ETV Bharat / state

మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల హంగామా - పోడియం వద్ద ఆందోళన చేస్తూ విజిల్స్

శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల హంగామా - పోడియం వద్ద ఆందోళన చేస్తూ విజిల్స్ వేసిన ఎమ్మెల్సీలు - పెద్దల సభ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారంటూ అధికారపార్టీ సభ్యుల ఆవేదన

YSRCP_MLCS_PROTEST_IN_COUNCIL
YSRCP_MLCS_PROTEST_IN_COUNCIL (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 3:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

YSRCP Protest in Council on Indapur Dairy and Heritage Issue: ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా, సహా తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై వరుసగా 3వ రోజూ శాసన మండలి దద్దరిల్లింది. ఈ అంశాలపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్​ రాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనంటూ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనకు దిగారు. బడ్జెట్​పై 4 రోజులు చర్చించాలని బీఎసీలో నిర్ణయించామని అయితే గత 2 రోజులుగా బడ్జెట్​పై చర్చించే అవకాశం రాలేదని అన్నారు.

మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల హంగామా - పోడియం వద్ద ఆందోళన చేస్తూ విజిల్స్ (ETV)

బడ్జెట్​పై చర్చ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నందున దానిపై చర్చించేందుకు సభ్యులు సహకరించాలన్న మండలి ఛైర్మన్ ఇచ్చిన సూచనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. పోడియంను చుట్టు ముట్టి శాసన మండలిలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుుకుని, విజిల్స్ వేస్తూ, పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తన, తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్​కు ఎక్కడా ఏ సంబందం లేదని ఈ విషయాన్ని పదేపదే చెప్పినా పట్టించుకోకుండా వారు ఆందోళన చేయడం సరైన పద్దతి కాదని తెలిపారు.

హెరిటేజ్ వెబ్​సైట్​లో తెలిపారు: హెరిటేజ్ సంస్థకు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తగ్గించేందుకే వారు ఆందోళన చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని బొత్స మీడియా సమావేశంలో తప్పుగా చెప్పారని దీనిపై హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసు ఇచ్చిందని, దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్​కు సంబంధం ఉంటే ఆధారం తీసుకురావాలని సవాల్ చేసినా తీసుకురావడం లేదని తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో లావాదేవీలు జరపకూడదని హెరిటేజ్ సంస్థ నిర్ణయించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సాక్షి పేరిట ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని దుయ్యబట్టిన మంత్రి అచ్చెన్న హెరిటేజ్​పై బురద జల్లేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రతిరోజూ ఒకే అంశంపై వాయిదా తీర్మానం తెచ్చి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన బొత్స ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్​కు సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయని, ఇందాపూర్ సంస్థ అనుబంధమని హెరిటేజ్ వెబ్​సైట్​లో తెలిపారని చెప్పారు. దీనిపై శాసన మండలిలో చర్చకు మేము సిద్దమని, ప్రభుత్వం చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొనడంతో సభను కాసేవు వాయిదా వేశారు. 2 గంటల వ్యవధి అనంతరం సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు తిరిగి ఆందోళన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్​ రాజు ప్రకటించారు. దీంతో కీలకమైన ప్రశ్నోత్తరాలు, బడ్జెట్​పై చర్చ జరగకుండానే సభ వరుసగా రెండోరోజు వాయిదా పడింది.

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ సంస్థకు సంబంధాలు ఉన్నయన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందాపూర్​తో హెరిటేజ్​కు సంబంధం ఉన్నట్లు మా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయన్నారు. హెరిటేజ్ సంస్థ పంపిన నోటీసులు తనకు ఇంకా అందలేదని ఒకవేళ అందినా వాటిని తాను లెక్కచేయబోనని అన్నారు. మండలి వాయిదా అనంతరం మీడియాతో బొత్స మాట్లాడారు. తిరుమల ప్రసాదాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం సరికాదన్నదే తమ ఉద్దేశమని ధన దాహం, ఇందాపూర్ సంస్థతో హెరిటేజ్ సంబంధాలు బయటపడతాయనే మండలిలో చర్చకు రావడం లేదన్నారు.

హెరిటేజ్​పై సభలో చర్చకు పట్టుబడితే నాకు లీగల్ నోటీసులను పంపించడం హాస్యాస్పదమన్నారు. ఇందాపూర్ ద్వారా తయారు చేసిన హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్​నే తాను మీడియాకు చూపించానని, తాను చూపిన ప్యాకెట్​పై ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ సంస్థ తయారు చేసినట్లు చాలా స్పష్టంగా ఉందన్నారు. నిబద్దతతో వాస్తవాలే మాట్లాడానని క్షమాపణలు చెప్పేదే లేదన్నారు. నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందన్న వ్యాఖ్యలపై తొలుత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన మండలిలో చర్చకు అధికార పక్షం తోకముడిచిందన్న బొత్స కుంటి సాకులతో ముడిపెడుతూ సభను వాయిదా వేశారని ధ్వజమెత్తారు.

దద్దరిల్లిన శాసన మండలి - పోడియం చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన

లడ్డూ కల్తీ వ్యవహారంపై అట్టుడికిన మండలి - ఇరువురి వాదోపవాదాలతో గందరగోళం