మేమొచ్చిన రెండు నెలల్లోనే వారందరీనీ జైల్లో పెడతాం : వైఎస్ జగన్
వైద్య కళాశాలల నిర్వాహకులకు వైఎస్ జగన్ హెచ్చరికలు - పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల ప్రతులు లోక్‌భవన్‌లో అప్పగింత

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 19, 2025 at 9:51 AM IST
YS Jagan Meet YSRCP Leaders in Tadepalli: ప్రైవేటీకరణ కుంభకోణంపై కోర్టుకెళ్తాం, కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం వెనుక పెద్ద స్కాం ఉందనీ, తాము అధికారంలోకి రాగానే దాని వెనుక ఉన్న వాళ్లందరినీ జైల్లో పెడతామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల్లో చేపట్టిన వాటన్నింటినీ రద్దు చేస్తామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.
మేమొచ్చిన రెండు నెలల్లో మీరంతా జైలుకే: ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టేది లేదనీ, మేమొచ్చిన రెండు నెలల్లోనే వారిని జైల్లో పెడతామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళతామన్న జగన్ అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అప్పటికీ చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని వివరించారు. గవర్నర్‌ను కలిసేందుకు ముందు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో జగన్ సమావేశమయ్యారు.
పీపీపీ కి వ్యతిరేకంగా సంతకాలు: ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయని, సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడమంటే ఇది మరో పెద్ద స్కామ్ అని జగన్ అన్నారు. రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు చొప్పున పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు చెల్లించడం పెద్ద కుంభకోణం అని జగన్ ఆరోపించారు. ప్రైవేటు పరం చేస్తే పేదలకు ఉచిత వైద్యం అందదనీ, విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా రావని విమర్శించారు. ప్రజా ఉద్యమంలో లక్ష్యాన్ని మించి ఏకంగా 1,04,11,136 సంతకాలను సేకరించినట్లు జగన్ తెలిపారు.
సంతకాల ప్రతులు గవర్నర్‌కు అప్పగింత: వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 1.04 కోట్ల మంది చేసిన సంతకాల ప్రతులను గవర్నర్‌కు చూపించాం. గవర్నర్‌కు పెద్ద మనసుండటంతో, ఈ అన్యాయంపై కొంచెం ఎక్కువ బాధపడ్డారు. మా పోరాటానికి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని జగన్ చెప్పారు. ఈ సంతకాలతో కోర్టులోనూ పిటిషన్ వేయబోతున్నట్లు చెప్పారు. తాము ఇన్ని చేసినా చంద్రబాబు మారకపోవచ్చంటూ పరుష పదాలతో విమర్శించారు.
విశాఖకు తలమానికం రుషికొండ:జగన్ రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు, ఆ డబ్బుతో రెండు వైద్య కళాశాలలు కట్టి ఉండవచ్చన్న సీఎం వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా అందుకు బదులిస్తూ రుషికొండపై నేను రూ.240 కోట్లతో కట్టిన భవనం ఇప్పుడు విశాఖపట్నానికే తలమానికంగా, రాజభవనంలా, మాన్యుమెంట్‌గా మారింది. అదే చంద్రబాబు ఒక్కరోజు యోగా పేరుతో రూ.330 కోట్లు ఆవిరి చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
కలెక్టర్ల పనితీరు బాగోలేకపోవడం వల్ల తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని జగన్ విమర్శించారు. మరో మూణ్నెలల్లో ఈ ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ కాలంలో ప్రజలకు ఒరిగింది పెద్ద సున్నా. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. మీ పనితీరు బాగోలేదు కాబట్టే మీ గ్రాఫ్‌ను ఎంతలేపినా పైకి లేవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
లోక్‌భవన్ వద్ద జై జగన్ నినాదాలు: గవర్నర్‌ను కలవాలంటే ముందస్తు అనుమతి ఉన్నవారు మాత్రమే లోక్‌భవన్‌కు రావాలి. కానీ, గురువారం జగన్‌తోపాటు ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లోక్‌భవన్ పరిసరాలకు చేరుకుని జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అక్కడ పోలీసులు, భద్రతా సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా వినకుండా లోక్‌భవన్ ప్రవేశద్వారం సమీపానికి వెళ్లి హడావుడి చేశారు
వాహనాలతో హల్‌చల్: సంతకాల పత్రాల లోడ్‌తో ఉన్న వాహనాలను లోక్‌భవన్‌కు పంపేందుకు గురువారం ఉదయం జగన్ తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపారు. అప్పుడూ బారీగా జనాన్ని సమీకరించి అక్కడ హల్‌చల్ చేశారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్‌లో జగన్, ఆయనతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు లోక్‌భవన్‌కు బయల్దేరారు. అయితే ఆ కాన్వాయ్‌తో పాటు బైక్ ర్యాలీని సైతం చేపట్టారు.
దీంతో వారధిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వారధి దాటాక కృష్ణలంక వద్ద కూడలిలో వైకాపా నేతలు భారీగా మహిళలు, ఇతర కార్యకర్తలను సమీకరించి గందరగోళం సృష్టించారు. అక్కడా ట్రాఫిక్ అటూ ఇటూ కదల్లేని పరిస్థితి కల్పించారు.
"వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 1.04 కోట్ల మంది చేసిన సంతకాల ప్రతులను గవర్నర్‌కు చూపించాం. ఈ సంతకాలతో కోర్టులోనూ పిటిషన్ వేయబోతున్నాం. మా పోరాటానికి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం"-వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు

