రోలర్ స్కేటింగ్‌లో రాణిస్తున్న భవ్య శ్రీ - క్రీడల విభాగంలో ఎంబీబీఎస్ సీటు
తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతో పతకాలు - మూడేళ్ల వయస్సులోనే రోలర్ స్కేటింగ్‌లోకి - స్కేటింగ్, వైద్య వృత్తిలో రాణిస్తున్న భవ్య శ్రీ - రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 2:27 PM IST
Story on Bhavya Sri in Roller Skating at Visakha : నడక కూడా సరిగ్గా రాని మూడేళ్ల ప్రాయంలో ఆ చిన్నారిని రోలర్ స్కేటింగ్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. తన చురుకుదనానికి తోడు తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతో, రోలర్ స్కేటింగ్‌లో అద్భుతంగా రాణిస్తోంది. తన ప్రతిభతో ఎన్నో పతకాలు సాధించింది. రోలర్ స్కేటింగ్‌లో అద్భుతాలు కనబరుస్తూ క్రీడల విభాగంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందింది. ఆమె విశాఖ ఎండాడకు చెందిన వైద్య విద్యార్థిని వాకలపూడి భవ్యశ్రీ.
రోలర్ స్కేటింగ్ ఇది చేయాలంటే శారీరక ధృఢత్వంతో పాటు మంచి బ్యాలెన్సింగ్ అవసరం. రోలర్ స్కేటింగ్ చేస్తున్నంత సేపు గాలిలో తేలుతున్నట్లు, ఏదో తెలియని హాయిగా ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు. దానికి ఎంతో నేర్పు, శిక్షణ అవసరం. అలాంటి రోలర్ స్కేటింగ్‌లో చిన్ననాటి వయసు నుంచే గొప్పగా 20 ఏళ్ల భవ్య శ్రీ రాణిస్తుంది.
ఇది కేవలం పాదాలకు చక్రాలు కట్టుకుని తిరగడం మాత్రమే కాదు దీనికి ఎంతో ఏకాగ్రత, శరీర సమతుల్యత అవసరం అంటుంది భవ్య. అద్భుతమైన ఆటతీరుతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధిస్తూ దూసుకుపోతుంది. తనదైన ఆటతీరుతో కళాశాల ఫిజికల్ డైరక్టర్, కోచ్‌ల మన్ననలు అందుకుంటుంది. ఒకవేళ పై చదువులకు వెళ్లినా రోలర్ స్కేటింగ్‌ను కొనసాగిస్తానని భవ్య శ్రీ అంటుంది.
ఒత్తిడినైనా తట్టుకునే శక్తి క్రీడాకారులకే సాధ్యం: క్రీడల్లోనే కాకుండా వైద్య విద్యలోనూ ప్రతిభ కనబరుస్తోంది భవ్యశ్రీ. తన తల్లిదండ్రులు, సోదరుడి స్ఫూర్తితో సేవా గుణాలను నేర్చుకున్నానంటున్న భవ్య శ్రీ వైద్య విద్యను అభ్యసించి పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తానని అంటోంది. ప్రస్తుతం విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో క్రీడల విభాగంలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతుంది. క్రీడారంగాన్ని ఎంపిక చేసుకున్న వారితో పోల్చుకుంటే మిగతా వారి మనసు సున్నితంగా ఉంటుందని, చిన్న విషయాలకే గాయపడుతుందని, ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడే శక్తి క్రీడాకారులకు మాత్రమే సాధ్యమవుతుందని భవ్య అంటుంది.
"రోలర్ స్కేటింగ్ అనేది మిగతా స్పోర్ట్స్‌తో పోలిస్తే చాలా విభిన్నమైనది. కొంచెం ఏకాగత్రతో దీనిలో ఉన్నా ఎలిమెంట్స్‌ను టెక్నికల్‌గా నేర్చుకోవాలి. మా దాంట్లో మ్యూజిక్కు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తూ చేయాలి. నాకు స్పోర్ట్స్‌లో గుర్తింపు వచ్చింది. దీన్ని ఎప్పటికీ వదలను." - భవ్య శ్రీ , రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి
దేశానికి బంగారు పతకాన్ని తీసుకురావాలి: భవ్య శ్రీ తండ్రి, వాకలపూడి వెంకటేశ్వరరావుది స్వస్థలం రాజమహేంద్రవరంలోని మిర్తిపాడు గ్రామం. వ్యాపార రీత్యా కుటుంబంతో విశాఖలో స్థిరపడ్డారు. భవ్య శ్రీలో చిన్నప్పటి నుంచి ఉన్న చురుకుదనాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు, వెంకటరావు, జ్యోతిలు, విశాఖపట్నంలోని శివాజీ పార్క్‌లో రోలర్ స్కేటింగ్‌కు తీసుకు వెళ్లి కోచ్ సత్యరాయణ వద్ద చేర్పించారు. భవ్య శ్రీ రోలర్ స్కేటింగ్‌లో అంతర్జాతీయంగా దేశానికి బంగారు పతకాన్ని తీసుకురావాలని కుటుంబ సభ్యులు అంతా కోరుకుంటున్నామని తెలిపారు.
స్కేటింగ్‌లో దూసుకుపోతూ: భవ్యశ్రీ రోలర్ స్కేటింగ్‌లో తాము చెప్పే మెలకువలను మిగతా పిల్లల కన్నా ముందుగానే పసిగట్టి ప్రదర్శించేదని, రోలర్ స్కేటింగ్ పై ఆమె పెట్టే శ్రద్ధను చూస్తే తమకు ముచ్చటేసేదని కోచ్ సత్యనారాయణ తెలిపారు. గత 17 ఏళ్లుగా భవ్య శ్రీ తమ వద్ద శిక్షణ పొందుతుందని, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో భవ్య దేశానికి బంగారు పతకాన్ని సాధిస్తుందని తమకు నమ్మకముందని కోచ్ సత్యనారాయణ అంటున్నారు. తమ కళాశాలలో చేరినప్పటి నుంచి భవ్య శ్రీ క్రీడా విభాగంలో రోలర్ స్కేటింగ్‌లో ఎన్నో పతకాలు సాధించిందని, 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ అంతరాష్ట్ర పోటీల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని ఆంధ్ర మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పాత్రుడు అన్నారు.
తన అద్భుతమైన ఆట తీరుతో ఓ వైపు చదువు, మరో వైపు రోలర్ స్కేటింగ్‌లో దూసుకుపోతూ ఎందరికో స్ఫూర్తిగా భవ్య శ్రీ నిలుస్తోంది. తను అంతర్జాతీయ పరంగా బంగారు పతకాన్ని సాధించాలని మనమూ ఆశిద్దామా.
'ల్యాప్‌టాప్‌తో పాటు లాఠీ పట్టాలి' - చంద్రబాబు స్ఫూర్తితో జాబ్ సాధించిన అయ్యూరి బ్యూలా
రూ.లక్షల ప్యాకేజీల జాబ్స్ వదిలి, గ్రూప్ -1 లో డీఎస్పీ కొలువు సాధించిన చాందిని విజయగాథ

