కోర్టు వద్దే వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యం - చెప్పినట్లు వినకపోతే కొడుకును చంపేస్తామని వార్నింగ్
తిరుపతిలో రౌడీషీటర్ హత్య కేసు సాక్షి అపహరణ - కోర్టు ప్రాంగణం వద్దే అడ్డగించి బలవంతంగా లాడ్జికి తరలింపు - న్యాయమూర్తి ఎదుట తాము చెప్పిన పేర్లు చెప్పాలని బెదిరింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 6, 2026 at 9:13 AM IST
YSRCP leaders kidnap witness Tirupati : ఓ హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చిన వ్యక్తిని పట్టపగలే అపహరించారు వైఎస్సార్సీపీ నాయకులు. కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా అడ్డగించి బలవంతంగా లాడ్జికి ఎత్తుకెళ్లారు. న్యాయమూర్తి ఎదుట తాము చెప్పిన వ్యక్తుల పేర్లు చెప్పాలని, లేకపోతే నీ కొడుకును చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడి భార్య పోలీసులను ఆశ్రయించడంతో భయపడిపోయి అతడిని వదిలేసి పరారయ్యారు. తిరుపతిలో బుధవారం చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితులంతా వైఎస్సార్సీపీ ముఖ్యనేత భూమన కరుణాకరరెడ్డి అనుచరులు కావడం గమనార్హం. పడమర పీఎస్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే : తిరుపతిలోని కొర్లగుంట ఎస్కే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద 2019 డిసెంబరులో 'బెల్టు మురళి' అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఐదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు మల్లారపు చిన్న అనే వ్యక్తి కోర్టుకు వచ్చారు. అయితే, అనివార్య కారణాల వల్ల కేసు విచారణ గురువారానికి వాయిదా పడినట్లు కోర్టు విధులు నిర్వర్తించే పోలీసు ఆయనకు తెలిపారు.
కేసు వాయిదా పడటంతో మల్లారపు చిన్న కోర్టు నుంచి బయటకు వస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో శీనురెడ్డి, వేణురెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై అక్కడికి చేరుకున్నారు. చిన్నను అడ్డగించి కాసేపు మాట్లాడాలని చెప్పారు. అయితే, వారిద్దరి మాటలను చిన్న పెద్దగా పట్టించుకోకుండా ముందుకు నడిచారు. దీంతో వారు చిన్నాను బలవంతంగా లాక్కెళ్లి స్థానికంగా ఉన్న ఓ లాడ్జికి తరలించారు.
వైఎస్సార్సీపీ నేతల వార్నింగ్ : లాడ్జికి వెళ్లేసరికి అక్కడ వైఎస్సార్సీపీ మీడియా ప్యానలిస్టు పసుపులేటి సురేశ్, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘం నాయకుడు రవి, అతని కుమారుడు, వైఎస్సార్సీపీ యువ నాయకుడు వినయ్‌తో పాటు మరికొందరు ముఠాగా ఉన్నారు. వారంతా చిన్నను చుట్టుముట్టారు. రౌడీషీటర్ హత్య కేసులో తాము చెప్పిన వ్యక్తుల పేర్లను మాత్రమే న్యాయమూర్తి ఎదుట చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. అందుకు చిన్న ససేమిరా అనడంతో వినయ్, పసుపులేటి సురేశ్ కలిసి అతడిని బలవంతంగా ఓ కారులో ఎక్కించారు.
కారులో చిన్నను శ్రీకాళహస్తి వరకు తీసుకెళ్లారు. అక్కడ మేర్లపాక టోల్ ప్లాజా వద్దకు చేరుకుని, సమీపంలోని ఓ హోటల్ గదిలో అతడిని బంధించారు. అయితే, తన భర్త కిడ్నాప్‌కు గురైన విషయం తెలుసుకున్న చిన్న భార్య సుభాషిణి పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు పోలీసులకు భయపడి, బందీగా ఉన్న చిన్నను కారులో ఎక్కించుకుని తిరిగి తిరుపతికి తీసుకొచ్చారు.
కొడుకును చంపేస్తామని బెదిరింపులు : తిరుపతికి తీసుకొచ్చిన అనంతరం క్రైమ్ పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్నను కారు దించారు. "కోర్టులో మేం చెప్పినట్లే చేయాలి. లేకపోతే నీ కొడుకు నరసింహులును చంపేస్తాం" అంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకున్న బాధితుడు చిన్న పడమర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వినయ్, రవి, పసుపులేటి సురేశ్, వేణురెడ్డి, శీనురెడ్డిలతో పాటు మరికొందరిపై బెదిరింపులు, అపహరణ కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పొగాకు వ్యాపారి కిడ్నాప్ - నిందితుల ఆచూకీ చెప్తే బహుమతి
'డబ్బులివ్వకుంటే నీ కొడుకు నీకు దక్కడు' - వైఎస్సార్సీపీ నేత 'ముస్తఫా' ముఠా బరితెగింపు!

