తాతయ్యతో సరదాగా మొదలైన చెస్ ప్రయాణం - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు
చదరంగంలో రాణిస్తోన్న విద్యార్థిని - అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ - వరుసగా కాంస్య పతకాలు కైవసం - భవిష్యత్తులో మాస్టర్ టైటిల్ సాధించడమే త్రిపురాంబిక లక్ష్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 1:02 PM IST
|Updated : February 27, 2026 at 2:34 PM IST
Tirupati Girl Thripurambika Wins International Chess Medal : 64 గడుల చదరంగం ఆట మాత్రమే కాదు. అదో మేధోశక్తి పరీక్ష. ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేయాల్సిన ఈ ఆటలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. చిన్ననాట తాతయ్యతో సరదాగా మొదలైన తన ఆటతో నేడు ప్రపంచస్థాయి వేదికలపై పతకాలు సాధిస్తోంది. జార్జియా, శ్రీలంకలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆ అమ్మాయి ఇటీవలే మంగోలి యాలోఅండర్-13 బ్లిట్జ్ ఫార్మాట్‌లో కాంస్య పతకం సాధించి ఔరా అనిపించింది. ఇలా అతిపిన్న వయసులోనే చెస్ ఛాంపియన్‌గా ఎదిగిన ఆ అమ్మాయే తిరుపతికి చెందిన త్రిపురాంబిక.
వయసు చిన్నది. ఆలోచనలు అంతర్జాతీయ స్టాయివి ఈ అమ్మాయివి. చదువుతోంది తొమ్మిదే ఐనా ప్రపంచ స్థాయి చెస్ ప్రతిభతో పతకాలు కొల్లగొడుతోంది. జార్జియా ఫిడే వరల్డ్ టోర్నీలో టాప్-20లో నిలవగా శ్రీలంక ఏషియన్ స్కూల్స్ గేమ్స్‌లో 2 క్యాంస పతకాలు సాధించి ఔరా అనిపిస్తోంది. అంతేనా ఇటీవల మంగోలియాలోని ఉలాన్ బాటర్‌లో జరిగిన అండర్-13 బ్లిట్జ్ ఫార్మాట్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఇలా ఓ వైపు చదరంగంలో ప్రతిభ కనబరుస్తూనే, మరోవైపు చదువులోనూ శభాష్ అనిపించుకుంటోంది.
తిరుపతికి చెందిన త్రిపురాంబిక మూడో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల తాతయ్యతో సరదగా చెస్ ఆడేది. అదే తన జీవితాన్ని మార్చేసింది. ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగేందుకు దోహదపడింది. అలాగే చిన్నప్పుడు భగవద్గీత క్లాసులకు వెళ్ళిన త్రిపురాంబిక కేవలం వినికిడితోనే క్లిష్టమైన శ్లోకాలను ధారణ చేసేది. దాన్ని గ్రహించిన తండ్రి ప్రతాప్ కూతురు గ్రహణశక్తిని గుర్తించి చదరంగం వైపు మళ్లించారు.
త్రిపురాంబికది ఓటమిని ఒప్పుకోనితత్వం: త్రిపురాంబిక శక్తిసామర్థ్యాలను గుర్తించిన తండ్రి ప్రతాప్ తిరుపతిలో శిక్షణను ఇప్పించారు. గురువులు కల్యాణ్ చక్రవర్తి, తేజ, కాకినాడలో ప్రసాద్‌ల వద్ద మెలకువలు నేర్చుకుని ప్రస్తుతం వెలాసిటీ చెస్ అకాడమీలో కృష్ణ తేజ వద్ద శిక్షణ పొందుతోంది. నిజానికి త్రిపురాంబికది ఓటమిని ఒప్పుకోనితత్వం పడినా లేచి గెలవాలనే కసి ఇవే తనను అంతర్జాతీయ స్థాయి జూనియర్ చదరంగం పోటీల్లో విజేతగా నిలుపుతోందని చెబుతోంది.
అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ: జిల్లా, రాష్ట్ర స్థాయిలను దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో త్రిపురాంబిక పతకాలు సాధిస్తోంది. కాకినాడలో జరిగిన నేషనల్ అండర్-13 స్కూల్స్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ అమ్మాయి. అంతర్జాతీయ స్థాయిలో జార్జియాలో జరిగిన ఫిడే వరల్డ్ టోర్నీలో టాప్ 20లో నిలిచి సత్తా చాటింది. శ్రీలంకలో జరిగిన ఏషియన్ స్కూల్స్ గేమ్స్‌లో 2 వెండి పతకాలు సాధించి, చదరంగంలో తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది.
తనదైన ప్రతిభ కనబరుస్తూ: ప్రపంచస్థాయిలో వరుస విజయాలు సాధిస్తోన్న త్రిపురాంబిక ఇటీవల మంగోలియాలోని ఉలాన్ బాటర్‌లో జరిగిన అండర్-13 బ్లిట్జ్ ఫార్మాట్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఇలా ప్రపంచ చదరంగం వేదికలపై తనదైన ప్రతిభ కనబరుస్తోన్న ఈ అమ్మాయి. చదువులోనూ చక్కగా రాణిస్తోందిన్నట్లు చెబుతోంది.
''నేను 9వ తరగతి చదువుతున్నాను. మూడో తరగతిలో ఉన్నప్పుడు నుంచి చెస్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. తాతయ్యతో సరదాగా ఆడుతుంటే నాన్న నన్ను చూసి ఐక్యూ పవర్ బాగుందని, ప్రొఫెషనల్‌గా చెస్ నేర్పిస్తే బాగుంటుందని నాన్న స్నేహితుడి వద్ద చెస్ నేర్పించారు. మంగోలియాలోని ఉలాన్ బాటర్‌లో జరిగిన అండర్-13 బ్లిట్జ్ ఫార్మాట్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాను. భవిష్యత్తులో మాస్టర్ టైటిల్ సాధించడమే నా లక్ష్యం.'' - త్రిపురాంబిక, చెస్ క్రీడాకారిణి
కుమార్తె త్రిపురాంబిక కలల సాధన కోసం వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నట్లు తండ్రి ప్రతాప్ చెబుతున్నారు. కానీ, విదేశాల్లో దేశం తరఫున పతకాలు సాధించడం, జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా తమ శ్రమను మర్చిచిపోతున్నట్లు త్రిపురాంబిక తల్లిదండ్రులు చెబుతున్నారు.
రాబోయే 2 ఏళ్లలో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించడమే లక్ష్యమని త్రిపురాంబిక చెబుతోంది. ఆ తర్వాత ఉమెన్ గ్రాండ్ మాస్టర్‌గా, వరల్డ్ ఛాంపియన్‌గా ఎదగాలన్నదే ఆశయం అంటోంది.
రోలర్ స్కేటింగ్‌లో రాణిస్తున్న భవ్య శ్రీ - క్రీడల విభాగంలో ఎంబీబీఎస్ సీటు
అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్'లో జీఎంఆర్ విద్యార్థుల ప్రతిభ - జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

