ఏమాత్రం మారని వైఎస్సార్సీపీ సభ్యుల తీరు - 5వ రోజూ మండలి వాయిదా
ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని మండలిలో పోడియం వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల వరుసగా 5వ రోజూ ఆందోళన - సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేసిన మండలి ఛైర్మన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 7:33 PM IST
YSRCP MLCs Protest in Legislative Council: శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరు ఏమాత్రం మారలేదు. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై శాసన మండలిలో వరుసగా 5వ రోజూ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ అంశంపై మండలిలో చర్చించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుసగా 5వ రోజు వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. సభలో చర్చించాల్సిందేనంటూ ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలను మండలి ఛైర్మన్ చేపట్టారు.
వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన ఉద్దృతం చేయడం, సభలో గందరగోళం నెలకొనడంతో సభను కాసేపు వాయిదా వేశారు. అనంతరం ఈ నెల 20న తాము మండలిలో ఆందోళన చేస్తోన్న సీసీ టీవీ ఫుటేజీ ఒరిజినల్ వీడియోలు రిలీజ్ చేయాలంటూ మండలి ఛైర్మన్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకుని, విజిల్స్ వేస్తూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున ఆందోళన చేస్తోన్న సభ్యులను పిలిచిన ఛైర్మన్ ఫుటేజీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ప్రత్యేక అంశాల ప్రస్తావనకు అవకాశం: ఇదే సమయంలో వరుసగా 5 రోజుల పాటు సభా కార్యకలాపాలు నిలిచిపోవడం, సభలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తోన్న దృష్ట్యా సభా కార్యకలాపాల నిర్వహణ కోసం మండలి బీఎసీ సమావేశమైంది. ఛైర్మన్ కొయ్యె మోషను రాజు అధ్యక్షతన సమావేశంలో సభలో ప్రజా సమస్యలపై చర్చించడంపై చర్చించారు. ఈ నెల 26న మండలిలో తిరుమల కల్తీ లడ్డూపై చర్చించాలని నిర్ణయించారు. అదే విధంగా వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ తదితర సమస్యలపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. అనంతరం 1.45 గంటలకు సభ ప్రారంభం కాగా సభ్యులు ప్రత్యేక అంశాల ప్రస్తావనకు ఛైర్మన్ అవకాశం కల్పించారు.
రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో చనిపోయిన ఘటనలపై హోం మంత్రి సభలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఘటనను ఖండించిన హోం మంత్రి కల్తీ పాల ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందని బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. హోం మంత్రి సమాధానం అనంతరం మండలి రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
ఆ ఆరోపణలు అవాస్తవం: ఈ సందర్భంగా మండలిలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీపై ఈ నెల 26న మండలిలో చర్చించాలని నిర్ణయించారని అలానే 24న లా అండ్ ఆర్డర్, 25న వ్యవసాయంపై చర్చిస్తారని తెలిపారు. సాగునీటిపారుదల, విద్య, పెట్టుబడులపైనా చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని బొత్స తెలిపారు. ఇటీవల వైఎస్సార్సీపీ సభ్యులు చెప్పులు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫొటోలు పట్టుకున్నారనే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఒరిజినల్ వీడియో ఫుటేజీ ఇచ్చేందుకు ఛైర్మన్ సమ్మతించారని వెల్లడించారు.
కల్తీ నెయ్యిపై సీఎం కీలక ప్రకటన - రేపు అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చ
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అవకాశం - అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు

