడల్ కంటే 50 శాతం ఎక్కువ. ఈ M5 అల్ట్రా చిప్‌లో గరిష్ఠంగా 512GB వరకు మెమరీ (RAM) సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. దీనివల్ల క్లౌడ్ (Cloud) సహాయం లేకుండానే, అత్యంత భారీ AI మోడల్స్‌ను నేరుగా ఈ మెషీన్‌పైనే రన్ చేయవచ్చు.