"సాక్షులను చంపుతానని అనంతబాబు బెదిరించారు - అతనికి బెయిల్ ఇవ్వొద్దు"
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ - డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ - బెయిల్ కోసం అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేత

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 3:39 PM IST
YSRCP MLC Anantha Babu Bail Petition Again Cancel : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను రాజమహేంద్రవరంలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను చంపుతానని అనంతబాబు బెదిరించారని, అతనికి బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు.
కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు అనంతబాబు రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను ఇటీవలే కొట్టివేసిన సంగతి తెలిసిందే. మరోసారి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌నూ ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసు కీలక విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రస్తుతం కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తిగా ఉన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు ఇరువైపులా వాదనలు విన్నారు. ఇప్పటికే కీలకమైన సాక్షుల వాంగ్మూలం నమోదు పూర్తైనందున బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసుల తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు నిందితుడికి ఎట్టి పరిస్ధితుల్లోనూ బెయిల్ ఇవ్వవద్దని న్యాయమూర్తిని కోరారు.
హత్య కేసులో సాక్షులను చంపుతానని అనంతబాబు బెదిరించారని దీనిపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసు స్టేషన్లో ఏప్రిల్ 20న కేసు నమోదైనట్లు తెలిపారు. బెయిల్‌పై ఉంటూనే కేసులో సాక్షులను చంపుతానని బెదిరించడం తీవ్ర నేరమని, బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిననందున ఇటీవలే ఓ సారి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసినట్లు న్యాయమూర్తికి వివరించారు.
"ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రమ్మణ్యం కేసులో మళ్లీ బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది సాక్షులను విచారించారు. నాకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు పేర్కొనగా, అతని తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనంతబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ ఆదేశాలిచ్చారు." - ముప్పాళ్ల సుబ్బారావు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్
బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు: మరోసారి దరఖాస్తు చేశారని ఇప్పుడు బెయిల్ ఇస్తే కేసు విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని న్యాయస్థానం దృష్టికి ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు తీసుకువచ్చారు. కేసులో 80 మంది సాక్షుల వాగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని ఇప్పటివరకు కొంతమంది నమోదు మాత్రమే పూర్తైనట్లు తెలిపారు. విచారణ కీలక దశలో ఉన్నందున నిందితుడు అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ విన్నవించారు. బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు సైతం ముప్పు వచ్చే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రత్యేక పీపీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం వెలువరించారు. అనంతబాబు పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును కొట్టివేశారు.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు - అనంతబాబు బెయిల్ రద్దు
ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ - రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

