వెయ్యేళ్లైనా చెక్కు చెదరవు - రెజిన్ ఆర్ట్‌లో రాణిస్తున్న టెకీ దివ్యమౌనిక
రెజిన్ ఆర్ట్‌లో రాణిస్తున్న టెకీ దివ్యమౌనిక - ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతుల పెళ్లి ఫోటో - పెళ్లి తలంబ్రాలు, బాసికాలు - రెజిన్ ఆర్ట్ చేసి ప్రశంసలు అందుకున్న దివ్యమౌనిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2026 at 2:35 PM IST
YUVA Story on Resin Art To Store Memories : జీవితంలో జరిగే కొన్ని మధుర స్మృతులు శాశ్వతంగా మిగిలిపోవాలని చాలా మంది కోరుకుంటారు. ఫొటోలు, పెయింటింగ్స్ కొంతకాలానికి వెలిసిపోవచ్చు లేదా పాడైపోవచ్చు. కానీ ఇప్పుడు 'రెజిన్ ఆర్ట్' రూపంలో జ్ఞాపకాలను వెయ్యేళ్ల వరకు భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చింది. కాకినాడకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన వృత్తిని కొనసాగిస్తూనే ఈ అద్భుత కళలో రాణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతుల పెళ్లి ఫొటోను సైతం రెజిన్ ఆర్ట్‌తో తీర్చిదిద్ది ప్రశంసలు అందుకున్నారు. మరి ఏంటా స్పెషల్ ఆర్ట్? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్డర్లు : సాధారణంగా ఫొటో ఫ్రేమ్‌లు లేదా లామినేషన్లు కాలంతో పాటు పాతబడిపోతాయి. రెజిన్ ఆర్ట్ అలా కాదు. ఇష్టమైన జ్ఞాపకాలను అద్దంలా మెరిసే ఎపోక్సీ రెజిన్‌తో కలిపి పదిలపరిస్తే, కలకాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇప్పుడు యువత ఈ కళాకృతుల పట్ల తెగ ఆసక్తి చూపుతున్నారు. కాకినాడకు చెందిన టెకీ దివ్య మౌనిక ఈ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే తీరిక సమయంలో ఈ కళను అభ్యసించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆర్డర్లు పొందుతూ అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు.
చిన్నప్పటి నుంచే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇష్టం దివ్య మౌనికకు. కరోనా లాక్‌డౌన్ టైమ్ లో స్నేహితులకు కానుకలు ఇవ్వడం కోసం సరదాగా రెజిన్ ఆర్ట్ నేర్చుకున్నారు. తన పెళ్లి ఫొటోతో చేసిన రెజిన్ ఆర్ట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో మంచి స్పందన వచ్చింది. ఆ క్రమంలోనే తన మామయ్య ఉండవల్లి వీర్రాజు కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతుల పెళ్లి ఫొటో రెజిన్ ఫ్రేమ్‌గా రూపొందించి బహుమతిగా ఇచ్చారు. అది చూసి ముఖ్యమంత్రి ముచ్చటపడటంతో దివ్య మౌనిక ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
"చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందులోనే భాగంగా దీన్ని నేర్చుకున్నాను. నా పెళ్లి ఫొటోను రెజిన్ ఆర్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దాని తర్వాత ఆర్డర్స్ రావడం మొదలైయ్యాయి. దీంతో దాని మీద ప్రతిభ మరింత పెంచుకునేందుకు ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. నా లాంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో ఆఫ్ లైన్లోను శిక్షణ ఇస్తున్నాను. దీనికి నా కుటుంబం నాకు ఎంతో సహకరిస్తుంది". -దివ్య మౌనిక, రెజిన్ ఆర్ట్‌లో రాణిస్తున్న టెకీ
రెజిన్ ఆర్ట్‌లో మరిన్ని మెరుగులు దిద్దుకోవడం కోసం సూరత్‌లో ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లోనూ శిక్షణ తీసుకున్నారు దివ్య మౌనిక. ఆమె నైపుణ్యం చూసి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఎపోక్సీ రెజిన్, హార్డనర్ మిశ్రమంతో అద్భుతమైన ఫ్రేమ్‌లను ఆమె సృష్టిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తన వర్క్‌కు ఫిదా అవుతున్నారు
జ్ఞాపకాలకు రెజిన్ ఆర్ట్ వేదిక : పెళ్లి రోజు తలంబ్రాలు, బాసికాలు, జీలకర్ర బెల్లం దగ్గర్నుంచి బిడ్డ పుట్టిన తర్వాత దాచుకునే బొడ్డు పేగు, తొలి వ్యాక్సిన్ వరకు దేన్నయినా రెజిన్ ఫ్రేమ్‌లలో భద్రపరుచుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లనూ జ్ఞాపకంగా దాచుకుంటున్నారు కొందరు. ఇంట్లో పెద్దలు మరణించినప్పుడు వారు వాడిన వస్తువులను కూడా గుర్తుగా ఉంచుకునేందుకు ఈ రెజిన్ ఆర్ట్ ఒక వేదికగా మారింది. అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వేడుకల జ్ఞాపకాలనూ ఇందులో పొందుపరుస్తున్నారు.
దివ్య మౌనికకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు భర్త కృష్ణ. ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ చదివి, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఈ దంపతులు కళాకృతుల తయారీ లోనూ పరస్పరం సహకరించుకుంటున్నారు. భార్యలోని సృజనాత్మకతను గుర్తించిన కృష్ణ ఆమెకు అన్ని వేళలా అండగా నిలుస్తున్నారు. దివ్య తల్లిదండ్రులు కూడా ఆమె చేస్తున్న ఈ కృషిని చూసి గర్వపడుతున్నారు. ఒకవైపు ఐటీ ఉద్యోగం, మరోవైపు సృజనాత్మకమైన కళ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది ఈ యువతి. కష్టమైనా ఓపిక, నేర్పుతో పని చేస్తూ సామాజిక మాధ్యమాలే వేదికగా ఆర్డర్లు పొందుతూ అదనపు ఆదాయమూ ఆర్జిస్తోంది.
"లాఫింగ్ బుద్ధ, అదృష్ట వెదురు" - ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
గోడలపై 'వర్లీ' చిత్రకళతో ఆధునిక విద్య - దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న సాయిదీపిక

