2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ రివీల్- ఎలా ఉందో చూశారా?
టాటా మోటార్స్ తన కొత్త 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అధికారిక లాంఛ్‌కు ముందే, దాని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌తో సహా కీలకమైన డిజైన్ వివరాలను వెల్లడించింది.

Published : January 7, 2026 at 2:36 PM IST
Hyderabad: దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ జనవరి 13న తన మైక్రో SUV టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. అయితే అంతకుముందే కంపెనీ ఈ SUVని ఆవిష్కరించింది. 2021లో ప్రారంభించినప్పటి నుంచి ఇదే ఈ కాంపాక్ట్ SUVకి అతిపెద్ద అప్‌డేట్. ఈ కొత్త టాటా పంచ్.. పంచ్ EV ప్రేరేపిత ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌తో పాటు కొత్త ఫీచర్లు, బోనెట్ కింద కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
2026 టాటా పంచ్ ఎక్స్టీరియర్: ఈ కొత్త టాటా పంచ్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, దాని ముందు భాగం పంచ్ EVని పోలి ఉంటుంది. ఇది టాటా మిగిలిన మోడళ్ల మాదిరిగానే ICE, EV వెర్షన్‌లు రెండింటికీ క్లీన్ ఫ్యామిలీ లుక్‌ను ఇస్తుంది. నిలువుగా ఉండే ట్రాపెజోయిడల్ హెడ్‌ల్యాంప్ పాడ్‌లు టాటా పంచ్ EVలో ఉన్న వాటి మాదిరిగానే కన్పిస్తాయి.

అయితే ICE వెర్షన్ ఫ్రంట్ బంపర్‌పై పూర్తిగా నలుపు రంగు ఫినిషింగ్ ద్వారా విభిన్నంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో బాడీ-కలర్‌లో ఉంటుంది. ఈ కొత్త 2026 టాటా పంచ్ మధ్యలో కాంట్రాస్టింగ్ బ్లాక్ బ్యాండ్‌తో సవరించిన LED DRL సిగ్నేచర్‌ను కూడా కలిగి ఉంది. అయితే ఈ భాగం పంచ్ EVలో ప్రకాశవంతంగా ఉంటుంది.
సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే, మార్పులు కొత్త అల్లాయ్ వీల్స్‌కు మాత్రమే పరిమితం. కానీ వెనుక భాగంలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త కనెక్టెడ్ టెయిల్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంది. టెయిల్లైట్లకు కొత్త LED డిటెయిల్స్‌ను జోడించారు. కింది భాగంలో రీ- డిజైన్ చేసిన బంపర్ కూడా ఉంది. టాటా దీనిలో కొన్ని కొత్త రంగు ఎంపికలను కూడా పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.
2026 టాటా పంచ్ ఇంటీరియర్: ఈ కొత్త పంచ్ ఇంటీరియర్‌ను పరిశీలిస్తే, ఇది టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్ వంటి పెద్ద టాటా కార్ల మాదిరిగానే కనిపిస్తుంది. అతిపెద్ద అప్డేట్లలో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అప్డేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 10.25 అంగుళాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది మునుపటి పంచ్ టాప్ వేరియంట్‌లోని టచ్‌స్క్రీన్ సైజుకు సమానం.

ఇందులో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ కూడా ఉన్నాయి. ఇవి ఇతర టాటా కార్లలో కూడా కనిపిస్తాయి. టాటా పంచ్ కొత్త ట్రిమ్, అప్‌హోల్స్టరీ మెటీరియల్స్‌ను కూడా పొందుతుంది. ఈ కారులో కొత్త 360-డిగ్రీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.
2026 టాటా పంచ్ పవర్‌ట్రెయిన్: తన మొదటి ప్రధాన అప్‌డేట్‌లో భాగంగా, ఈ నయా టాటా పంచ్ కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ మైక్రో SUV టాటా నెక్సాన్‌లో ఉన్న 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అయితే దీని కచ్చితమైన స్పెసిఫికేషన్లు, గేర్‌బాక్స్ ఆప్షన్ల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ప్రస్తుతం మార్కెట్లో ఈ వాహనం 1.2-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అమ్ముడవుతోంది. ఇది 88 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌ల ఎంపికతో లభిస్తుంది. ఇది కాకుండా ఈ వాహనం పెట్రోల్+CNG వెర్షన్‌లో కూడా వస్తుంది. ఇది CNGపై 73 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.
2026 టాటా పంచ్ ధర (అంచనా): ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ ధర రూ. 5.50 లక్షల నుంచి రూ. 9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని, ఇది సుమారుగా రూ. 6 లక్షల నుంచి రూ. 9.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. లాంఛ్ అనంతరం ఈ కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కూడా హ్యుందాయ్ ఎక్స్‌టర్, సిట్రోయెన్ C3 వంటి కార్లతో తన పోటీని కొనసాగిస్తుంది.

