మార్కెట్లోకి 2026 ఏప్రిలియా 'RS 457', 'టుయోనో 457'- తగ్గింపు ధరలతో!
ఏప్రిలియా 2026 సంవత్సరానికి సవరించిన ధరలతో తన రెండు స్పోర్ట్స్ బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో ఏప్రిలియా RS 457, టుయోనో 457 ఉన్నాయి.

Published : February 10, 2026 at 11:37 AM IST
Hyderabad: ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌ల తయారీ సంస్థ ఏప్రిలియా 2026 సంవత్సరానికి సవరించిన ధరలతో తన రెండు స్పోర్ట్స్ బైక్‌లను ప్రవేశపెట్టింది. ఈ మోటార్‌సైకిళ్లలో "ఏప్రిలియా RS 457", "ఏప్రిలియా టుయోనో 457" ఉన్నాయి. గతేడాది వచ్చిన GST మార్పుల అనంతరం కంపెనీ ఈ రెండు మోడళ్ల ధరలను కొద్దిగా పెంచింది, కానీ ఇప్పుడు మళ్లీ ధరలను సవరించినట్లుగా కనిపిస్తోంది, ఈ రెండు మోడళ్లను వాటి లాంఛ్ ధరకు దగ్గరగా తీసుకువచ్చింది.
2026 ఏప్రిలియా RS 457 ధర: కొత్త ఏప్రిలియా RS 457 ధర ఇప్పుడు రూ. 4.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర IBW 2025లో ప్రదర్శించిన కొత్త కోరల్ బ్లూ స్నేక్, ఆర్సెనిక్ ఎల్లో కలర్ స్కీమ్‌లకు కూడా వర్తిస్తుందని గమనించాలి.
ఏప్రిలియా ఇండియా IBWలో మూడవ GP రెప్లికా రంగును కూడా ప్రదర్శించింది. ఇది కొన్ని నెలల క్రితం EICMA 2025లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది. భారతీయ మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ధర రూ. 4.37 లక్షలు. ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 15,000 ఎక్కువ, స్టాండర్డ్‌గా బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.
ఒకవేళ కస్టమర్లు కావాలనుకుంటే ఆప్షనల్‌గా వేరే రంగులో క్విక్‌షిఫ్టర్‌ను పొందొచ్చు. అయితే ఇందు కోసం వారు అదనంగా దాదాపు రూ. 25,000 చెల్లించాల్సి ఉంటుంది. GP రెప్లికా ఎడిషన్‌లో ప్రాథమిక రంగుగా బ్లాక్ కలర్ ఉంది. RS-GP రేస్ బైక్‌ను దగ్గరగా పోలి ఉండే అధికారిక స్పాన్సర్ గ్రాఫిక్స్‌తో పాటు ఫ్రేమ్, స్వింగ్‌ఆర్మ్ కోసం బ్లాక్-అవుట్ ఫినిషింగ్ ఉంటుంది.
2026 ఏప్రిలియా టుయోనో 457 ధర: కొత్త ఏప్రిలియా టుయోనో 457 దాని ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రెయిన్‌ను "RS 457"తో పంచుకుంటుంది. దీన్ని జనవరి 2025లో భారత మార్కెట్లో రూ. 3.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు ప్రారంభించారు. డిసెంబర్ 2025లో GST 2.0 అమలు తర్వాత, దాని ధర రూ. 4.24 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది.
అయితే, కంపెనీ దీనిని ఇప్పుడు రూ.3.97 లక్షలకు సవరించింది, దీని వలన GST పెంపు తర్వాత కూడా "టుయోనో 457" లాంఛ్ అయినప్పటి కంటే రూ.2,000 మాత్రమే ఖరీదైనదిగా ఉంది. యాంత్రికంగా ఈ రెండు బైక్‌లు ఏమాత్రం మారలేదు. ఇవి 47.6hp, 43.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 457cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో శక్తిని పొందుతాయి.

