ETV Bharat / technology

నొయిడాలో యాపిల్ కొత్త షోరూమ్ ప్రారంభం- ఈ స్టోర్ ప్రత్యేకతలు ఏంటంటే?

భారత్​లో యాపిల్ జోరు- ఐదవ రిటైల్ స్టోర్ ప్రారంభం

Apple Fifth India Retail Store Opens in Noida
Apple Fifth India Retail Store Opens in Noida (Photo Credit- Apple)
author img

By ETV Bharat Tech Team

Published : December 11, 2025 at 1:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో తన కొత్త రిటైల్ షోరూమ్​ను నొయిడా సెక్టార్ 18లోని DLF మాల్‌లో ప్రారంభించింది. ఈ స్టోర్ దిల్లీ-NCR ప్రాంతంలో కంపెనీకి రెండవ స్టోర్. ఇంకా ఇది భారతదేశంలో యాపిల్ ఐదవ స్టోర్, ఈ ఏడాదిలో (2025) ప్రారంభించిన మూడవ స్టోర్. కంపెనీ ఇటీవల ప్రారంభించిన "హెబ్బాల్", "కోరెగావ్ పార్క్" ఎక్స్​క్లూజివ్ రిటైల్ స్టోర్ల మాదిరిగానే దీన్ని కూడా మన జాతీయ పక్షి నెమలి పింఛాల కళాత్మక థీమ్​తో తీర్చిదిద్దింది. దీని వాల్​ పేపర్లను రంగురంగుల నెమలి పింఛాలతో ఆకర్షణీయమైన లుక్​లో డిజైన్ చేసింది.

యాపిల్ నోయిడా కీలకాంశాలు: యాపిల్ నోయిడా అనే ఈ కొత్త షోరూమ్​లో 80 మందికి పైగా టీమ్​ మెంబర్లు ఉంటారు. ఈ బృందం కస్టమర్లకు తాజా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో సహాయం అందిస్తుంది. అంటే ఈ కొత్త రిటైల్​ స్టోర్​ను సందర్శించే కస్టమర్‌లు ఐఫోన్ 17 సిరీస్‌తో సహా కొత్త యాపిల్ ఉత్పత్తి శ్రేణిని అన్వేషించడంతో పాటు కొత్త ఫీచర్ల గురించీ అడిగి తెలుసుకోవచ్చు. కస్టమర్లు ఈ షోరూమ్​ ద్వారా లేటెస్ట్ ఐఫోన్ సిరీస్, యాపిల్ వాచ్ అల్ట్రా 3, యాపిల్ వాచ్ సిరీస్ 11 మోడల్‌లు, M5 చిప్‌తో నడిచే సరికొత్త ఐప్యాడ్ ప్రో, 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు.

టుడే ఎట్ యాపిల్: ఈ కొత్త రిటైల్ షోరూమ్​లో కంపెనీ 'టుడే ఎట్ యాపిల్' సెషన్‌లను కూడా నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్నవారు యాపిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ సెషన్​ను బుక్ చేసుకుని హాజరు కావచ్చు. తద్వారా యాపిల్ ఉత్పత్తులతో పాటు ఫొటోగ్రఫీ, ఆర్ట్, మ్యూజిక్, కోడింగ్ వంటి అంశాలలో నైపుణ్యాలను పెంచుకోవచ్చు.

కంపెనీ ఇటీవలే నవంబర్ 28వ తేదీన ఈ ఐదవ స్టోర్ బారికేడింగ్​ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యాపిల్ ఓ ప్రకటనలో దేశంలో కొనసాగుతున్న యాపిల్ రిటైల్ విస్తరణలో ఈ ప్రారంభం మరో మైలురాయిని సూచిస్తుందని తెలిపింది. ఇది నోయిడాలోని వినియోగదారులకు యాపిల్ ఉత్పత్తులను అన్వేషించడానికి, కొనుగోలు చేయడానికి, యాపిల్ అసాధారణ సేవను వ్యక్తిగతంగా అనుభవించడానికి ఒక కొత్త మార్గాన్ని అందిస్తుందని పేర్కొంది.

ఇప్పుడు ఈ రిటైల్ స్టోర్ ప్రారంభంతో భారత్​లో యాపిల్ స్టోర్​ల సంఖ్య ఐదుకు చేరుకుంది. వాటిలో మొదటి షోరూమ్​ ముంబయిలో "యాపిల్ BKC". దీన్ని ఏప్రిల్ 18, 2023లో ప్రారంభించారు. ఆ తర్వాత కంపెనీ రెండు రోజుల్లోనే దిల్లీలో "యాపిల్ సాకేత్" పేరుతో మరో షోరూమ్​ను ప్రారంభించింది.

ఈ రెండు షోరూమ్​లకు లభించిన ఆదరణ దృష్ట్యా ఇటీవలే మరో రెండు షోరూమ్​లను ఒకే వారంలో ప్రారంభించింది. వాటిలో మూడవది "యాపిల్ హెబ్బాల్" స్టోర్‌. సెప్టెంబర్ 2, 2025న బెంగళూరులోని హెబ్బాల్‌లోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ప్రారంభించిన ఈ స్టోర్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి. ఆ తర్వాత రెండు రోజుల్లో మహారాష్ట్రలోని పూణేలోని కోపా మాల్ కోరెగావ్ పార్క్‌లో నాలుగో రిటైల్ స్టోర్​ను ప్రారంభించింది.