ఐరోపా చట్టాల ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ AI టెక్స్ట్‌కు ఇన్విజిబుల్ వాటర్‌మార్క్
యూరోపియన్ నిబంధనలకు లోబడి, క్లాడ్ ఏఐ మోడల్స్ రూపొందించే టెక్స్ట్‌కు కంటికి కనిపించని (Invisible, Machine-Readable Watermark) వాటర్‌మార్క్‌లను జోడించనున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా స్పష్టం చేసింది.

Published : August 12, 2026 at 12:50 PM IST
Hyderabad: ఐరోపా సమాఖ్య (EU) తీసుకొచ్చిన కఠినమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిబంధనల (EU AI Act) ప్రభావంతో ప్రముఖ AI సంస్థ ఆంత్రోపిక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లాడ్ AI మోడల్స్ జనరేట్ చేసే టెక్స్ట్‌కు కంటికి కనిపించని (Invisible, Machine-Readable Watermark) సాంకేతికతను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇన్విజిబుల్ వాటర్‌మార్క్ కేవలం క్లాడ్ చాట్‌బాట్‌కే పరిమితం కాకుండా, డెవలపర్ ప్లాట్‌ఫారమ్ (Claude Platform API), క్లాడ్ కోడ్, క్లాడ్ కోవర్క్, క్లాడ్ ట్యాగ్ వంటి అన్ని అధికారిక ఉత్పత్తుల అవుట్‌పుట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా వర్తింపజేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
"AI ద్వారా కంటెంట్ రూపొందించడం సర్వసాధారణం అవుతున్న తరుణంలో, ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై అధిక పారదర్శకత, సంకేతాలు ఉండటం చాలా అవసరం. ఇది ప్రజలు తాము చదివే సమాచారం విశ్వసనీయతను, మూలాలను గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ పారదర్శకతను పెంపొందించడానికి, మా చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి, క్లాడ్ జనరేట్ చేసే కంటెంట్‌లో 'మెషిన్-రీడబుల్' (కంప్యూటర్లు గుర్తించగలిగే) మార్కులను చేర్చడానికి ఆంత్రోపిక్ కృషి చేస్తోంది" అని EU AI యాక్ట్‌లోని ట్రాన్స్‌పరెన్సీ కోడ్ కింద తమ నిబద్ధతలను హైలైట్ చేస్తూ ఆంత్రోపిక్ ఒక సపోర్ట్ పేజీలో పేర్కొంది.
ఆగస్టు 2, 2026 లేదా ఆ తర్వాత EUలో ప్రారంభించిన క్లాడ్ మోడల్స్ అన్నీ ఈ మెషిన్-రీడబుల్ మార్కింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ సాంకేతికత ద్వారా ఏఐ సృష్టించే టెక్స్ట్‌లోనే కంటికి కనిపించకుండా ఈ వాటర్‌మార్క్‌లు కలిసిపోవడంతో పాటు, ఆ ఫైల్స్ ఎక్కడ తయారయ్యాయో తెలిపే డిజిటల్ సంతకంతో కూడిన వివరాలు (ప్రూవినెన్స్ మెటాడేటా) కూడా వాటిలోనే నిక్షిప్తమవుతాయి.
ఆగష్టు 2వ తేదీకి ముందు ప్రారంభించిన ఆంత్రోపిక్ మోడళ్లకు కూడా మార్కింగ్‌లను జోడించాలని చట్టం నిర్దేశిస్తోందని కంపెనీ ధృవీకరించింది. అయితే, పాత మోడల్స్‌లో ఈ సాంకేతికతను జోడించడానికి చట్టంలో కొంత గడువు (ట్రాన్సిషన్ పీరియడ్) ఇచ్చారని, ఆ సమయంలోగా వీటిలోనూ వాటర్‌మార్కింగ్ సపోర్ట్‌ను తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపింది.
దీనితో పాటు, క్లాడ్ మోడల్స్ సృష్టించే ఈ ఇన్విజిబుల్ వాటర్‌మార్క్‌లను, మెటాడేటా వివరాలను యూజర్లు లేదా ఇతర థర్డ్ పార్టీ సంస్థలు కూడా గుర్తించేలా (డిటెక్ట్ చేసేలా) ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆంత్రోపిక్ పేర్కొంది. దీని ద్వారా ఏదైనా టెక్స్ట్ లేదా ఫైల్‌లో క్లాడ్ వాటర్‌మార్క్ ఉందో లేదో ఎవరికి వారు తనిఖీ చేసుకోవచ్చు. ఈ వాటర్‌మార్క్‌లను గుర్తించే సాంకేతిక విధానానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సంస్థ తెలిపింది.
క్లాడ్ కంటెంట్ వాటర్‌మార్కింగ్ సిస్టమ్ పనిచేసే విధానం:
టెక్స్ట్‌లో పొందుపరిచిన వాటర్‌మార్క్‌లు: ఈ ఫీచర్‌కు మద్దతు ఇచ్చే క్లాడ్ మోడల్స్, తాము రూపొందించిన టెక్స్ట్‌లో నేరుగా కంటికి కనిపించని వాటర్‌మార్క్‌ను పొందుపరుస్తాయి. ఇది కంటికి కనిపించదు. అలాగే క్లాడ్ ఇచ్చే ప్రతిస్పందన (Response) అర్థాన్ని, నాణ్యతను లేదా చదవగలిగే సామర్థ్యాన్ని ఏమాత్రం మార్చదు అని కంపెనీ తెలిపింది.
ఈ వాటర్‌మార్క్ టెక్స్ట్‌లో ఒక భాగం కావడం వల్ల, దీనిని కాపీ చేసి వేరే ఎక్కడైనా పేస్ట్ చేసినప్పుడు కూడా ఇది టెక్స్ట్‌తో పాటే వెళ్తుంది. అంతేకాకుండా, వాటర్‌మార్క్ ఉన్న ఆ టెక్స్ట్‌ను కొద్దిగా మార్చినా (Edit చేసినా) కూడా ఇది అలాగే ఉండే అవకాశం ఉంది. దీనిని మోడల్ స్థాయిలోనే జోడించడం వల్ల, క్లాడ్‌కు సంబంధించిన ఏ ప్రొడక్ట్ ద్వారా టెక్స్ట్‌ను జనరేట్ చేసినా ఈ వాటర్‌మార్క్ అందులో ఉంటుంది.
డిజిటల్ సంతకంతో కూడిన ప్రొవెనెన్స్ మెటాడేటా: క్లాడ్ మోడల్స్ సృష్టించే SVG, PNG, JPG వంటి ఫైళ్లకు ఈ ఫీచర్ డిజిటల్ సంతకంతో కూడిన 'ప్రొవెనెన్స్ మెటాడేటా'ను జత చేస్తుంది. ఈ మెటాడేటా అనేది అంతర్జాతీయ ప్రమాణమైన 'కోయలిషన్ ఫర్ కంటెంట్ ప్రొవెనెన్స్ అండ్ అథెంటిసిటీ' (C2PA) అనే ఓపెన్ స్టాండర్డ్‌ను అనుసరిస్తుంది. ఏదైనా ఒక కంటెంట్ మూల వివరాలను (ఎక్కడ, ఎలా క్రియేట్ అయింది అనే హిస్టరీని) కచ్చితంగా రికార్డ్ చేయడానికి పరిశ్రమ అంతటా (Industry-wide) ఈ ప్రమాణాన్నే ప్రామాణికంగా ఉపయోగిస్తారని ఆంథ్రోపిక్ వివరించింది.

