ETV Bharat / state

నగరవనానికి 'సాహస' హంగులు - జిప్‌లైన్‌తో థ్రిల్‌

పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రత్యేక సదుపాయాలు - త్వరలోనే జంగిల్ సఫారీ అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు - నగరవనానికి వచ్చి సేదతీరుతున్న విజయవాడ వాసులు

Zip Line and Jungle Safari Ride in Mulapadu City Forest
Zip Line and Jungle Safari Ride in Mulapadu City Forest (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 5:11 PM IST

2 Min Read
Choose ETV Bharat

Zip Line and Jungle Safari Ride in Mulapadu City Forest : అడవిలోని అందమైన మయూరాలు, పరుగులు పెడుతున్న జింకపిల్లలు, పులులు సహా మరెన్నో జంతువులు ప్రకృతి, జంతు ప్రేమికులకు కనువిందు చేస్తాయి. వనంలో ప్రయాణమంటే చిన్నపిల్లనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అలాంటి అనుభూతి పొందాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందులోనూ పచ్చని చెట్ల నడుమ, పక్షుల కిలకిలరావాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. రణగొణ ధ్వనులకు దూరంగా పచ్చని వనంలో అదో అద్బుత లోకాన్ని తలపిస్తుంది. అలాంటి ‘వన’భూతి పొందాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం విజయవాడకు సమీపంలోని మూలపాడు నగరవనంకి వెళ్లాల్సిందే.

విజయవాడకు సమీపంలోని అందమైన, ప్రకృతి రమణీయమైన ప్రదేశం కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్న మూలపాడు నగరవనం. ఇక్కడ పచ్చని చెట్లు, సువాసన వెదజల్లే మొక్కలు దర్శనమిస్తాయి. తాజాగా పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేందుకు జిల్లాలోనే మొదటిసారి జిప్‌లైన్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే జంగిల్ సఫారీ, బర్డ్‌ వరల్డ్‌, ట్రెక్కింగ్ పాయింట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. మూలపాడు నగరవనంలో హంగులు, పర్యాటకుల స్పందనల గురించి తెలుసుకుందాం.

నగరవనానికి 'సాహస' హంగులు - జిప్‌లైన్‌తో థ్రిల్‌ను అనుభూతి చెందుతున్న పర్యాటకులు (ETV)

మరిన్ని సౌకర్యాలకు ప్రణాళిక సిద్ధం : ఎన్టీఆర్​ జిల్లా మూలపాడు నగరవనంలో మరిన్ని సౌకర్యాల కల్పనకు అటవీశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అటవీ పర్యాటకానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మందిని ఆకర్షించాలన్నది లక్ష్యం. విజయవాడ నగరానికి, రాజధాని అమరావతికి దగ్గరకు ఉండడంతో దీని అభివృద్ధి కీలకంగా మారింది. పశ్చిమ బైపాస్‌ అందుబాటులోకొస్తే అమరావతి నుంచి కూడా ఎక్కువ మంది సందర్శించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్‌ వంతెన నిర్మించనున్నందున దీనికి మరింత ప్రాధాన్యం పెరుగుతోంది.

"ఇక్కడ సీతాకోకచిలుక పార్కు చాలా బాగుంది. పచ్చని చెట్ల నడుమ, పక్షుల కిలకిలరావాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. అన్ని వయసుల వారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పిల్లలు ఆడుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్న జిప్​లైన్, సైక్లింగ్ మంచి అనుభూతిని ఇస్తున్నాయి. ఈ మూలపాడు నగరవనం విజయవాడకు దగ్గర్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది." - పర్యాటకులు

రెండు కొండల మధ్య జిప్‌లైనర్‌ : తాజాగా అడవిలో సాహస క్రీడలను ప్రోత్సహించేందుకు రెండు కొండల మధ్య జిప్‌లైనర్‌ను ఏర్పాటు చేశారు. నిడివి సుమారు 400 మీటర్లకుపైగా ఉంటుంది. తొలుత కొండపైకి ఎక్కిన అనంతరం జిప్‌లైనర్‌ ద్వారా అవతలి ప్రదేశానికి చేరుకోవచ్చు.

ప్రత్యేక వాహనంలో విహారం : దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యాటకులు తిరిగేలా జంగిల్‌ సఫారీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రత్యేక వాహనాల్లో అడవిలో విహరించొచ్చు. ఒక్కో వాహనంలో 13 మంది వెళ్లొచ్చు. ఆంజనేయస్వామి ఆలయం వరకు సఫారీకి అనుమతిస్తారు. అక్కడి నుంచి 700 మీటర్ల దూరంలో కనువిందు చేసే జలపాతం ఉంది. అక్కడికి నడిచి వెళ్లొచ్చు. ప్రస్తుతానికి ప్రత్యేక వాహనం ఒకటే వచ్చింది. దసరాకు జంగిల్‌ సఫారీ ప్రారంభించే వీలుంది.

జంగిల్‌ క్యాంపులో విడిది : మరోవైపు నల్లమల విహారానికి విచ్చేసే పర్యాటకులు జంగిల్‌ క్యాంపులో విడిది చేసేందుకు ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌టీఆర్‌.సీవో.ఇన్‌ లాగిన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. లాగిన్‌ అయిన వెంటనే బైర్లూటి ఎకో టూరిజం, పచ్చర్ల, తుమ్మల బయలు, నెక్కంటి ఇష్టకామేశ్వరి, రోళ్లపాడు అభయారణ్యం వెబ్‌సైట్‌లు కనిపిస్తాయి. ఇందులో మీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు.

39 ఏళ్లుగా అన్వేషణ - ఇంకా ప్రత్యక్షంగా కనిపించని కలివికోళ్లు

సరికొత్త పరిమాళలాతో తిరుమలకు పునరుద్ధరణ - పచ్చదనం కోసం ‘దశాబ్ది ప్రణాళిక’ సిద్ధం