మండలిలో ఉద్రిక్తత - ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ సభ్యులు
శాసనమండలిలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం - ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ సభ్యులు - ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌తో పాటు సోము మీదకు వెళ్లిన విక్రాంత్, రమేష్ యాదవ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 12:38 PM IST
|Updated : February 26, 2026 at 3:39 PM IST
Heated Debate in Council on Rayalaseema Lift Project: శాసనమండలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మండలి దద్దరిల్లింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు రచ్చ చేశారు. నేతల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలి అట్టుడికింది.
ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకెళ్లారు. సోము వీర్రాజు మీదకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు వెళ్లారు. రాయలసీమ లిఫ్ట్‌పై మంత్రి రామానాయుడు సమాధానం పూర్తయినా వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. సమాధానం పూర్తైనందున తర్వాతి ప్రశ్నకు ఛైర్మన్ మోషేన్ రాజు అవకాశం కల్పించారు.
ఛైర్మన్ అవకాశం కల్పించటంతో తర్వాతి ప్రశ్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేవనెత్తారు. ఛైర్మన్ తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సోము వీర్రాజు మీదకు వెళ్లారు. తాము నిరసన తెలువుతుంటే మైక్ ఎందుకు తీసుకున్నావ్ అంటూ సోము వీర్రాజు మీద దాడికి యత్నించారు. ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు ఇజ్రాయిల్‌ను అనుసరించారు. మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ సోము వీర్రాజుకు మద్దతు వెళ్లి అడ్డుకున్నారు. ఉద్రిక్తత వాతావరణం మధ్య ఛైర్మన్ మోషేన్ రాజు సభను వాయిదా వేశారు.
సమయం వృథా చేయొద్దంటే దాడి చేస్తారా: అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు 20 నిమిషాలు సమయం ఇచ్చిన ఛైర్మన్ మంత్రి సమాధానానికి 7 నిమిషాల కేటాయించారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని ఛైర్మన్‌ను కోరే సమయంలో ఇజ్రాయిల్ తనపై దాడికి యత్నించారని తెలిపారు. విలువైన సభా సమయం వృథా చేయొద్దు అని కోరితే దాడికి యత్నం తగునా అని ప్రశ్నించారు. వెంటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. 319 రూపాయలకి కొనుగోలు చేసేది కల్తీ నెయ్యి కాక మరేంటని నిలదీశారు. దేవుడితో డ్రామాలు ఇకనైనా ఆపాలని సోమువీర్రాజు హితవు పలికారు.
''ప్రశ్నోత్తరాలు జరిపించాలని నేను ఛైర్మన్‌ను అడుగుతుంటే ఒక్కసారిగా దాడికి వచ్చారు. హక్కు ఉందని పదేపదే సభను వాయిదా వేస్తారా. ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశమిచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇవ్వనక్కర్లేదా? విలువైన సభా సమయం వృథా చేయొద్దు అని కోరితే దాడికి యత్నం తగునా.''- సోము వీర్రాజు, ఎమ్మెల్సీ
రాయలసీమ లిఫ్ట్‌పై వాడీ వేడీ చర్చ: ముందు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్‌పై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. రాయలసీమ లిఫ్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీల లబ్ధి కోసం చేసినవేనని మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్‌పై మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ సభ్యులకు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది.
రాయలసీమ లిఫ్ట్‌పై శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరగ్గా మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్సార్సీపీ సభ్యుల ఆరోపణలకు దీటైన సమాధానాలు ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును 2020 మే 20న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపిందని మంత్రి స్పష్టం చేశారు. 2020లో సీఎంగా చంద్రబాబు ఉన్నారా జగన్ ఉన్నారా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాయలసీమ లిఫ్ట్‌ను కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్‌ను నిలిపివేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని అన్నారు. ఈ విషయం గురించి వైఎస్సార్సీపీ సభ్యులు జగన్‌ను ఎందుకు నిలదీయలేదని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.
మంత్రి నిమ్మల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రాయలసీమ లిఫ్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రేవంత్ ప్రకటనపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మండలిని ఛైర్మన్ కాసేపు వాయిదా వేశారు. రాయలసీమ లిఫ్ట్‌పై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్‌రావు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణను నిమ్మల నిలదీశారు. ఆ సమయంలో కొంత వాగ్వాదం జరిగింది.
రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది - ఆడపిల్లల జోలికొస్తే వారికి అదే చివరిరోజు: హొంమంత్రి అనిత
ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్

