చిన్నప్పన్నకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం - సేవలు మాత్రం వైవీ సుబ్బారెడ్డికే
వైవీ సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్నకు కీలక పోస్టులు - పేరుకే ఏపీ భవన్ అధికారి - సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టటంలో తలమునకలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 12:28 PM IST
Controversy Over Ghee Purchases Decision of TTD: తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పన్న అప్పటి టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదని అంతకుమించి నమ్మినబంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమైంది. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న గత వైఎస్సార్సీపీ పాలనలో కీలక పోస్టుల్లో నియమితులై ప్రభుత్వ ఖజనా నుంచి జీతభత్యాలు పొందుతూ అప్పటి టీటీడీ ఛైర్మన్ సేవలో తరించినట్లు స్పష్టమవుతోంది.
పేరుకే దిల్లీలో అధికారి అయిన చిన్నప్పన్న ప్రధాన విధి మాత్రం వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టటమే. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న తొలుత ఏపీ భవన్ లైజన్ అధికారిగా, ఆ తర్వాత ప్రత్యేకాధికారిగా నియమితులైనట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించేందుకు పోస్టులిప్పించి చిన్నప్పన్నను సుబ్బారెడ్డి తన సేవలకు వినియోగించుకున్నట్లు అర్థమవుతోంది. చిన్నప్పన్నను ఏపీ భవన్‌లో స్పెషల్ లైజన్ అధికారిగా నియమిస్తూ 2019 అక్టోబరు 10న అప్పటి సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులిచ్చారు. చిన్నప్పన్న ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకుని ఆయన్ను ఆ పోస్టులో నియమించాలంటూ నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రధాన సలహాదారు అజేయ కల్లం 2019 ఆగస్టు 13న పంపించిన నోట్ ఆధారంగా నియామకం చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోరడమే ఆలస్యం - ఆగమేఘాలపై అనుమతులు: మూడేళ్ల కాలపరిమితితో రూ. 75 వేల పారితోషికం, అలవెన్స్‌లు కల్పిస్తూ చిన్నప్పన్నను ఏపీ భవన్ స్పెషల్ లైజన్ అధికారిగా నియమించారు. సుబ్బారెడ్డి జోక్యం లేకుండా, ఆయన సిఫార్సు చేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నోట్ పంపిస్తారా అనేది ప్రశ్నార్ధకం. 2022 అక్టోబరు 10తో ఏపీ భవన్ లైజన్ అధికారిగా పదవీ కాలం పూర్తి కానుండటంతో తనను ఏపీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా మూడేళ్ల కాలపరిమితితో నియమించాలని చిన్నప్పన్న సెప్టెంబరు 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది.
చిన్నప్పన్నను రెండేళ్ల కాలపరిమితితో ఏపీ భవన్ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ 2022 అక్టోబరు 7న నాటి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు. సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా చిన్నప్పన్నను అంత కీలక పోస్టులో నియమిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్‌లో అధికారైనప్పటికీ ఆయన అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టటంలో తలమునకలై ఉంటారని విస్తృతంగా ప్రచారం ఉండటంతో 2022 అక్టోబరు 7న జారీ చేసిన జీవోను జగన్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. నెలన్నర తర్వాత 2022 నవంబరు 17న ఏపీ ఈ-గెజిట్ పోర్టల్‌లో జీవోను అప్‌లోడ్ చేసింది.
లంచాల డిమాండ్: తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 15న చిన్నప్పన్నను దిల్లీలో కలవగా నెయ్యి టెండరు కావాలంటే కిలోకు రూ.25 చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. నెయ్యి సరఫరా టెండర్లు దక్కాలంటే లంచమివ్వాలని ఎందుకు, ఎవరి ఆదేశాలతో డిమాండ్ చేశారనేది తేల్చాల్సి ఉంది. చిన్నప్పన్న భోలేబాబాపై ఫిర్యాదిస్తే సుబ్బారెడ్డి వెంటనే దాన్ని ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రమణ్యానికి అందజేసి విచారించాలని ఎందుకు ఆదేశించారన్న దానికి సమాధానం లేదు. చిన్నప్పన్న 2022 మే నెలలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్ డెయిరీ ఎండీ జగ్‌మోహన్ గుప్తాను దిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాసానికి పిలిపించుకుని తిరుమలకు నెయ్యి సరఫరా టెండరు దక్కాలంటే కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని అడిగారు.
అంగీకరించిన జగ్‌మోహన్ గుప్తా 2022 నుంచి 2023 డిసెంబరు వరకూ దఫదఫాలుగా చిన్నప్పన్నకు 50 లక్షలు చెల్లించారు. టీటీడీ నెయ్యి టెండర్లు దక్కించుకోవటం కోసం ఎవరైనా ఏపీభవన్ లైజన్ అధికారికి లంచం ఇస్తారా? అనే ప్రశ్నలకు బదులు లేదు. మీ పీఏ చిన్నప్పన్న కిలోకు రూ. 25 చొప్పున లంచం అడుగుతున్నారని భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు. అప్పుడైనా చిన్నప్పన్న తన పీఏ కాదని, అతనికి టీటీడీ వ్యవహారాలకు ఎలాంటి సంబంధమూ లేదని సుబ్బారెడ్డి ఎందుకు పొమిల్ జైన్‌కు చెప్పలేదు? చిన్నప్పన్నపై ఫిర్యాదివ్వాలని ఎందుకు సూచించలేదో సమాధానం చెప్పాల్సి ఉంది.
టీటీడీకి నెయ్యి, ఇతర సరకులు సరఫరా చేసే సంస్థలు, వాటి యజమానుల ఫోన్ నంబర్లు, కొనుగోలు కమిటీ నిర్ణయాలు, సిఫార్సుల వివరాలను ప్రొక్యూర్‌మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం ఎప్పటికప్పుడు చిన్నప్పన్నకు పంపించేవారు. టీటీడీ పాలకమండలి సమావేశాల అజెండాను ముందే ఆయనకు పంపేవారు. భోలేబాబా డెయిరీ ప్లాంట్ తనిఖీకి వెళ్లిన బృందం సభ్యులు కూడా చిన్నప్పన్న ఆదేశాల్నే పాటించారు. అప్పటికి ఏపీ భవన్ అధికారిగా ఉన్న చిన్నప్పన్నకు సుబ్బారెడ్డితో ఏ సంబంధమూ లేకపోతే అతనికి నాటి టీటీడీ అధికారులు ఈ వివరాలన్నీ ఎందుకు పంపినట్లో అన్న విషయాలు వెలుగు చూడాల్సి ఉంది.

