ETV Bharat / technology

KTM నుంచి సూపర్​స్పోర్ట్స్ బైక్!- ధర ఎంతంటే?

భారత మార్కెట్​లో "KTM RC 160" లాంఛ్- ధర, ఫీచర్లతో పాటు ఇంజిన్ వివరాలు ఇవే!

2026 KTM RC 160 Launched in India
2026 KTM RC 160 Launched in India (Photo Credit- KTM India)
author img

By ETV Bharat Tech Team

Published : January 9, 2026 at 1:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: KTM భారతదేశంలో తన ఫుల్లీ-ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ లైనప్‌లో ఒక కొత్త "RC 160"మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). ఈ మోటార్‌సైకిల్​ "RC 200", "RC 390" కంటే దిగువ స్థానంలో ఉంచారు. ఇది ఎంట్రీ-లెవల్ స్పోర్ట్‌బైక్ విభాగంలో KTM పరిధిని విస్తరిస్తుంది. ప్రస్తుతం మార్కెట్​లో అమ్మకానికి ఉన్న RC మోడళ్లలో ఇదే అత్యంత చిన్నది.

ఈ "KTM RC 160" చూసేందుకు పూర్తి స్థాయి సూపర్‌స్పోర్ట్ లాగా కనిపిస్తుంది. KTM దీనిలో తన పెద్ద RC మోడళ్ల నుంచి తీసుకున్న అగ్రెసివ్​ ఫెయిరింగ్ డిజైన్, షార్ప్ లైన్లు, ట్రాక్-ప్రేరేపిత నిష్పత్తులను అందించింది. క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, వెనుక భాగంలో అమర్చిన ఫుట్‌పెగ్‌లు, మెటల్ ఫ్యూయెల్ ట్యాంక్ దీనికి స్పోర్టి లుక్​తో పాటు పెద్ద బైక్ రూపాన్ని ఇస్తాయి.

ఈ మోటార్‌సైకిల్​ను ఇటీవలే విడుదల చేసిన "160 డ్యూక్" మాదిరిగానే అదే ట్రెల్లిస్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. సస్పెన్షన్ బాధ్యతలను 37 mm అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ నిర్వహిస్తాయి. అయితే బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో 320 mm ఫ్రంట్ డిస్క్, 230 mm రియర్ డిస్క్ ఉన్నాయి. ఈ సెటప్‌కు సూపర్‌మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS సపోర్ట్ లభిస్తుంది.

ఈ బైక్ 110-సెక్షన్ ముందు, 140-సెక్షన్ వెనుక టైర్ల కలయికతో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఇది సుపరిచితమైన 164.2 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్​తో వస్తుంది. దీనిని "160 డ్యూక్‌" నుంచి తీసుకున్నారు. ఈ మోటార్ 9,50 rpm వద్ద 18.73 bhp గరిష్ఠ శక్తిని, 7,500 rpm వద్ద 15.5 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ పవర్‌ట్రెయిన్‌ అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 118 కిలోమీటర్లు అని KTM పేర్కొంది. ఇది "RC 160"ని ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్ బైక్‌ల విభాగంలో పనితీరు-ఆధారిత ఎంపికగా నిలుపుతుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే, ఇటీవల TFT స్క్రీన్‌ను పొందిన "160 డ్యూక్​"కు భిన్నంగా ఇది ఆల్-LED లైటింగ్, LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.

RC 160 ప్రస్తుతం కేవలం ఒకే పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది. అది నలుపు రంగుపై తెలుపు, నారింజ గ్రాఫిక్స్. ఇది గతంలో లీకైన చిత్రాలలో కనిపించిన అదే కలర్ కాంబినేషన్. KTM తర్వాతి దశలో దీనికి మరిన్ని రంగులను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. భారత మార్కెట్‌లో ఈ కొత్త "RC 160" నేరుగా "యమహా R15 V4"తో పోటీపడుతుంది. దీని ధర రూ. 1.67 లక్షల నుంచి రూ. 1.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.